IND vs ENG: రోహిత్‌ ఇప్పుడు నిజమైన కెప్టెన్సీ చూపిస్తాడు: ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్‌

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు నుంచి రోహిత్‌ శర్మ (Rohit Sharma) తన నిజమైన కెప్టెన్సీని చూపిస్తాడని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్‌ మాంటీ పనేసర్ అభిప్రాయపడ్డాడు.

Updated : 30 Jan 2024 11:20 IST

ఇంటర్నెట్ డెస్క్: స్వదేశంలో ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల (IND vs ENG 2024) సిరీస్‌లో టీమ్ఇండియాకు షాక్‌ తగిలింది. తొలి టెస్టులో సునాయసంగా విజయం సాధించేలా కనిపించిన భారత్.. అనుహ్యంగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలుపొందడంపై ఆ దేశ మాజీ స్పిన్నర్‌ మాంటీ పనేసర్‌ (Monty Panesar) స్పందించాడు.

‘‘ఇది చాలా పెద్ద విజయం. దీనిని ఎవరూ ఊహించలేదు. విదేశాలలో ఇంగ్లాండ్ సాధించిన కీలక విజయాలలో ఇదీ ఒకటి. మా దేశంలో ఇది పెద్ద వార్త. మేం ప్రపంచ కప్ గెలిచినట్లు అనిపిస్తోంది. ఈ టీమ్‌ తీరు పూర్తిగా భిన్నం. టీమ్‌ఇండియాను చూసి నేర్చుకుంటూ వారినే ఓడించారు. 190 పరుగుల వెనుకంజలో ఉన్న ఇంగ్లాండ్ ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ, ఓలీ పోప్ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి ఆదుకున్నాడు. మేం చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఇది ఒకటి. రోహిత్ శర్మ  నిరాశాజనకంగా కనిపించాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు భారత్ స్వేచ్ఛ ఇవ్వడం మానేయాలి. విరాట్ కోహ్లీ ఉంటే పర్యాటక జట్టు ఆటగాళ్లపై తనదైన శైలిలో స్పందించేవాడు. ఈ మ్యాచ్‌లో గెలిచినా.. సిరీస్‌లో మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ ఓటమి భయంతోనే ఆడుతుంది’’ అని పనేసర్ వివరించాడు.

వైజాగ్‌లో జరిగే రెండో టెస్టుకు గాయాల కారణంగా కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరమైన సంగతి తెలిసిందే. ‘‘వీరిద్దరూ లేకపోవడంతో రోహిత్ శర్మ ప్లాన్‌ మారుతుంది. మిగతా ఆటగాళ్లు నిర్భయంగా ఆడాలని చెబుతాడు. ఇప్పుడు అతడు తన నిజమైన కెప్టెన్సీని చూపిస్తాడు. మొదటి టెస్టులో ఓటమి తర్వాత మా పని అయిపోలేదనే రీతిలో పోరాట పటిమ ప్రదర్శించాలి’’ అని పనేసర్ సూచించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని