PBKS vs LSG: బౌలర్లూ.. అధైర్యపడొద్దు: పంజాబ్‌ బ్యాటింగ్‌ కోచ్‌

బ్యాటర్లకు స్వర్గధామంగా ఉన్న మొహాలీ పిచ్‌పై పంజాబ్‌ బౌలింగ్‌లో లఖ్‌నవూ బ్యాటర్లు (PBKS vs LSG) వీరబాదుడు బాదేశారు. పంజాబ్‌ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించారు ఈ క్రమంలో తమ జట్టు బౌలర్లకు బ్యాటింగ్‌ కోచ్ మద్దతుగా నిలిచాడు.

Published : 29 Apr 2023 12:17 IST

ఇంటర్నెట్ డెస్క్: సొంతమైదానంలో లఖ్‌నవూ బ్యాటర్ల దాడికి గురైన పంజాబ్‌ బౌలర్లకు (PBKS vs LSG) ఆ ఫ్రాంచైజీ మద్దతుగా నిలిచింది. ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరు.. ఓవరాల్‌గా రెండో అత్యధిక స్కోరు ఇచ్చిన బౌలర్లకు పంజాబ్ బ్యాటింగ్‌ కోచ్ వసీమ్‌ జాఫర్‌ (Wasim Jaffer) అండగా నిలిచాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ 257/5 భారీ స్కోరు చేసింది. పంజాబ్ బౌలర్లు గుర్నూర్ సింగ్‌ (0/42), అర్ష్‌దీప్‌ (1/54), రబాడ (2/52), సామ్ కరన్ (1/38), లివింగ్‌స్టోన్ (1/19) భారీగా పరుగులు సమర్పించారు. టాప్‌ బౌలర్లు అర్ష్‌దీప్‌, రబాడ, సామ్‌ కరన్ కలిసి 11 ఓవర్ల కోటాలో 144  పరుగులు ఇచ్చారు. ఈ క్రమంలో వసీమ్‌ జాఫర్ తన బౌలర్లకు ధైర్యం నూరిపోశాడు. ఇదొక దుర్దినమని, మరీ ఎక్కువగా ఆలోచించకూడదని సూచించాడు. తమ బౌలింగ్‌పై ఎలాంటి ఆందోళన లేదని స్పష్టం చేశాడు. 

‘‘మా బౌలింగ్‌ ఎటాక్‌పై ఎలాంటి ఆందోళన లేదు. క్లిష్టపరిస్థితుల్లో వారు ముగ్గురు (అర్ష్‌దీప్, రబాడ, కరన్) అద్భుతంగా బౌలింగ్‌ వేస్తారు. ఇంతకుముందు ముంబయి, రాజస్థాన్‌పైనా సూపర్‌గా సంధించారు. ఈ మ్యాచ్‌లో పిచ్‌ నుంచి సహకారం లభించలేదు. తప్పకుండా మా బౌలర్లు పుంజుకుని తదుపరి మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన ఇస్తారనే నమ్మకం మాకుంది’’ అని జాఫర్ తెలిపాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ 201 పరుగులు చేసి ఆలౌటైంది.

రెండో స్థానంలో లఖ్‌నవూ.. ఆరులోకి పంజాబ్

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ రాయల్స్‌ 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. పంజాబ్‌పై ఘన విజయం సాధించిన లఖ్‌నవూ, గుజరాత్‌ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ కూడా పదేసి పాయింట్లతో ఉన్నాయి. నెట్‌రన్‌రేట్‌ కారణంగా రాజస్థాన్‌కు తొలి స్థానం, లఖ్‌నవూ రెండు, గుజరాత్‌ మూడు, చెన్నై నాలుగులో నిలిచాయి. లఖ్‌నవూ చేతిలో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్‌ (8 పాయింట్లు) ఆరో స్థానంలోకి చేరింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 8 పాయింట్లతో పంజాబ్‌ కంటే మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇక కోల్‌కతా (6 పాయింట్లు), ముంబయి (6 పాయింట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (4 పాయింట్లు), దిల్లీ క్యాపిటల్స్‌ ( 4 పాయింట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని