ఆస్ట్రేలియా 16 ఏళ్ల తర్వాత..

ఆస్ట్రేలియా నిరీక్షణ ఫలించింది. 16 ఏళ్ల విరామం తర్వాత ఆ జట్టు ఫిఫా ప్రపంచకప్‌లో నాకౌట్‌ చేరింది. బుధవారం గ్రూప్‌-డి పోరులో సాకరూస్‌ జట్టు 1-0తో డెన్మార్క్‌కు షాకిచ్చింది.

Updated : 01 Dec 2022 04:44 IST

ప్రపంచకప్‌ ప్రిక్వార్టర్స్‌లోకి

డెన్మార్క్‌కు షాక్‌ 

ఆస్ట్రేలియా 1.. డెన్మార్క్‌ 0

అల్‌ వాక్రా: ఆస్ట్రేలియా నిరీక్షణ ఫలించింది. 16 ఏళ్ల విరామం తర్వాత ఆ జట్టు ఫిఫా ప్రపంచకప్‌లో నాకౌట్‌ చేరింది. బుధవారం గ్రూప్‌-డి పోరులో సాకరూస్‌ జట్టు 1-0తో డెన్మార్క్‌కు షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో బంతి నియంత్రణ, ఎటాకింగ్‌లో ఆస్ట్రేలియా కన్నా డెన్మార్కే మెరుగ్గా కనిపించింది. తొలి 25 నిమిషాల్లోనే ఆ జట్టు మూడుసార్లు గోల్‌ ప్రయత్నం చేసింది. కానీ సఫలం కాలేకపోయింది. మరోవైపు ఆరంభంలో డిఫెన్స్‌లో బలహీనంగా కనిపించిన ఆస్ట్రేలియా నెమ్మదిగా జోరందుకుంది. ఒకవైపు డెన్మార్క్‌ దాడులను కాచుకుంటూనే ఎదురుదాడి చేసింది. ప్రథమార్థంలో ఒక్క గోలూ పడలేదు. ద్వితీయార్థంలో ఆస్ట్రేలియా ఓ సంచలన గోల్‌తో డెన్మార్క్‌ను కంగుతినిపించింది. మైదానం మధ్యలో బంతిని దొరకబుచ్చుకున్న మాథ్యూ లెక్‌కీ (60వ ని) మెరుపులా ప్రత్యర్థి గోల్‌ ప్రాంతానికి చొచ్చుకొచ్చాడు. అక్కడ అతడి ప్రయత్నాన్ని నిలువరించడానికి ఓ డెన్మార్క్‌ డిఫెండర్‌ గట్టిగానే ప్రయత్నించాడు. డ్రిబ్లింగ్‌తో మాయ చేసిన లెక్‌కీ.. అతడి కాళ్ల సందు నుంచి బంతిని తన్నేశాడు. గోల్‌ బాక్స్‌కు ఓ మూలగా దూసుకెళ్లిన ఆ బంతి డెన్మార్క్‌ కీపర్‌కు కూడా చిక్కకుండా నెట్‌ని ముద్దాడింది. ఆఖరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుని ఆస్ట్రేలియా విజయాన్నిఅందుకుంది. 3 మ్యాచ్‌ల్లో 2 గెలుపు, ఒక ఓటమితో గ్రూప్‌-డిలో ఆస్ట్రేలియా రెండో స్థానంతో ముందంజ వేసింది. మరోవైపు 2 ఓటములు, ఓ డ్రాతో ప్రపంచ పదో ర్యాంకు జట్టు డెన్మార్క్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని