ENG vs BAN: డేవిడ్ మలన్ భారీ శతకం.. జో రూట్ మెరుపులు.. బంగ్లాదేశ్ ముందు భారీ టార్గెట్

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లిష్‌ జట్టు 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది

Published : 10 Oct 2023 14:48 IST

ధర్మశాల: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది. డేవిడ్ మలన్ (140; 107 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ శతకంతో విరుచుకుపడగా.. జో రూట్ (82; 68 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులు మెరిపించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లిష్‌ జట్టు 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. జానీ బెయిర్‌ స్టో (52; 59 బంతుల్లో 8 ఫోర్లు) కూడా రాణించాడు. జోస్ బట్లర్ (20), హ్యారీ బ్రూక్‌ (20), సామ్‌ కరన్ (11) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరగా.. లియామ్‌ లివింగ్‌స్టోన్ (0) డకౌటయ్యాడు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ 4, షారిఫుల్ ఇస్లాం 3,  షకీబ్‌ అల్ హసన్‌, తస్కిన్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు.

తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన బెయిర్‌ స్టో, మలన్ జోడీని షకీబ్‌ అల్ హసన్ విడదీశాడు. షకీబ్‌ బౌలింగ్‌లో బెయిర్‌ స్టో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాత మలన్‌, జో రూట్‌ నిలకడగా బౌండరీలు బాదడంతో సగం ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ 149/1తో నిలిచింది. 91 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న మలన్‌.. శతకం తర్వాత చెలరేగిపోయాడు. హసన్ మిరాజ్‌ వేసిన 33 ఓవర్‌లో వరుసగా 4, 6, 6, 4 బాదేశాడు. ఈ క్రమంలోనే రూట్ అర్ధ శతకం (44 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. తస్కిన్ అహ్మద్‌ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన మలన్.. మెహదీ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి తర్వాతి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 151 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 26-40 ఓవర్ల మధ్య ఇంగ్లాండ్ బ్యాటర్లు 149 పరుగులు రాబట్టారు. దీంతో స్కోరు సునాయసంగా 400 దాటేలా కనిపించింది. కానీ, చివరి 10 ఓవర్లలో బంగ్లా బౌలర్లు కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్ అనుకున్న దానికంటే తక్కువ స్కోరే చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని