పోటీ ఉంటుందా?

జోరు మీదున్న టీమ్‌ఇండియా మరో సిరీస్‌పై కన్నేసింది. తొలి వన్డేలో జింబాబ్వేను చిత్తుచేసిన భారత్‌.. శనివారం రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే జట్టు సిరీస్‌ సొంతం చేసుకోవాలని చూస్తోంది. తొలి వన్డేలో ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయిన ఆతిథ్య జట్టు.. ఈ మ్యాచ్‌లో అయినా భారత్‌ను

Updated : 20 Aug 2022 07:02 IST

నేడు జింబాబ్వేతో రెండో వన్డే

సిరీస్‌పై టీమ్‌ఇండియా కన్ను

(మధ్యాహ్నం 12.45 నుంచి)

హరారె

జోరు మీదున్న టీమ్‌ఇండియా మరో సిరీస్‌పై కన్నేసింది. తొలి వన్డేలో జింబాబ్వేను చిత్తుచేసిన భారత్‌.. శనివారం రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే జట్టు సిరీస్‌ సొంతం చేసుకోవాలని చూస్తోంది. తొలి వన్డేలో ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయిన ఆతిథ్య జట్టు.. ఈ మ్యాచ్‌లో అయినా భారత్‌ను దీటుగా ఎదుర్కొంటుందా అన్నది చూడాలి.

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసిన భారత్‌.. మరో పోరుకు సిద్ధమైంది. నేడు జరిగే రెండో వన్డేలోనూ కళ్లన్నీ రాహుల్‌పైనే ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ ఏడాది ఐపీఎల్‌ తర్వాత తిరిగి తొలి సిరీస్‌ ఆడుతున్న అతనికి ఆసియా కప్‌నకు ముందు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ అవసరం. మంచి ఫామ్‌లో ఉన్న ధావన్‌, గిల్‌ను తొలి వన్డేలో ఓపెనర్లుగా పంపి కెప్టెన్‌గా విజయాన్ని దక్కించుకున్న అతను.. ఇప్పుడు బ్యాటర్‌గానూ తిరిగి లయ అందుకోవాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్‌లో ఓపెనర్లే అజేయంగా నిలవడంతో అతనికి బ్యాటింగ్‌ చేసే అవకాశమే రాలేదు. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేస్తే మనవాళ్లకు అక్కడి పిచ్‌ పరిస్థితులు సవాలు విసిరే ఆస్కారముంది. బౌన్సీ ట్రాక్‌పై చలి వాతావరణాన్ని తట్టుకుని ఎలా బ్యాటింగ్‌ చేస్తారన్నది ఆసక్తికరం. ప్రత్యర్థి జట్టులో ప్రమాదకరమైన బౌలర్లు ఎవరూ లేనప్పటికీ.. పరిస్థితులే బ్యాటర్లకు పరీక్ష పెట్టే అవకాశముంది. తొలి గంట ఆటలో బ్యాటర్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారన్నది కీలకం. ఈ మ్యాచ్‌లోనూ పిచ్‌ పరిస్థితుల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

ప్రయోగాలు చేస్తారా?

తొలి వన్డేలో ఏ రకంగానూ పోటీ ఇవ్వలేక చతికిలపడ్డ జింబాబ్వేతో మిగిలిన రెండు మ్యాచ్‌లను భారత్‌ ప్రయోగాల కోసం వాడుకుంటుందా? అన్నది ప్రశ్న. ఒకవేళ ధావన్‌ ముంజేతి గాయం తీవ్రమై.. అతను రెండో వన్డేకు దూరమైతే అప్పుడు ఓపెనింగ్‌ జోడీ విషయంలో మార్పు జరగొచ్చు. రాహుల్‌.. గిల్‌ లేదా ఇషాన్‌ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశాలను కొట్టిపారేయలేం. అలాగే ఆసియా కప్‌లో ఆడే జట్టుకు ఎంపికైన దీపక్‌ హుడాను మరోసారి టాప్‌ఆర్డర్‌లో ఆడించే ప్రయత్నమూ చేయొచ్చు. అతనికీ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ అవసరం. బౌలింగ్‌లోనూ పునరాగమనాన్ని ఘనంగా చాటుతూ గత మ్యాచ్‌లో దీపక్‌ చాహర్‌ తన స్వింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను దెబ్బకొట్టాడు. వరుసగా ఏడు ఓవర్లు వేసి తన ఫిట్‌నెస్‌ను చాటుకున్నాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ ఎప్పటిలాగే తన షార్ట్‌పిచ్‌ బంతులతో వికెట్ల వేటలో దూసుకెళ్తున్నాడు. మంచి వేగం, నియంత్రణతో బౌలింగ్‌ చేస్తున్న హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ వికెట్లను రాబట్టడంలో మరింత మెరుగవ్వాలి. తన స్పిన్‌తో అక్షర్‌ పటేల్‌ ప్రత్యర్థిని చుట్టేస్తున్నాడు. ఒకవేళ మన జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంటే.. ఛేదనలో మన బౌలర్లు ప్రత్యర్థికి ఎలా కళ్లెం వేస్తారో చూడాలి. రెండో వన్డేలో ఓడితే సిరీస్‌ చేజారే ప్రమాదం ఉంది కాబట్టి జింబాబ్వే పుంజుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ చకబ్వ, సికందర్‌ రజాపైనే జట్టు ఆశలు పెట్టుకుంది. బెంచ్‌ బలం కూడా లేకపోవడం ఆ జట్టుకు మరో ప్రతికూలాంశం.


తుది జట్లు (అంచనా)

భారత్‌: ధావన్‌, గిల్‌, ఇషాన్‌, కేఎల్‌ రాహుల్‌, దీపక్‌ హుడా, శాంసన్‌, అక్షర్‌, దీపక్‌ చాహర్‌, కుల్‌దీప్‌, ప్రసిద్ధ్‌, సిరాజ్‌

జింబాబ్వే: మరుమని, ఇన్నోసెంట్‌ కయా, సీన్‌ విలియమ్స్‌, వెస్లీ, సికందర్‌, చకబ్వ, ర్యాన్‌ బర్ల్‌, జాంగ్వె, ఎవాన్స్‌, విక్టర్‌ న్యాచి, రిచర్డ్‌ ఎంగరవ


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని