Dinesh Karthik-Ashwin: ఆ ఇద్దరి కథ ముగిసినట్లే..!

సీనియర్‌ ఆటగాళ్లు దినేశ్‌ కార్తీక్‌, అశ్విన్‌ల టీ20 కెరీర్‌ ముగిసినట్లే! పొట్టి ఫార్మాట్లో ఆడడం బహుశా వారికి ఈ ప్రపంచకప్‌తోనే ఆఖరు కావొచ్చు. చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ న్యూజిలాండ్‌తో పొట్టి సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టును చూస్తే వచ్చే టీ20 ప్రపంచకప్‌ (2024, వెస్టిండీస్‌-అమెరికా)కు వచ్చే తరాన్ని సిద్ధం చేసే పనిని ప్రారంభించినట్లు అర్థమవుతుంది.

Updated : 01 Nov 2022 07:53 IST

అడిలైడ్‌: సీనియర్‌ ఆటగాళ్లు దినేశ్‌ కార్తీక్‌, అశ్విన్‌ల టీ20 కెరీర్‌ ముగిసినట్లే! పొట్టి ఫార్మాట్లో ఆడడం బహుశా వారికి ఈ ప్రపంచకప్‌తోనే ఆఖరు కావొచ్చు. చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ న్యూజిలాండ్‌తో పొట్టి సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టును చూస్తే వచ్చే టీ20 ప్రపంచకప్‌ (2024, వెస్టిండీస్‌-అమెరికా)కు వచ్చే తరాన్ని సిద్ధం చేసే పనిని ప్రారంభించినట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం ప్రపంచకప్‌ జట్టులో ఉన్న 37 ఏళ్ల కార్తీక్‌ను కివీస్‌తో టీ20లకు విస్మరించారు. అలాగే 36 ఏళ్ల అశ్విన్‌ను కూడా ఎంపిక చేయలేదు. కెప్టెన్‌ రోహిత్‌ అండతో నాలుగేళ్ల విరామం తర్వాత అశ్విన్‌ టీ20ల్లో పునరాగమనం చేశాడు. కానీ ఈ ప్రపంచకప్‌ తర్వాత అతడు దేశం తరఫున పొట్టి క్రికెట్‌ ఆడితే ఆశ్చర్యమే. ‘‘కొన్ని రోజుల్లో ప్రపంచకప్‌ పూర్తవుతుంది. ఎవరికి విశ్రాంతి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో మేం నిర్ణయించాలి. కార్తీక్‌ అందుబాటులోనే ఉన్నాడు. కానీ ప్రపంచకప్‌ తర్వాత ఇతర ఆటగాళ్లను ప్రయత్నించాలనున్నాం’’ అని చేతన్‌ శర్మ చెప్పాడు. కానీ మరీ ఎక్కువ క్రికెట్టేమీ ఆడని కార్తీక్‌కు విశ్రాంతి ఇవ్వడానికి కారణమేంటో మాత్రం అతడు వెల్లడించలేదు. అతణ్ని పక్కన పెట్టి భవిష్యత్తుపై దృష్టిసారించాలన్న నిర్ణయానికి సెలక్టర్లు వచ్చినట్లు భావిస్తున్నారు. పంత్‌, సంజు శాంసన్‌, హార్దిక్‌ పాండ్యలను ఫినిషర్లుగా తయారు చేయడంపై దృష్టిసారించనన్నుట్లు తెలుస్తోంది. టీ20 జట్టులోకి శుభ్‌మన్‌ గిల్‌ను తీసుకోవడం.. ఓపెనర్‌ రాహుల్‌కు హెచ్చరికే.


బంగ్లాతో పోరుకు కార్తీక్‌ అనుమానం

అడిలైడ్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో పోరులో వెన్ను నొప్పితో మైదానం వీడిన భారత వికెట్‌కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ బుధవారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆడేది అనుమానమే. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్లో వెన్నునొప్పితో కార్తీక్‌ పెవిలియన్‌ చేరడంతో అతడి స్థానంలో రిషబ్‌ పంత్‌ కీపింగ్‌ చేశాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు కార్తీక్‌ దూరమైతే అతడి బదులు పంత్‌ ఆడనున్నాడు. తీవ్రమైన చలి ప్రభావం వల్లే కార్తీక్‌ వెన్నుకు సంబంధించిన సమస్యను ఎదుర్కొంటున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ‘‘కార్తీక్‌ వెన్ను భాగంలో నొప్పితో బాధపడుతున్నాడు. అయితే దాని తీవ్రత ఎంతన్నది తెలియలేదు. ఈ ఇబ్బంది నుంచి అతడిని వేగంగా బయటపడేసేందుకు మా వైద్య బృందం ప్రయత్నిస్తోంది. అందుకే అతడు తర్వాత మ్యాచ్‌లో ఆడతాడన్న విషయాన్ని కొట్టిపారేయలేం’’ అని బీసీసీఐ అధికారి తెలిపాడు. ఈ టోర్నీలో బ్యాటింగ్‌ చేసిన రెండు మ్యాచ్‌ల్లో (పాక్‌, దక్షిణాఫ్రికా) కలిపి కార్తీక్‌ 7 పరుగులే చేయగలిగాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని