PAK vs BAN: రాణించిన ఓపెనర్లు.. ఎట్టకేలకు పాక్‌ విజయం

కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ విజయం సాధించింది.

Updated : 31 Oct 2023 20:51 IST

కోల్‌కతా: ప్రపంచ వన్డేకప్‌ సిరీస్‌లో (ODI WorldCup 2023) వరుసగా నాలుగు పరాజయాల తర్వాత ఎట్టకేలకు పాకిస్థాన్‌ (pakistan) విజయం సాధించింది. కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో (Bangladesh) జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 205 పరుగుల లక్ష్యాన్ని కేవలం 32.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్‌ (68; 69 బంతుల్లో 9×4, 2×6), ఫకర్‌ జమాన్‌ (81; 74 బంతుల్లో 3×4,7×6) అర్ధశతకాలతో చెలరేగిన వేళ.. బంగ్లా నిర్దేశించిన లక్ష్యం చిన్నబోయింది. 7మ్యాచుల్లో మూడింట విజయం సాధించిన పాకిస్థాన్‌.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది.

సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే రన్‌రేట్‌ కీలకమైన నేపథ్యంలో లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్‌ ప్రారంభం నుంచి దూకుడుగానే ఆడింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్‌,  ఫకర్‌ జమాన్‌ బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని హసన్‌ మిరాజ్‌ విడగొట్టాడు.  22వ ఓవర్లో షఫీక్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలి వికెట్‌ ఓపెనర్లిద్దరూ కలిసి 128 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అప్పటికే పాక్‌ లక్ష్యం సగానికి పైగా పూర్తయింది. అక్కడికి నాలుగు ఓవర్ల తర్వాత  మరో ఓపెనర్‌ ఫకర్‌ జమాన్‌ను కూడా మిరాజ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. తొలి డౌన్‌లో వచ్చిన బాబర్‌ అజామ్‌ (9) విఫలమైనప్పటికీ..  మిడిలార్డర్‌లో వచ్చిన మహ్మద్‌ రిజ్వాన్‌ (26*), ఇఫ్తికర్‌ అహ్మద్‌ (17*) లక్ష్యాన్ని పూర్తి చేశారు. మొత్తం మూడు వికెట్లూ మిరాజ్‌కే దక్కడం గమనార్హం.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌.. 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. లిట్టన్ దాస్‌ (45; 64 బంతుల్లో 6 ఫోర్లు), మహ్మదుల్లా (56; 79 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), షకీబ్ అల్ హసన్ (43; 64 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. మెహది హసన్ మిరాజ్ (25) పరుగులు చేశాడు. తాంజిద్ హసన్ (0), నజ్ముల్ హొస్సేన్ శాంటో (4), ముష్పీకర్ రహీమ్ (5), తౌహిద్‌ హృదౌయ్‌ (7), ముఫ్తికర్‌ రెహ్మాన్‌ (3) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. పాక్‌ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, మహ్మద్‌ వసీమ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. హారిస్ రవూఫ్‌ 2, ఉసామా మీర్, ఇఫ్తికార్ అహ్మద్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని