Moeen Ali: మొయిన్‌ అలీ యూ-టర్న్.. టెస్టు స్క్వాడ్‌లోకి ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌

చెన్నై సూపర్ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ (Moeen Ali) మళ్లీ జాతీయ టెస్టు జట్టులోకి వచ్చాడు. ఆసీస్‌తో జరిగే యాషెస్‌ సిరీస్‌ కోసం మొయిన్‌ అలీని ఇంగ్లాండ్‌ ఎంపిక చేసింది.

Published : 07 Jun 2023 17:27 IST

ఇంటర్నెట్ డెస్క్: రెండేళ్ల కిందట టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్ అలీ (Moeen Ali) తన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. జూన్ 16 నుంచి ఆస్ట్రేలియాతో యాషెస్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో యాషెస్‌ సిరీస్‌లో (Ashes Series) భాగంగా తొలి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో మొయిన్ అలీకి చోటు దక్కింది.  ఈ మేరకు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటన వెలువరించింది. ‘‘వార్విక్‌షైర్‌ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్ అలీని ఇంగ్లాండ్‌ టెస్టు జట్టులోకి తీసుకోవడం జరిగింది. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో ఆయన సభ్యుడు. జూన్ 16వ తేదీ నుంచి యాషెస్‌ టెస్టు సిరీస్‌ ప్రారంభమవుతుంది’’ అని ఈసీబీ పేర్కొంది. 

గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమైన స్పిన్నర్ జాక్‌ లీచ్‌ స్థానంలో మొయిన్ అలీ జట్టులోకి వచ్చాడు. గతవారం ఐర్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. ఈ సందర్భంగా జాక్‌ లీచ్‌ వెన్నెముక నొప్పితో బాధపడ్డాడు. దీంతో అతడికి విశ్రాంతినిచ్చిన ఇంగ్లాండ్‌ బోర్డు మొయిన్‌ అలీని ఎంపిక చేసింది. 35 ఏళ్ల మొయిన్‌ అలీ 2021లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే, తన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకొనే ముందు బెన్‌ స్టోక్స్, టెస్టు జట్టు ప్రధాన కోచ్ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌, ఇంగ్లాండ్‌ మెన్స్‌ క్రికెట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాబ్‌ కీతో మొయిన్ అలీ చర్చించాడు. వారి సూచనలతో రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. ఇప్పటి వరకు 64 టెస్టు మ్యాచ్‌లు ఆడిన మొయిన్‌ అలీ 2,195 పరుగులతో పాటు 195 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో నాలుగోసారి ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు తరఫున ఈ సీజన్‌లోనూ ఆడాడు. 

అతడి అనుభవం అద్భుతం: రాబ్‌ కీ

‘‘మొయిన్ అలీతో గతవారం మాట్లాడాం. తన టెస్టు క్రికెట్‌ వీడ్కోలును వెనక్కి తీసుకోమని సూచించాం. మళ్లీ టెస్టు క్రికెట్‌ ఆడేందుకు మొయిన్‌ అలీ ఉత్సాహంగా ఉన్నాడు. అతడి అనుభవం, ఆల్‌రౌండ్‌ ప్రదర్శన యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌కు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నా. యాషెస్‌ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేయాలని అలీతోపాటు జట్టు సభ్యులకు శుభాకాంక్షలు చెబుతున్నా’ అని ఇంగ్లాండ్ మెన్స్‌ క్రికెట్‌ ఎండీ రాబ్‌ కీ తెలిపాడు. 

ఇంగ్లాండ్‌ టీమ్‌: 

బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, జొనాథన్ బెయిర్‌స్టో, స్టువర్ట్‌ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్‌ క్రాలే, బెన్ డకెట్, డాన్‌ లారెన్స్, ఓలీ పోప్‌, మ్యాథ్యూ పాట్స్, ఓలీ రాబిన్‌సన్, జో రూట్, జోష్‌ టాంగ్‌, క్రిస్‌ వోక్స్, మార్క్‌ వుడ్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని