NZ Vs IND: దంచేసిన సూర్య.. హడలెత్తించిన హుడా.. భారత్‌ చేతిలో కివీస్‌ చిత్తు

న్యూజిలాండ్‌ (Newzealand)తో ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్‌ (2nd T20 Match)లో టీమ్‌ఇండియా (Team India) 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Updated : 20 Nov 2022 16:49 IST

మౌంట్ మాంగనుయ్‌: న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత స్టార్‌ బ్యాటర్‌, మిస్టర్ 360 ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ (111*: 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతకంతో అదరగొట్టిన వేళ, కివిస్‌ ముందు భారత్‌ 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లు పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ వికెట్లు తీయడంతో... కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ 61 (52) ఒంటరి పోరాటం వృథా అయింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ పైచేయి సాధించింది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. నవంబర్ 22న (మంగళవారం) జరిగే చివరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధిస్తే సిరీస్‌ను సొంతం చేసుకొంటుంది. ఒకవేళ ఓడినా సిరీస్‌ సమమవుతుంది. 

భారీ లక్ష్యం.. విలియమ్సన్‌ ఒంటరి పోరాటం

భారత్‌ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్‌ ఆది నుంచి తడబడుతూనే ఆడింది. పరుగులేమీ చేయకుండానే ఫిన్‌ అలెన్‌ వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విలియమ్సన్‌తో కలిసి కాన్వే కొద్దిసేపు భారత్‌ బౌలర్లకు చెమటలు పట్టించారు. ఈ క్రమంలో వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో అర్షదీప్‌కు క్యాచ్‌ ఇచ్చి కాన్వే (25) వెనుదిరిగాడు. ఆ తర్వాత కివిస్‌ను భారత్‌ బౌలర్లు కుదురుకోనీయలేదు. క్రమంగా వికెట్లు తీస్తూ వచ్చారు.  మరోవైపు విలియమ్సన్‌ ఒంటరి పోరాటం చేసినా, మిగిలిన బ్యాటర్స్‌ నుంచి అతడికి సహకారం లభించలేదు. దీంతో కివిస్‌ 18.5 ఓవర్లకు 126 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో దీపక్ హుడా 4 వికెట్లు తీయగా, చాహల్‌, సిరాజ్‌ రెండేసి వికెట్లు తీశారు. భువనేశ్వర్‌, వాషింగ్టన్‌ సుందర్‌కు చెరో వికెట్‌ దక్కింది.

అంతకు ముందు టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.  సూర్య కుమార్‌ యాదవ్‌ శతకం (111*)తో అదరగొట్టడంతో టీమ్‌ ఇండియా భారీ స్కోరు చేసింది. సూర్య తన టీ20 కెరీర్‌లో రెండో శతకం బాదాడు. కేవలం 49 బంతుల్లో శతకాన్ని నమోదు చేశాడు. తొలుత అర్ధశతకం చేయడానికి 32 బంతులను తీసుకొన్న సూర్య.. ఆ తర్వాత సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు. మరో 17 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను దాటేశాడు. కివిస్‌ బౌలర్లలో సౌథీ మూడు వికెట్లు తీయగా, ఫెర్గూసన్‌ రెండు, సోథి ఒక వికెట్‌ తీశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని