RSA vs AUS: మిల్లర్ శతకం.. ఆస్ట్రేలియా లక్ష్యం 213

వన్డే ప్రపంచకప్‌ రెండో సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ ముగిసింది. డేవిడ్‌ మిల్లర్‌ (101) శతకంతో ఆకట్టుకున్నాడు

Updated : 16 Nov 2023 19:12 IST

కోల్‌కతా: వన్డే ప్రపంచకప్‌ (ICC Cricket World Cup 2023) రెండో సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ ముగిసింది. 49.4 ఓవర్లు ఆడిన సౌతాఫ్రికా 212 పరుగులకు ఆలౌటయ్యింది. డేవిడ్‌ మిల్లర్‌ (101; 116 బంతుల్లో 8×4, 5×6) శతకంతో ఆకట్టుకున్న వేళ సఫారీ జట్టు 213 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందుంచింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (47), కొయెట్జీ (19), మార్‌క్రమ్‌ (10), రబాడా (10) మినహా మిగతావాళ్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌, కమిన్స్‌ తలో 3 వికెట్లు పడగొట్టగా.. హేజిల్‌వుడ్‌, హెడ్‌ చెరో 2 వికెట్లు తీశారు.

కుప్పకూలిన టాప్‌ ఆర్డర్‌

లీగ్‌దశలో అదరగొట్టిన సౌతాఫ్రికా బ్యాటర్లు కీలకమైన సెమీస్‌లో మాత్రం తడబడ్డారు. ప్రారంభం నుంచే సులువుగా వికెట్లు పోగొట్టుకున్నారు.  తొలి ఓవర్‌ చివరి బంతికి స్టార్క్‌ బౌలింగ్‌లో బవుమా భారీ షాట్‌కు ప్రయత్నించి ఇంగ్లిస్‌ క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. అక్కడికి 7 పరుగుల వ్యవధిలోనే మరో ఓపెనర్‌ డికాక్‌ (3)ను హేజిల్‌వుడ్‌ పెవిలియన్‌కు పంపాడు.తొలిడౌన్‌లో వచ్చిన డసెన్‌ (6),  రెండోడౌన్‌లో వచ్చిన మార్‌క్రమ్‌ కూడా తీవ్ర నిరాశ పరిచారు. 4 వికెట్లు పడేసరికి జట్టు స్కోరు కేవలం 24 పరుగులే. దీంతో సఫారీ జట్టు ఒక్కసారిగా కష్టాల్లోకి కూరుకుపోయింది. 

నిలబెట్టిన మిల్లర్‌

టాప్‌ ఆర్డర్‌ పేకమేడలా కుప్పకూలిపోయిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను డేవిడ్‌ మిల్లర్‌ నిలబెట్టాడు. క్రీజులో నిలదొక్కుకుంటూ పరుగులు రాబట్టాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీస్తూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. క్రీజులోకి వచ్చిన వారు ఒక్కొక్కరుగా పెవిలియన్‌ బాట పడుతున్నా.. ఒంటరి పోరాటం చేశాడు. వంద పరుగులు పూర్తి చేసుకొని.. జట్టు స్కోరు 203 పరుగుల వద్ద కమిన్స్‌ బౌలింగ్‌లో భారీషాట్‌కు ఆడి.. హెడ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో సౌతాఫ్రికా 212 పరుగులకు పరిమితమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని