Ajinkya Rahane: టీమ్‌ఇండియాలోకి రీ ఎంట్రీ ఇస్తా.. నా లక్ష్యం అదే: అజింక్య రహానె

భారత సీనియర్‌ బ్యాటర్‌ అజింక్య రహానె (Ajinkya Rahane) కొన్ని నెలలుగా జట్టులో చోటు కోల్పోయాడు. అతడు తిరిగి టీమ్‌లోకి రావడంపై దృష్టిసారించాడు. 

Published : 16 Jan 2024 18:03 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాటర్‌ అజింక్య రహానె (Ajinkya Rahane) ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. 2020-21 సీజన్‌లో ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ విజయం సాధించింది. ఈ చిరస్మరణీయ సిరీస్‌కు రహానె కెప్టెన్‌గా వ్యవహరించాడు. చాలా మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియాను ఆదుకున్న అతడు కొత్త కుర్రాళ్ల రాకతో టెస్టు జట్టు రేసులో బాగా వెనకబడిపోయాడు. అతడు చివరిగా 2023లో రెండు టెస్టుల సిరీస్ కోసం వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లాడు. ఆ సిరీస్‌లో విఫలమవడంతో అప్పటి నుంచి పక్కన పెట్టారు. త్వరలో ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కూ ఎంపిక చేయలేదు. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్న రహానె ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. ముంబయికి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రహానె ఆంధ్రా జట్టుపై విజయం సాధించిన తర్వాత మాట్లాడాడు. 

‘‘ముంబయి తరఫున మెరుగైన ప్రదర్శన చేయడంపై దృష్టిపెట్టా. మేం ఈ సీజన్‌ను గొప్పగా ప్రారంభించాం. ట్రోఫీని గెలవాలంటే టోర్నీ ఆసాంతం నిలకడగా ఆడాలి. అది సవాలుతో కూడుకున్నది. ఒక్కో మ్యాచ్‌పై దృష్టిపెట్టి ముందుకుసాగుతున్నాం. రంజీ ట్రోఫీ గెలవడంతో పాటు 100 టెస్టు మ్యాచ్‌లు ఆడటం నా లక్ష్యం’’ అని రహానె పేర్కొన్నాడు. అజింక్య ఇప్పటివరకు భారత్‌ తరఫున 85 టెస్టులు ఆడి 5077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలున్నాయి. 102 క్యాచ్‌లు కూడా పట్టాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని