ఉమ్మిపై నిషేధం శాశ్వతం

బంతిపై ఉమ్మి రాయడంపై నిషేధం ఇక శాశ్వతం. ఐసీసీ మంగళవారం క్రికెట్‌ నియమ నిబంధనల్లో అనేక మార్పులను ప్రకటించింది. అక్టోబరు 1 నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. మన్కడింగ్‌ ఇంకెంతమాత్రం అన్యాయమైన రనౌట్‌ కాదు. బంతి వేయకముందే ముందుకు కదిలే నాన్‌స్ట్రైకర్‌ను రనౌట్‌ చేయడాన్ని ‘అన్యాయమైన ఆట’

Published : 21 Sep 2022 04:20 IST

ప్లేయింగ్‌ కండిషన్స్‌లో పలు మార్పులు ప్రకటించిన ఐసీసీ

దుబాయ్‌: బంతిపై ఉమ్మి రాయడంపై నిషేధం ఇక శాశ్వతం. ఐసీసీ మంగళవారం క్రికెట్‌ నియమ నిబంధనల్లో అనేక మార్పులను ప్రకటించింది. అక్టోబరు 1 నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. మన్కడింగ్‌ ఇంకెంతమాత్రం అన్యాయమైన రనౌట్‌ కాదు. బంతి వేయకముందే ముందుకు కదిలే నాన్‌స్ట్రైకర్‌ను రనౌట్‌ చేయడాన్ని ‘అన్యాయమైన ఆట’ జాబితా నుంచి తప్పించారు. ఇకపై ఇలాంటి ఔట్లపై చర్చకు తెరపడ్డట్లే.

మార్పులివి..

* కొవిడ్‌-19 మహమ్మారి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇంతకుముందు బంతిపై ఉమ్మిరాయడాన్ని తాత్కాలికంగా నిషేధించిన సంగతి తెలిసిందే. ఆ నిషేధం ఇప్పుడు శాశ్వతం.

* ఓ బ్యాటర్‌ క్యాచ్‌ ఔటైనప్పుడు కొత్త బ్యాటర్‌ ఇకపై స్ట్రైకర్‌ ఉన్న వైపే బ్యాటింగ్‌కు రావాలి. క్యాచ్‌కు ముందు బ్యాటర్లు క్రాస్‌ అయ్యారా లేదా అన్నదానితో సంబంధం లేదు.

* బ్యాటర్‌ ఔటయ్యాక వచ్చే కొత్త బ్యాటర్‌ టెస్టు, వన్డేల్లో రెండు నిమిషాల్లో స్ట్రైకింగ్‌కు సిద్ధంగా ఉండాలి. టీ20ల్లో మాత్రం మార్పులేదు. 90 సెకన్ల సమయమే కొనసాగుతుంది.

* ఇకపై బ్యాటర్‌ లేదా అతడి బ్యాట్‌లో కొంత భాగమైనా పిచ్‌లో ఉండాలి. లేదంటే బంతిని డెడ్‌బాల్‌ ప్రకటిస్తారు. అంటే బ్యాటర్‌, అతడి బ్యాట్‌ పూర్తిగా పిచ్‌ నుంచి దూరంగా వెళ్లకూడదు. బ్యాటర్‌ పూర్తిగా పిచ్‌ను దాటక తప్పని స్థితిని కల్పించే బంతి నోబాల్‌ అవుతుంది.

* బౌలర్‌ బౌలింగ్‌ చేయడానికి పరిగెడుతున్నప్పుడు ఏ ఫీల్డరైనా అనుచితంగా, ఉద్దేశపూర్వకంగా కదిలితే.. బ్యాటింగ్‌ జట్టుకు అంపైర్‌ అయిదు పరుగులు పెనాల్టీగా ఇవ్వొచ్చు. అది డెడ్‌బాల్‌ అవుతుంది కూడా.

* ఇంతకుముందు బౌలర్‌ బౌలింగ్‌ చేయడానికి పరుగు ఆరంభించడానికి ముందు.. బ్యాటర్‌ ముందుకు రావడం చూస్తే అతణ్ని ఔట్‌ చేయడానికి స్టంప్స్‌కు బంతిని విసిరేవాడు. ఇప్పుడలా చేస్తే దాన్ని డెడ్‌బాల్‌గా ప్రకటిస్తారు

* టీ20ల్లో ప్రస్తుతం ఏ జట్టయినా  నిర్దేశిత సమయం ప్రకారం బౌలింగ్‌ చేయకపోతే ఆ జట్టుకు పెనాల్టీగా 30 గజాల వలయం ఆవల ఓ ఫీల్డర్‌ను తగ్గిస్తున్నారు. ఇకపై వన్డేల్లోనూ ఈ నిబంధనను అమలు చేస్తారు.

* మన్కడింగ్‌కు సంబంధించి కూడా కీలక మార్పు చేశారు. దీన్ని క్రీడాస్ఫూర్తికి విరుద్ధమైన రనౌట్‌ జాబితా నుంచి తప్పించి, రనౌట్‌ జాబితాలో చేర్చారు. బంతి వేయకముందే క్రీజు దాటే నాన్‌స్ట్రైకర్‌ను రనౌట్‌ చేయడాన్ని ఇంతకుముందు అన్యాయమైందిగా పరిగణించేవాళ్లు. దీనిపై తీవ్ర స్థాయిలో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. భారత ఆఫ్‌స్పిన్నర్‌ అశ్విన్‌ లాంటి ఆటగాళ్లు మన్కడింగ్‌ చేయడాన్ని న్యాయంగా ఔట్‌ చేయడంగా పరిగణించాలని ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని