CSK - MS DHONI: మేం పదేళ్ల నుంచి అన్వేషిస్తున్నాం: ధోనీ వారసుడిపై స్టీఫెన్ ఫ్లెమింగ్‌

ఐపీఎల్‌లో (IPL) హాట్‌టాపిక్‌ ధోనీ తర్వాత సీఎస్‌కే నాయకత్వ బాధ్యతలను ఎవరు చేపడతారు? దీనికి సమాధానం మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు.

Updated : 20 Dec 2023 12:26 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ (Chennai Super Kings)ను ఎంఎస్ ధోనీ నడిపించడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే, ధోనీ నాయకత్వ పగ్గాలను వేరే ఆటగాడికి అప్పగిస్తాడనే ప్రచారమూ సాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఐపీఎల్‌ వేలం అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఎస్‌కే కోచ్‌ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత పదేళ్లుగా ధోనీ కెప్టెన్సీ వారసుడి కోసం వేట కొనసాగుతోందని.. అయితే, ‘కెప్టెన్‌ కూల్‌’ మాత్రం ప్రతి ఏడాది అత్యుత్తమంగా జట్టును నడిపిస్తున్నాడని ఫ్లెమింగ్‌ వ్యాఖ్యానించాడు. 

‘‘ఎంఎస్ ధోనీ తర్వాత నాయకత్వ బాధ్యతలను చేపట్టే వారి కోసం గత పదేళ్లుగా మేం అన్వేషిస్తున్నాం. ప్రతి ఏడాది ఇది చర్చగా మారుతోంది. కానీ, ధోనీని గత కొంతకాలంగా చూస్తున్నా .. అతడిలో ఉత్సాహం, ఆటపట్ల అభిరుచి ఏమాత్రం తగ్గలేదు. మేం అలాగే కొనసాగుతాం’’ అని ఫ్లెమింగ్‌ తెలిపాడు.

అతడు ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడాడు..

ఐపీఎల్‌ వేలంలో డారిల్‌ మిచెల్‌ను సీఎస్‌కే కొనుగోలు చేసింది. బెన్‌స్టోక్స్‌ స్థానాన్ని భర్తీ చేయడానికే ఈ నిర్ణయం తీసుకుందనే  కామెంట్లపై స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ స్పందించాడు. ‘‘బెన్‌ స్టోక్స్‌ గత సీజన్‌లో కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. కాబట్టి, అతడి స్థానంలో మరొకరిని తీసుకున్నామనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. అయితే, డారిల్‌ మిచెల్ విభిన్న ఆటగాడు. గత ఏడాదిన్నర నుంచి అతడి ప్రదర్శన అద్భుతం. తీవ్ర ఒత్తిడిలోనూ రాణించగల నేర్పరి. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటాడు. బౌలర్‌గానూ ఉపయోగపడతాడు. చెపాక్‌లో అతడు కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నాం. తప్పకుండా ఈ కొనుగోలు మాకు ఉపయోగపడుతుంది’’ అని ఫ్లెమింగ్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని