Cricket News: బీసీసీఐ ఏజీఎంలో కీలక నిర్ణయాలు.. భారత్‌ ఇంకా మెరుగవ్వాలి.. మెగా టోర్నీకి కేన్‌ సిద్ధం!

Published : 26 Sep 2023 14:49 IST

ఇంటర్నెట్ డెస్క్: మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని ఆరు నెలలు గడవకముందే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్ ప్రపంచకప్‌నకు సిద్ధమైపోయాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌ను భారత్ గెలిచినా.. వరల్డ్ కప్‌లో ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని పాక్‌ మాజీ కెప్టెన్ చెబుతున్నాడు. ఇక బీసీసీఐ వార్షిక సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..

నేను సిద్ధమే..: న్యూజిలాండ్‌ కెప్టెన్

గత వరల్డ్‌ కప్‌ను త్రుటిలో చేజార్చుకున్న న్యూజిలాండ్‌ ఈసారి మాత్రం పట్టువిడవకూడదని భావిస్తోంది. అయితే, ఆ జట్టుకు గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. కెప్టెన్ కేన్ విలియమ్సన్ గత ఐపీఎల్‌లో గాయపడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మైదానంలోకి దిగలేదు. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే, వేగంగా రికవరీ అవుతున్నానని.. భారత్‌ వేదికగా జరగనున్న వరల్డ్‌ కప్‌లో ఆడతానని కేన్‌ స్పష్టం చేశాడు. హైదరాబాద్‌ వేదికగానే పాక్‌తో వార్మప్‌ మ్యాచ్‌ను న్యూజిలాండ్‌ ఆడనుంది. ఈ క్రమంలో కేన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ ప్రపంచకప్‌ సమయానికి సిద్ధమైపోతా. ఫిట్‌నెస్‌పై దృష్టిసారించా. ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. కొన్ని విషయాల్లో కాస్త మెరుగవ్వాల్సి ఉంది. రన్నింగ్‌లో వందశాతం లేకపోయినప్పటికీ.. రోజురోజుకీ ఇంప్రూవ్‌ అవుతున్నా’’ అని వ్యాఖ్యానించాడు.


లోయర్‌ ఆర్డర్‌ను త్వరగా ఔట్ చేయాలి: పాక్‌ మాజీ

రెండో వన్డేలో కీలకమైన ఆసీస్‌ ఆటగాళ్లు త్వరగానే ఔటైనప్పటికీ చివర్లో బ్యాటింగ్‌కు దిగిన సీన్‌ అబాట్ మాత్రం హాఫ్ సెంచరీ సాధించాడు. అతడిని త్వరగా ఔట్ చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఇదే విషయంపై పాక్‌ మాజీ ఆటగాడు సయీద్ అన్వర్ స్పందించాడు. ‘‘సీన్‌ అబాట్ ఇన్నింగ్స్‌ అద్భుతం. భారత బౌలర్లను భయపెట్టాడు. అందుకే, వరల్డ్‌ కప్‌లో లోయర్‌ ఆర్డర్‌ను కట్టడి చేయడంపై టీమ్‌ఇండియా దృష్టిపెట్టాలి. ఇప్పటికీ భారత్‌నే వరల్డ్ కప్‌ ఫేవరెట్లలో ఒకటి. అయితే, డెత్ బౌలింగ్‌ను ఇంకాస్త మెరుగుపర్చుకోవాలి’’ అని ట్వీట్ చేశాడు.


ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌లోకి మరోసారి

సోమవారం గోవా వేదికగా బీసీసీఐ వార్షిక సమావేశం జరిగింది. అందులో కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అలాగే ద్వైపాక్షిక సిరీస్‌ల మీడియా హక్కుల ద్వారా భారీగా ఆర్జించడంపై ప్రశంసలు దక్కాయి. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌లోకి క్యాబ్‌ మాజీ అధ్యక్షుడు అభిషేక్ దాల్మియా, ప్రస్తుత ఐపీఎల్‌ ఛైర్మన్‌ అరుణ్‌ సింగ్‌ ధుమాల్‌ను మరోసారి ఎన్నుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. అపెక్స్ కౌన్సిల్‌లో ఇండియన్ క్రికెటర్ల అసోషియేషన్ ప్రతినిధిగా మాజీ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా కొనసాగే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. కొత్త అధికారిక ప్రతినిధులను త్వరలోనే ఎన్నుకునే అవకాశం ఉంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీలో నుంచి సలీల్‌ అంకోలాను తొలగించాలనే చర్చ జరిగినట్లు వచ్చిన వార్తలను బీసీసీఐ కొట్టిపడేసింది. ఎలాంటిదైనా సరే  వరల్డ్ కప్‌ తర్వాతనే అని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని