India vs Wales: హాకీ వరల్డ్‌ కప్‌.. వేల్స్‌పై భారత్‌ ఘన విజయం

హాకీ పురుషుల ప్రపంచకప్‌లో భాగంగా రూర్కెలాలోని బిర్సా ముండా స్టేడియంలో గురువారం వేల్స్‌ జట్టుతో భారత్‌ తలపడింది. ఈ ఆటలో వేల్స్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. 

Updated : 19 Jan 2023 22:19 IST

 

భువనేశ్వర్‌: హాకీ ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గురువారం పూల్‌-డీలో జరిగిన మ్యాచ్‌లో వేల్స్‌ జట్టుపై 4-2 తేడా విజయం సాధించింది. భారత ఆటగాళ్లలో ఆకాశ్‌ దీప్‌, కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ తమ ఆటతీరుతో జట్టును విజయ పథంలో నడిపించారు.  మ్యాచ్‌ 21వ నిమిషంలో భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ గోల్‌కు ప్రయత్నించగా దాన్ని వేల్స్‌ ఆటగాడు అడ్డుకున్నాడు. వెంటనే మరో భారత ఆటగాడు షంషేర్‌ బంతిని అందుకుని గోల్ కొట్టి ఖాతా తెరిచాడు. తర్వాత 32వ నిమిషంలో ఆకాశ్‌దీప్‌ రెండో గోల్‌ చేశాడు. 

రెండో క్వార్టర్‌లో వేల్స్‌ జట్టు రెండు వరుస గోల్స్‌ కొట్టింది. 42వ నిమిషంలో గారెత్ ఫర్లాంగ్, 44వ నిమిషంలో జాకబ్ డ్రేపర్ గోల్స్‌ చేశారు. దీంతో ఇరుజట్ల స్కోర్లు సమం అయ్యాయి. 45వ నిమిషంలోనే భారత ఆటగాడు ఆకాశ్‌దీప్‌ మరో గోల్‌, తర్వాత 59వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ పెనాల్టీ గోల్‌ కొట్టడంతో భారత్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వరల్డ్‌కప్‌లో భాగంగా గత వారం స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-0 భారత్‌ విజయం సాధించింది. తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. గురువారం పూల్‌-డీలో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 4-0 తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పరంగా ఇంగ్లాండ్, భారత్‌ (9 పాయింట్లు) సమానంగా ఉన్నా..  గోల్స్‌ ఎక్కువగా ఉండటంతో ఇంగ్లీష్‌ జట్టు అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. నాకౌట్‌ బెర్తు కోసం భారత్‌ క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని