World Cup-Sachin: వన్డే ప్రపంచకప్.. సచిన్ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. సచిన్‌ను వన్డే ప్రపంచకప్‌ గ్లోబల్‌ అంబాసిడర్‌గా ఐసీసీ నియమించింది. 

Published : 04 Oct 2023 01:53 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ (Sachin Tendulkar)కు అరుదైన గౌరవం దక్కింది. మరో రెండు రోజుల్లో భారత్‌ వేదికగా ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్‌నకు సచిన్‌ను గ్లోబల్ అంబాసిడర్‌గా ఐసీసీ నియమించింది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య టోర్నీ ఆరంభ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సచిన్ గ్లోబల్ అంబాసిడర్‌ హోదాలో ప్రపంచకప్ ట్రోఫీతో మైదానంలోకి వస్తాడు. దీంతో ఈ ప్రపంచకప్‌ టోర్నీ అధికారికంగా ప్రారంభమవుతుంది. 

అదేవిధంగా ప్రపంచకప్ కోసం ఐసీసీ పలువురు మాజీ క్రికెటర్లను అంబాసిడర్లుగా ప్రకటించింది. ఈ జాబితాలో వెస్టిండీస్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్, ఇంగ్లాండ్‌కు ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా), శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్, రాస్ టేలర్ (న్యూజిలాండ్‌), భారత మాజీ ఆటగాడు సురేశ్ రైనా, మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, మహ్మద్ హఫీజ్ (పాకిస్థాన్) ఉన్నారు.


ఈ నాలుగు జట్లు సెమీస్ చేరతాయి: మైఖేల్‌ వాన్‌ 

ప్రస్తుతం క్రికెట్ ప్రేమికుల దృష్టి అంతా వన్డే ప్రపంచకప్‌పైనే ఉంది. హోరాహోరీగా సాగే ఈ టోర్నీలో టైటిల్‌ను ఏ జట్టు దక్కించుకుంటుంది? ఏఏ జట్లు బలంగా ఉన్నాయి, ఏవి సెమీస్‌కు చేరతాయనే గురించే చర్చించుకుంటున్నారు. అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు సైతం ప్రపంచకప్‌ ఎప్పుడెప్పుడూ ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఏఏ జట్లు సెమీస్‌ చేరతాయనే దానిపై తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్‌ (Michael Vaughan) తాజాగా తన అంచనాలను వెలువరించాడు. ఈ జాబితాలో బలమైన ఆస్ట్రేలియా జట్టుతోపాటు గతేడాది రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. ‘‘ఈ వారం ప్రపంచ కప్ ప్రారంభమయ్యే వరకు వేచి ఉండలేను. నా అంచనా ప్రకారం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, భారత్, పాకిస్థాన్‌ సెమీస్‌కు చేరతాయి’’ అని మైఖేల్‌వాన్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశాడు. 

ఇదిలా ఉండగా.. భారత జట్టుపై మైఖేల్ వాన్‌ (Michael Vaughan) ఇటీవల ప్రశంసలు కురిపించాడు. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్‌ను సాధిస్తుందని మైఖేల్‌వాన్ అభిప్రాయపడ్డాడు. ‘స్వదేశీ పిచ్‌లపై భారత బ్యాటింగ్‌ లైనప్‌ అద్భుతంగా ఉంది. వారి బౌలింగ్ ఆప్షన్లు అన్ని కవర్‌ అయ్యాయి. ఇక ఒత్తిడి మాత్రమే వారిని ఆపగలదు’’ అని పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని