Pat Cummins: ముంబయిపై ప్యాట్‌ కమిన్స్‌ విస్ఫోటనం

జట్టులో కీలకమైన సూర్యకుమార్‌ గాయం నుంచి కోలుకుని వచ్చాడు. వస్తూనే అర్ధసెంచరీతో సత్తాచాటాడు.. తిలక్‌ వర్మ ఫామ్‌ కొనసాగించాడు.. పొలార్డ్‌ ఆఖర్లో సిక్సర్లతో రెచ్చిపోయాడు.. బౌలర్లూ మొదట్లో కట్టుదిట్టంగా బంతులేసి ప్రత్యర్థిని బాగానే కట్టడి చేశారు. కానీ చివరికి ముంబయికి హ్యాట్రిక్‌ పరాజయమే మిగిలింది. బోణీ కోసం నిరీక్షణ తప్పలేదు. అందుకు కారణం...

Updated : 07 Apr 2022 07:01 IST

14 బంతుల్లోనే అర్ధశతకం 

రాణించిన వెంకటేశ్‌ అయ్యర్‌ 

సూర్య మెరుపులు వృథా

కోల్‌కతా ఘనవిజయం 

ముంబయికి హ్యాట్రిక్‌ ఓటమి 

జట్టులో కీలకమైన సూర్యకుమార్‌ గాయం నుంచి కోలుకుని వచ్చాడు. వస్తూనే అర్ధసెంచరీతో సత్తాచాటాడు.. తిలక్‌ వర్మ ఫామ్‌ కొనసాగించాడు.. పొలార్డ్‌ ఆఖర్లో సిక్సర్లతో రెచ్చిపోయాడు.. బౌలర్లూ మొదట్లో కట్టుదిట్టంగా బంతులేసి ప్రత్యర్థిని బాగానే కట్టడి చేశారు. కానీ చివరికి ముంబయికి హ్యాట్రిక్‌ పరాజయమే మిగిలింది. బోణీ కోసం నిరీక్షణ తప్పలేదు. అందుకు కారణం.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ప్యాట్‌ కమిన్స్‌! అవును.. ఈ సీజన్‌లో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే జట్టు కష్టాల్లో ఉన్నపుడు అడుగుపెట్టి ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చేశాడు. భారత్‌లో జరుగుతున్న టీ20 క్రికెట్‌ లీగ్‌ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన (14 బంతుల్లోనే 50) అర్ధశతకం రికార్డును సమం చేశాడు. కోల్‌కతాకు సీజన్‌లో మూడో విజయాన్ని అందించాడు

పుణె: టీ20 క్రికెట్‌ లీగ్‌లో కోల్‌కతా దూసుకెళ్తోంది. బుధవారం ఆ జట్టు 5 వికెట్ల తేడాతో ముంబయిపై గెలిచింది. మొదట ముంబయి 20 ఓవర్లలో 4 వికెట్లకు 161 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ (52; 36 బంతుల్లో 5×4, 2×6) అర్ధశతకంతో సత్తాచాటాడు. తిలక్‌ వర్మ (38 నాటౌట్‌; 27 బంతుల్లో 3×4, 2×6), పొలార్డ్‌ (22 నాటౌట్‌; 5 బంతుల్లో 3×6) రాణించారు. కమిన్స్‌ (2/49) రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో కోల్‌కతా 5 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. కమిన్స్‌ (56 నాటౌట్‌; 15 బంతుల్లో 4×4, 6×6) వీరవిహారం చేశాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ (50 నాటౌట్‌; 41 బంతుల్లో 6×4, 1×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మురుగన్‌ అశ్విన్‌ (2/25), మిల్స్‌ (2/38) ఆకట్టుకున్నారు. 

కమిన్స్‌.. పిడుగులా

కోల్‌కతా ఛేదన కూడా పేలవంగానే మొదలైంది. తొలి పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు.. 35/2. రహానె (7), శ్రేయస్‌ (10) ఇలా వచ్చి అలా వెళ్లారు. బిల్లింగ్స్‌ (17) సిక్సర్లతో దూకుడు ప్రదర్శించడం.. వెంకటేశ్‌ కూడా జోరు అందుకోవడంతో ఇన్నింగ్స్‌ గాడిన పడ్డట్లు కనిపించింది. కానీ స్పిన్నర్‌ మురుగన్‌ అశ్విన్‌ ప్రత్యర్థిని గట్టిదెబ్బ కొట్టాడు. వరుస ఓవర్లలో బిల్లింగ్స్, నితీశ్‌ రాణా (8)ని ఔట్‌ చేశాడు. రసెల్‌ (11) కూడా ఎక్కువ సేపు నిలవకపోవడంతో మ్యాచ్‌ కోల్‌కతా చేజారుతుందేమో అనిపించింది. కానీ ఈ సారి సునామీ కమిన్స్‌ రూపంలో ముంబయిని ముంచెత్తింది. ఒంటరి పోరాటం చేస్తున్న వెంకటేశ్‌కు జత కలిసిన అతను సిక్సర్లతో చెలరేగాడు. బుమ్రా బౌలింగ్‌లో వరుసగా 6, 4 ఫోర్‌ బాది ఊగిసలాడుతున్న మ్యాచ్‌ను తమ వైపు తిప్పాడు. కోల్‌కతా విజయానికి చివరి అయిదు ఓవర్లలో 35 పరుగులు కావాలి.. మ్యాచ్‌ మరో మూడు ఓవర్లయినా సాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ కమిన్స్‌ ఆ అవకాశమే ఇవ్వలేదు. ఒక్క ఓవర్లోనే కథ ముగించాడు. సామ్స్‌ (1/50) బౌలింగ్‌లో వరుసగా 6, 4, 6, 6 కొట్టిన అతను.. ఆ తర్వాత చివరి రెండు బంతులను 4, 6గా మలచి 16వ ఓవర్లోనే జట్టుకు విజయాన్ని అందించాడు. బంతి ఎలా, ఎక్కడ పడ్డా దానికి బౌండరీ దారే చూపించాడు. మధ్యలో ఓ బంతిని బౌండరీ దగ్గర సిక్సర్‌ వెళ్లకుండా సూర్య అద్భుతంగా అందుకున్నప్పటికీ అది నోబాల్‌గా తేలింది. 

ఆఖర్లో ధనాధన్‌..

పడుతూ లేస్తూ సాగిన ముంబయి.. నాలుగో వికెట్‌కు సూర్య, తిలక్‌ 83 పరుగులు జోడించడంతో కోలుకుంది. అంతకుముందు రోహిత్‌ (3) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. పవర్‌ప్లేలో వికెట్లు తీయడం అలవాటుగా మార్చుకున్న ఉమేశ్‌ (1/25) అతడిని ఔట్‌ చేశాడు. భారత్‌లో టీ20 క్రికెట్‌ లీగ్‌ అరంగేట్ర మ్యాచ్‌లో డెవాల్డ్‌ బ్రెవిస్‌ (29) ఉన్నంతసేపు ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేశాడు. కానీ అతని వికెట్‌ తీసిన కోల్‌కతా.. ఒత్తిడి కొనసాగించడంతో 10 ఓవర్లకు ముంబయి 54/2తో నిలిచింది. పిచ్‌ నుంచి లభిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ బౌలర్లు రెచ్చిపోవడంతో సింగిల్స్‌ తీయడమూ కష్టమైంది. ఉన్నంతసేపూ తడబడ్డ ఇషాన్‌ (14) చివరకు పేలవ షాట్‌తో వికెట్‌ చేజార్చుకున్నాడు. సూర్య కూడా మొదట పరుగుల కోసం చెమటోడ్చాడు. మధ్యలో 33 బంతుల పాటు జట్టుకు ఒక్క బౌండరీ కూడా రాలేదు. వికెట్‌కీపర్‌కు ఎంతో సులువైన క్యాచ్‌ను మధ్యలో వెళ్లి రహానె వదిలేయడంతో తిలక్‌ బతికిపోయాడు. 15 ఓవర్లకు స్కోరు 85/3. ఆ తర్వాతి ఓవర్‌ నుంచి ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. కమిన్స్‌ (2/49) బౌలింగ్‌లో క్రీజులో అడ్డంగా జరిగి తిలక్‌ అమాంతం వికెట్ల మీదుగా బంతిని ఎత్తి స్టాండ్స్‌లో పడేశాడు. అప్పటివరకు పొదుపుగా బౌలింగ్‌ చేసిన మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ (1/32)కూ తన బ్యాట్‌ పదును చూపిస్తూ 6, 4 బాదాడు. నరైన్‌ (0/26) బౌలింగ్‌లో సూర్య మోకాలిపై కూర్చుని కొట్టిన సిక్సర్‌ హైలైట్‌గా నిలిచింది. ఆ క్రమంలో సూర్య ఫోర్‌తో అర్ధశతకం అందుకున్నాడు. కమిన్స్‌ వేసిన చివరి ఓవర్‌ తొలి బంతికే అతను ఔటైనా.. మూడు సిక్సర్లతో పొలార్డ్‌ జట్టు స్కోరు 160 దాటించాడు. చివరి అయిదు ఓవర్లలో జట్టు 76 పరుగులు రాబట్టింది.


రికార్డు సమం

14.. 50 పరుగులు చేసేందుకు కమిన్స్‌ ఆడిన బంతులు. భారత్‌లో టీ20 క్రికెట్‌ లీగ్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం రికార్డును అతను సమం చేశాడు. 2018లో దిల్లీపై పంజాబ్‌ తరపున కేఎల్‌ రాహుల్‌ కూడా 14 బంతుల్లోనే అర్ధసెంచరీ అందుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని