Sunil Gavaskar : మరి గబ్బా పిచ్‌కు ఎన్ని డీమెరిట్‌ పాయింట్లు ఇచ్చారు..? ఐసీసీపై మండిపడ్డ గావస్కర్‌

ఇందౌర్‌ పిచ్‌‌(Indore Pitch)ను పేలవమంటూ ఐసీసీ(ICC) పేర్కొనడంపై సునీల్‌ గావస్కర్‌‌(Sunil Gavaskar) మండిపడ్డాడు. ఐసీసీ వైఖరిని ఎండగడుతూ పలు ప్రశ్నలు సంధించాడు.

Updated : 04 Mar 2023 17:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : స్పిన్‌కు విపరీతంగా సహకరించి బ్యాటింగ్‌ చాలా కష్టంగా మారిన ఇందౌర్‌ పిచ్‌(Indore Pitch)ను ఐసీసీ(ICC) ‘పేలవమైంది’గా పేర్కొనడంపై మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) మండిపడ్డాడు. మ్యాచ్‌ రిఫరీ నివేదిక ఆధారంగా ఈ పిచ్‌ పేలవం(poor)గా ఉన్నట్లు ఐసీసీ పేర్కొంది. ఈ మైదానానికి మూడు డీమెరిట్‌ పాయింట్లు(demerit points) కేటాయించింది. అయితే ఈ అంశంపై గావస్కర్‌ స్పందించాడు.

గత ఏడాది రెండే రోజుల్లో ముగిసిన గబ్బా పిచ్‌(Gabba Pitch)కు ఎన్ని డీమెరిట్‌ పాయింట్లు కేటాయించారు? అని సన్నీ ప్రశ్నించాడు. ‘‘నాకు ఒక విషయం తెలుసుకోవాలని ఉంది. గత ఏడాది నవంబర్‌లో బ్రిస్బేన్‌ గబ్బా వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ పిచ్‌కు ఐసీసీ ఎన్ని డీమెరిట్‌ పాయింట్లు కేటాయించింది..? అప్పుడు మ్యాచ్‌ రెఫరీ ఎవరు?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.

గబ్బాలో జరిగిన ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలర్లకు ఎక్కువగా సహకరించిన ఈ పిచ్‌కు సంబంధించి ఐసీసీ అప్పట్లో ఒక్క డీమెరిట్‌ పాయింట్‌తో ‘యావరేజ్‌ కంటే తక్కువ’(below average) అని రేటింగ్‌ ఇచ్చింది. ఇప్పుడు ఇదే విషయాన్ని గవాస్కర్‌ లేవనెత్తి.. ఐసీసీ వైఖరిని దుయ్యబట్టాడు.  

ఇక ఇందౌర్‌ వేదికగా జరిగిన మ్యాచ్(IND vs AUS)‌.. మూడో రోజు ఉదయమే ముగిసింది. మ్యాచ్‌లో బంతి విపరీతంగా తిరిగింది. తొలి రోజు ఆరంభం నుంచే ఈ పిచ్‌పై స్పిన్నర్లు విజృంభించారు. ఆసీస్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో భారత ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని