Ayodhya: శతాబ్దాల నిరీక్షణకు తెరపడింది.. రామమందిర నిర్మాణంపై పాక్‌ మాజీ క్రికెటర్

అయోధ్య (Ayodhya)లో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగడంపై పాక్‌ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) సంతోషం వ్యక్తం చేశాడు.

Updated : 23 Jan 2024 10:57 IST

ఇంటర్నెట్ డెస్క్: అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ (Pran Pratistha) అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించడం కోసం రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తరలివచ్చారు. యావత్ భారతావని జై శ్రీరాం నినాదాలతో ప్రతిధ్వనించింది. విదేశాల్లోనూ భారతీయులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. విదేశీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు భారత సంతతి ఆటగాళ్లూ రామమందిర నిర్మాణం గురించి స్పందించారు. పాక్‌ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా (Danish Kaneria) హర్షం వ్యక్తం చేశాడు. ప్రాణప్రాతిష్ఠ వేడుకలు జరుగుతుండగా.. అతడు అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో ఆలయాన్ని సందర్శించాడు. అనంతరం అక్కడి హిందువులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ‘‘శతాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ప్రార్థనలు నెరవేరాయి. ప్రాణప్రతిష్ఠ పూర్తయింది’’ అని ఎక్స్‌ (ట్విటర్‌)లో కనేరియా పోస్టు చేశాడు.

దక్షిణాఫ్రికాకు ఆడుతున్న భారత సంతతి క్రికెటర్ కేశవ్ మహరాజ్‌ కూడా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగడంపై సంతోషం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాలోని భారత సంతతి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశాడు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ముగిసిన అనంతరం ‘‘జై శ్రీరాం’’ అని రాముడి ఫొటోను ఎక్స్‌ (ట్విటర్)లో పోస్టు చేశాడు. తన ఆట, డ్యాన్స్‌లతో భారత్‌లోనూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ (David Warner) కూడా అయోధ్య రామమందిర నిర్మాణంపై సంతోషం వ్యక్తం చేశాడు. భారతీయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘‘జై శ్రీరాం ఇండియా’’ అని శ్రీరాముడి ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని