SA vs IND: హెండ్రిక్స్‌, మార్‌క్రమ్‌ మెరుపులు.. రెండో టీ20లో సౌతాఫ్రికా గెలుపు..

భారత్‌తో జరిగిన రెండో టీ20లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

Updated : 13 Dec 2023 01:22 IST

గబేహా: భారత్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా బోణీ కొట్టింది. తొలి టీ20 వర్షార్పణం కాగా.. మంగళవారం జరిగిన రెండో టీ20లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత రింకు సింగ్ (68*; 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్ (56; 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకాలు బాదడంతో టీమ్‌ఇండియా 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్‌లో 19.3 ఓవర్లు పూర్తయిన తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను నిలిపివేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జీ 3, మార్కో జాన్సన్, విలియమ్స్‌, షంసి, మార్‌క్రమ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

అనంతరం వర్షం ఆగిపోవడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను 15 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 152గా నిర్దేశించారు. ఈ టార్గెట్‌ని సఫారీలు 5 వికెట్లు కోల్పోయి 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించారు. రిజా హెండ్రిక్స్ (49; 27 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌), ఐడెన్ మార్‌క్రమ్ (30; 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులు మెరిపించారు. మాథ్యూ బ్రిజ్కె (16; 7 బంతుల్లో), డేవిడ్‌ మిల్లర్ (17; 12 బంతుల్లో), ట్రిస్టన్ స్టబ్స్‌ (14*), ఫెహ్లుక్వాయో (10*) పరుగులు చేశారు. భారత బౌలర్లలో ముకేశ్‌ కుమార్ 2, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్‌ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

లక్ష్యఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్‌ రిజా హెండ్రిక్స్ తొలి ఓవర్ నుంచే బాదుడు మొదలెట్టాడు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో మూడు ఫోర్లు బాదాడు. అర్ష్‌దీప్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో 24 ఏకంగా పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌లో బ్రీజ్కె వరుసగా 4,6 బాదగా..  హెండ్రిక్స్‌ ఓ సిక్స్ బాదగా బాల్‌ స్టేడియం బయటపడింది. కాసేపటికే జడేజా  బ్రిజ్కె రనౌట్ అయ్యాడు. అయినా, స్కోరు వేగం తగ్గలేదు. మార్‌క్రమ్ క్రీజులోకి వచ్చిరాగానే హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. ముకేశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో  సిక్సర్ బాదిన మార్‌క్రమ్ తర్వాతి బంతికే సిరాజ్‌కు చిక్కాడు. అప్పటికే స్కోరు 100కు చేరువైంది. కుల్‌దీప్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో హెండ్రిక్స్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. హెన్రిచ్‌ క్లాసెన్ (7)ని సిరాజ్‌ వెనక్కి పంపాడు. దూకుడుగా ఆడిన మిల్లర్‌ కొద్దిసేపటికే ముకేశ్ బౌలింగ్‌లో సిరాజ్‌కు చిక్కాడు. కానీ, అప్పటికే సౌతాఫ్రికా లక్ష్యానికి చేరువైంది. స్టబ్స్‌, ఫెహ్లుక్వాయో మిగతా పని పూర్తి చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని