Shubman Gill: విమర్శలకు కౌంటర్‌.. 12 ఇన్నింగ్స్‌ల తర్వాత గిల్ సెంచరీ

భారత యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్‌పై భారత్‌ పట్టు బిగించడంలో కీలక పాత్ర పోషించాడు.

Updated : 04 Feb 2024 16:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొన్న శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) ఎట్టకేలకు శతకంతో సమాధానం ఇచ్చాడు. వైజాగ్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 132 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత జట్టు ఆధిక్యాన్ని 350 పరుగులు దాటించాడు. అతడి కెరీర్‌లో ఇది మూడో శతకం. 12 ఇన్నింగ్స్‌ల తర్వాత మూడంకెల స్కోరు నమోదు చేశాడు. గతేడాది మార్చిలో ఆసీస్‌తో నాలుగో టెస్టులో చివరిసారిగా శతకం చేశాడు. ఏడేళ్ల తర్వాత వన్‌డౌన్‌లో స్వదేశం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఒక భారత బ్యాటర్‌ సెంచరీ సాధించడం విశేషం. చివరిసారిగా 2017లో నాగ్‌పుర్‌లో శ్రీలంకపై ఛెతేశ్వర్ పుజారా శతకం చేశాడు.

రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌ నైట్‌ 28/0 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమ్‌ఇండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్‌ పేసర్ జేమ్స్‌ అండర్సన్ వరుస ఓవర్లలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (17), రోహిత్ శర్మ (13)ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్ (29)తో కలిసి గిల్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఈ సమయంలో రెండుసార్లు లైఫ్‌లు రావడంతో గిల్ బతికిపోయాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని విజృంభించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన అతడు.. కుదురుకున్నాక బ్యాట్‌ను ఝుళిపించాడు. అక్షర్‌తో కలిసి ఐదో వికెట్‌కు 89 పరుగులు జోడించిన అనంతరం షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో గిల్‌(104) పెవిలియన్‌ చేరాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని