t20 world cup 2022: దంచికొట్టి.. దర్జాగా

ఎవరు ఎవరిపై గెలుస్తారో.. ఎవరు ఎవరికి షాకిస్తారో.. ఎప్పుడేం జరుగుతుందో అన్నట్లు సాగుతూ.. అనూహ్య ఫలితాలకు, సంచలనాలకు కేంద్రంగా మారిన ఈ టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-12 చివరి రోజు కూడా అదే ఒరవడి కొనసాగింది.

Updated : 07 Nov 2022 08:00 IST

అగ్రస్థానంతో సెమీస్‌కు భారత్‌
సూర్య నిప్పులు..
జింబాబ్వే చిత్తు

ఎవరు ఎవరిపై గెలుస్తారో.. ఎవరు ఎవరికి షాకిస్తారో.. ఎప్పుడేం జరుగుతుందో అన్నట్లు సాగుతూ.. అనూహ్య ఫలితాలకు, సంచలనాలకు కేంద్రంగా మారిన ఈ టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-12 చివరి రోజు కూడా అదే ఒరవడి కొనసాగింది. సెమీస్‌కు పక్కా అనుకున్న దక్షిణాఫ్రికా ఇంటిముఖం పట్టింది. కథ ముగిసిందనుకున్న పాకిస్థాన్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. నెదర్లాండ్స్‌ లాంటి చిన్న జట్టు సాధికారిక ఆటతో సఫారీ జట్టుకు షాకిచ్చి సెమీస్‌ ముఖచిత్రాన్ని మార్చేసింది. బంగ్లాదేశ్‌పై కొంచెం కష్టపడ్డా పాకిస్థాన్‌ విజయం సాధించడంతో ఆ జట్టు ముందంజ వేసింది. దక్షిణాఫ్రికా ఓటమితో భారత్‌కు ముందే సెమీస్‌ బెర్తు ఖరారైపోవడంతో.. జింబాబ్వేపై ప్రశాంతంగా పని పూర్తి చేసింది. బ్యాటుతో, బంతితో రెచ్చిపోయి సూపర్‌-12 దశలో అన్ని జట్లనూ మించిన ఉత్తమ ప్రదర్శనతో సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్‌ను భారత్‌, న్యూజిలాండ్‌ను పాక్‌ ఓడిస్తే.. చిరకాల ప్రత్యర్థుల మధ్య 2007 తరహా మహా ఫైనల్‌ పోరును మళ్లీ చూడొచ్చు.

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 దశలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా ఆడిన అయిదు మ్యాచ్‌ల్లో అత్యధికంగా నాలుగు విజయాలతో టీమ్‌ఇండియా ముందంజ వేసింది. ఆదివారం సూపర్‌-12 చివరి మ్యాచ్‌లో రోహిత్‌ సేన 71 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసి గ్రూప్‌-2లో అగ్రస్థానంతో సెమీస్‌కు దూసుకెళ్లింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (61 నాటౌట్‌; 25 బంతుల్లో 6×4, 4×6) సంచలన ఇన్నింగ్స్‌కు కేఎల్‌ రాహుల్‌ (51; 35 బంతుల్లో 3×4, 3×6) చక్కటి అర్ధశతకం తోడవడంతో మొదట భారత్‌ 5 వికెట్లకు 186 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం అశ్విన్‌ (3/22), షమి (2/14), హార్దిక్‌ పాండ్య (2/16) విజృంభించడంతో జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది. భువనేశ్వర్‌ (1/11), అర్ష్‌దీప్‌ (1/9) సైతం చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ర్యాన్‌ బర్ల్‌ (35; 22 బంతుల్లో 5×4, 1×6), సికిందర్‌ రజా (34; 24 బంతుల్లో 3×4) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. సూర్య టోర్నీలో రెండో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కించుకున్నాడు. గ్రూప్‌-1లో రెండో స్థానం సాధించిన ఇంగ్లాండ్‌తో గురువారం భారత్‌ సెమీస్‌ ఆడుతుంది. బుధవారం న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ తొలి సెమీస్‌లో తలపడతాయి.

ఆ భాగస్వామ్యం తప్ప..: 187 పరుగుల లక్ష్యం. జింబాబ్వే విజయం గురించి ఎవరికీ ఆలోచన లేదు. కానీ ఆ జట్టు గట్టిగా పోరాడుతుందేమో అనుకుంటే.. ఆరంభంలోనే టపటపా వికెట్లు కోల్పోయి పతనం దిశగా అడుగులు వేసింది. తొలి బంతికే భువి స్వింగ్‌కు బోల్తా కొట్టిన మదివీర (0).. షార్ట్‌ కవర్స్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చాడు. ఆ ఓవర్‌ మెయిడెన్‌ కూడా. తర్వాతి ఓవర్లో అర్ష్‌దీప్‌.. చకబ్వ (0)ను బౌల్డ్‌ చేశాడు. 2/2తో జింబాబ్వే ఛేదన అత్యంత పేలవంగా మొదలైంది. ఎర్విన్‌ (13), సీన్‌ విలియమ్స్‌ (11)ల పోరాటం కాసేపే. సీన్‌ను ఔట్‌ చేసిన షమి.. మున్యోంగ (5)ను కూడా పెవిలియన్‌ చేర్చాడు. 36/5తో జింబాబ్వే ఘోర పరాభవం ముంగిట నిలిచింది. ఈ స్థితిలో సికిందర్‌ రజాతో కలిసి ర్యాన్‌బర్ల్‌ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బర్ల్‌ స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు ఆడాడు. రజా కూడా అడపాదడపా కొన్ని షాట్లు కొట్టడంతో స్కోరు బోర్డు ముందుకు కదిలింది. జింబాబ్వే 96/5తో మెరుగ్గానే కనిపించింది. కానీ అశ్విన్‌.. బర్ల్‌ను బౌల్డ్‌ చేసి మళ్లీ వికెట్ల పతనానికి గేట్లెత్తాడు. అతను ఇంకో రెండు వికెట్లు పడగొట్టడం.. హార్దిక్‌, అక్షర్‌ సైతం చెరో వికెట్‌ రాబట్టడంతో 16 బంతులుండగానే జింబాబ్వే కథ ముగిసింది. చివరి 5 వికెట్లను జింబాబ్వే 25 బంతులు, 19 పరుగుల వ్యవధిలో కోల్పోయింది.

రాహుల్‌ మొదలెడితే.. సూర్య ముగించాడు: కెప్టెన్‌ రోహిత్‌ (15) మరోసారి విఫలమయ్యాడు. కోహ్లి (26) కూడా పెద్ద ఇన్నింగ్స్‌ ఆడలేదు. ఈ ప్రపంచకప్‌లో తొలి అవకాశం దక్కించుకున్న పంత్‌ (3) కూడా విఫలమయ్యాడు. అయినా భారత్‌ 186 పరుగులు చేసిందంటే.. జట్టుకు కేఎల్‌ రాహుల్‌ ఇచ్చిన అదిరే ఆరంభం, సూర్య ఇచ్చిన అద్భుత ముగింపే కారణం. రెండు చక్కటి షాట్లు ఆడి, ముజరబాని బౌలింగ్‌లో పుల్‌ షాట్‌ కోసం ప్రయత్నించిన రోహిత్‌.. మిడ్‌ వికెట్‌లో దొరికిపోగా, మంచి ఊపు మీద కనిపించిన విరాట్‌.. సీన్‌ విలియమ్స్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఎడ్జ్‌ తీసుకోవడంతో వెనుదిరిగాడు. పంత్‌ వచ్చీ రాగానే భారీ షాట్‌ ఆడబోయి సీన్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. అయితే ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో రాహుల్‌ చెలరేగుతుండడంతో స్కోరు వేగం తగ్గలేదు. తొలి ఓవర్‌ మెయిడిన్‌ (ఎంగరవ) ఆడినప్పటికీ.. తర్వాతి ఓవర్లో ముజరబాని బౌలింగ్‌లో గత మ్యాచ్‌ను గుర్తుకు తెస్తూ స్క్వేర్‌ లెగ్‌లో భారీ సిక్సర్‌ బాదిన రాహుల్‌ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. తరచుగా బంతిని బౌండరీ దాటిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. అతను వెనుదిరిగాక సూర్య విధ్వంసంతో ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. మైదానం నలుమూలలా అసాధారణ షాట్లతో అతను పరుగుల పంట పండించాడు. సూర్య కేవలం 23 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. ఒక దశలో 160 చేసేలా కనిపించిన భారత్‌.. 180 దాటడానికి కారణం అతనే. చివరి 5 ఓవర్లలో టీమ్‌ఇండియా 79 పరుగులు చేస్తే అందులో 56 సూర్యవే కావడం విశేషం.


2007లోనూ ఇలాగే..

2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ ఫైనల్లో ఢీకొన్నాయి. ఈసారి ఆ అవకాశం లేనట్లే అని అంతా అనుకుంటే.. అనూహ్యంగా సెమీఫైనల్‌ చేరింది పాకిస్థాన్‌. మళ్లీ ఈ రెండు జట్లు మధ్య ఫైనల్‌ జరిగేందుకు అవకాశముంది. ఆ టోర్నీలో సెమీస్‌ చేరిన జట్లలో మూడు జట్లు ఈసారీ సెమీస్‌కు రావడం విశేషం. ఆస్ట్రేలియా స్థానంలో ఇప్పుడు ఇంగ్లాండ్‌ వచ్చింది. అప్పుడు తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ ఢీకొన్నాయి. మరోసారి ఆ రెండు జట్లే తొలి సెమీస్‌ ఆడనున్నాయి. 2007 టోర్నీలోనూ సెమీస్‌కు ముందు భారత్‌ ఒక్క మ్యాచ్‌లో ఓడింది. ఈసారి ఇప్పటివరకు టీమ్‌ఇండియా సఫారీ జట్టు చేతిలో మాత్రమే పరాజయంపాలైంది. మరి అప్పటిలానే.. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఫైనల్‌ జరుగుతుందా? టీమ్‌ఇండియా కప్పు కొడుతుందా..?


రికార్డుల స్కై

టీ20ల్లో పరుగుల వర్షం కురిపిస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌ తాజా ప్రపంచకప్‌లో జింబాబ్వేపై అర్ధసెంచరీ చేసే క్రమంలో రికార్డుల మోత మోగించాడు. ఈ క్యాలెండర్‌ ఏడాదిలో పొట్టి క్రికెట్లో 1000 పరుగుల మైలురాయిని దాటిన అతడు ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాదు పాకిస్థాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (1326) తర్వాత ఈ ఫార్మాట్లో ఒక సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా సూర్య (28 ఇన్నింగ్స్‌లు, 1026 పరుగులు) రికార్డు నెలకొల్పాడు. 186.54 స్ట్రైక్‌రేట్‌.. 44.60 సగటుతో పరుగుల వరద పారించిన సూర్య ఈ క్రమంలో ఒక సెంచరీ, 9 అర్ధసెంచరీలు నమోదు చేశాడు. నిరుడు వేయి పరుగులు చేయడానికి రిజ్వాన్‌కు 983 బంతులు పట్టగా.. సూర్య కేవలం 550 బంతుల్లోనే ఈ రికార్డును అందుకోవడం విశేషం.


ఈసారి అశ్విన్‌..

సెమీఫైనల్‌ ముంగిట ప్రాక్టీస్‌ లాగా జింబాబ్వే మ్యాచ్‌ను టీమ్‌ఇండియా బాగానే ఉపయోగించుకుంది. వరుస వైఫల్యాల నుంచి బయటపడి, గత మ్యాచ్‌లో బంగ్లాపై ఫామ్‌ అందుకున్న రాహుల్‌.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అలాగే చెలరేగి ఆడి అర్ధశతకం సాధించాడు. ఫామ్‌తో తంటాలు పడుతున్న మరో ఆటగాడు అశ్విన్‌.. జింబాబ్వేపై లయ అందుకున్నాడు. చక్కగా బౌలింగ్‌ చేసిన అతను.. మ్యాచ్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. 3 ఓవర్లలో 22 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తున్న బర్ల్‌ను అతను భలేగా బౌల్డ్‌ చేశాడు. అయితే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం మరోసారి విఫలం కావడం, కార్తీక్‌ స్థానంలో లేకలేక అవకాశం దక్కించుకున్న పంత్‌ 3 పరుగులే చేసి వెనుదిరగడం ఈ మ్యాచ్‌లో ప్రతికూలతలు.


21

ఈ క్యాలెండర్‌ ఏడాదిలో రోహిత్‌శర్మ కెప్టెన్సీలో భారత్‌ గెలిచిన టీ20 మ్యాచ్‌లు. ఒక సీజన్లో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా బాబర్‌ అజామ్‌  (20 విజయాలు, 2021లో)ను అధిగమించాడు.


10

టీ20ల్లో భువనేశ్వర్‌ కుమార్‌ వేసిన మెయిడెన్‌ ఓవర్లు. ఈ ఫార్మాట్లో అత్యధిక మెయిడెన్లు విసిరిన బుమ్రా (9)ని దాటాడు.


‘‘సూర్యకుమార్‌ ఆడుతుంటే డగౌట్‌లో అంతా ప్రశాంతంగా ఉండొచ్చు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి షాట్‌లు ఆడుతూ మిగతా ఆటగాళ్లపై అతడు ఒత్తిడి దూరం చేస్తాడు. జట్టు కోసం అతడు విశేషంగా రాణిస్తున్నాడు’’

- రోహిత్‌శర్మ


సూర్య ఆట ఆనందాన్నిస్తోంది

‘‘సూర్య కచ్చితంగా అసాధారణమైన ఆటగాడు. అతని ఆట చూస్తుంటే ఆనందం కలుగుతోంది. ఆ ఫామ్‌లో అతని బ్యాటింగ్‌ సంతోషాన్నిస్తోంది. పిచ్‌పై అడుగుపెట్టిన ప్రతిసారి అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడు. అందుకే ప్రస్తుతం ప్రపంచంలో నంబర్‌వన్‌ టీ20 బ్యాటర్‌ అయ్యాడు. అలాంటి స్ట్రైక్‌రేట్‌తో నిలకడగా ఆడడం అంత సులభం కాదు. అతనెంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. తన ఆట, ఫిట్‌నెస్‌ గురించి ఆలోచిస్తాడు. నెట్స్‌లో ఎంతో శ్రమిస్తాడు’’

- రాహుల్‌ ద్రవిడ్‌


భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) మసకద్జ (బి) రజా 51; రోహిత్‌ (సి) మసకద్జ (బి) ముజరబాని 15; కోహ్లి (సి) బర్ల్‌ (బి) విలియమ్స్‌ 26; సూర్యకుమార్‌ నాటౌట్‌ 61; పంత్‌ (సి) బర్ల్‌ (బి) విలియమ్స్‌ 3; హార్దిక్‌ (సి) ముజరబాని (బి) ఎంగరవ 18; అక్షర్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 186; వికెట్ల పతనం: 1-27, 2-87, 3-95, 4-101, 5-166; బౌలింగ్‌: ఎంగరవ 4-1-44-1; చటార 4-0-34-0; ముజరబాని 4-0-50-1; మసకద్జ 2-0-12-0; బర్ల్‌ 1-0-14-0; సికిందర్‌ రజా 3-0-18-1; సీన్‌ విలియమ్స్‌ 2-0-9-2

జింబాబ్వే ఇన్నింగ్స్‌: మదివీర (సి) కోహ్లి (బి) భువనేశ్వర్‌ 0; ఎర్విన్‌ (సి) అండ్‌ (బి) హార్దిక్‌ 13; చకబ్వ (బి) అర్ష్‌దీప్‌ 0; సీన్‌ విలియమ్స్‌ (సి) భువనేశ్వర్‌ (బి) షమి 11; సికందర్‌ రజా (సి) సూర్యకుమార్‌ (బి) హార్దిక్‌ 34; మున్యోంగ ఎల్బీ (బి) షమి 5; బర్ల్‌ (బి) అశ్విన్‌ 35; మసకద్జ (సి) రోహిత్‌ (బి) అశ్విన్‌ 1; ఎంగరవ (బి) అశ్విన్‌ 1; చటార (సి) అండ్‌ (బి) అక్షర్‌ 4; ముజరబాని నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (17.2 ఓవర్లలో ఆలౌట్‌) 115; వికెట్ల పతనం: 1-0, 2-2, 3-28, 4-31, 5-36, 6-96, 7-104, 8-106, 9-111; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3-1-11-1; అర్ష్‌దీప్‌ 2-0-9-1; షమి 2-0-14-2; హార్దిక్‌ 3-0-16-2; అశ్విన్‌ 4-0-22-3; అక్షర్‌ పటేల్‌ 3.2-0-40-1


సెమీస్‌లో ఎవరితో ఎవరు?

పాకిస్థాన్‌ × న్యూజిలాండ్‌
వేదిక: సిడ్నీ, బుధవారం మ।। 1.30

భారత్‌ × ఇంగ్లాండ్‌
వేదిక: అడిలైడ్‌, గురువారం మ।। 1.30


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని