Chess: మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు మరో పరాభవం.. ఈసారీ భారత గ్రాండ్‌మాస్టర్ చేతిలోనే..!

ప్రపంచ చదరంగంలో భారత యువ ఆటగాళ్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ నంబర్‌వన్‌ ర్యాంకర్ మాగ్నస్‌ కార్ల్‌సన్ (Magnus Carlsen)ను ఓడించాడో యువ గ్రాండ్‌ మాస్టర్. అయితే ఇది ఆన్‌లైన్‌ వేదికగా జరిగిన టోర్నీ కావడం విశేషం. 

Updated : 23 Feb 2023 01:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చెస్‌ రారాజుగా పేరొందిన నంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్‌  కార్ల్‌సన్ (Magnus Carlsen) ఇటీవల వరుసగా ఓటములను చవిచూస్తున్నాడు. భారతీయ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద చేతిలో ఇటీవల ఓడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో యువ గ్రాండ్‌ మాస్టర్ చేతిలోనూ కార్ల్‌సన్‌కు పరాభవం తప్పలేదు. ప్రో చెస్‌ లీగ్‌లో భాగంగా కెనడా చెస్‌ బ్రాహ్స్ ఆటగాడు, ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు కార్ల్‌సన్‌పై ఇండియన్‌ యోగిస్‌ ప్లేయర్‌, భారత గ్రాండ్‌ మాస్టర్ విదిత్ గుజ్రాతి (Vidit Gujrathi) విజయం సాధించాడు. 

దాదాపు 16 జట్లు ఆన్‌లైన్‌ వేదికగా తలపడే ఈ టోర్నీ విజేతగా నిలిచిన టీమ్‌కు 1.50 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ అందనుంది. నల్లపావులతో ఆడిన విదిత్ ప్రత్యర్థి కార్ల్‌సన్‌ చేసిన పొరపాట్లను తనకు అనుకూలంగా మార్చుకొన్నాడు. దీంతో కార్ల్‌సన్‌పై విజయం సాధించాడు. ఈ సందర్భంగా విదిత్‌ మాట్లాడుతూ.. ‘‘ఇద్దరం చాలా తీవ్రంగా పోరాడాం. తప్పకుండా విజయం సాధిస్తాననే నమ్మకం నాకుంది. చివరికి గెలిచా’’ అని వ్యాఖ్యానించాడు. కార్ల్‌సన్‌పై విజయం సాధించిన తర్వాత ట్విటర్‌ వేదికగా కూడా విదిత్ స్పందించాడు. ‘‘ఇప్పుడే ఆల్‌టైమ్‌ గ్రేట్‌ దిగ్గజం ఆటగాడిని ఓడించా. అతడే ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌’’ అని ట్వీట్ చేశాడు. దీంతో గతంలో కార్ల్‌సన్‌పై విజయం సాధించిన ఆర్‌ ప్రజ్ఞానానంద , డి గుకేష్, అర్జున్ ఇరిగైసి సరసన విదిత్ చేరిపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని