IPL 2021: నరైన్‌ మా విజయాన్ని తేలిక చేశాడు.. : మోర్గాన్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్న సునీల్‌ నరైన్‌.. టీ20 క్రికెట్‌లో అసలైన ఆటగాడని, అతడిని కలిగిఉండటం తమకు అద్భుతంగా ఉందని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌...

Published : 12 Oct 2021 09:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్న సునీల్‌ నరైన్‌.. టీ20 క్రికెట్‌లో అసలైన ఆటగాడని, అతడిని కలిగి ఉండటం తమకు ఎంతో ఉపయోగపడుతోందని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. షార్జా పిచ్‌పై ఈ వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ తొలుత బంతితో నాలుగు వికెట్లు తీయగా.. తర్వాత బ్యాటింగ్‌లో (26; 15 బంతుల్లో 3x6) విలువైన పరుగులు చేశాడు. దాంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

మ్యాచ్‌ అనంతరం మోర్గాన్‌ మాట్లాడుతూ నరైన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. అతడు తమ విజయాన్ని తేలిక చేశాడని కొనియాడాడు. మరోవైపు బ్యాటింగ్‌కు కష్టంగా మారిన ఈపిచ్‌ను చూసి ఛేదనలో తాము చివరి వరకూ పోరాడాలనుకున్నట్లు తెలిపాడు. ఈ సీజన్‌లో తమ ఆటతీరు, నిలకడైన ప్రదర్శన ప్రతి ఒక్కర్నీ ఆశ్చర్యానికి గురిచేసిందని మోర్గాన్‌ వివరించాడు. అనంతరం నరైన్‌ మాట్లాడుతూ.. ఎప్పుడైనా ఇలా మ్యాచ్‌ను గెలిపించే ప్రదర్శన చేస్తే బాగుంటుందని అన్నాడు. ఈరోజు అత్యుత్తమ ప్రదర్శన చేసినట్లు చెప్పాడు. ఈ మ్యాచ్‌లో తాను తీసిన ప్రతి వికెట్‌ను ఆస్వాదించానన్నాడు. తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని సంతోషం వ్యక్తం చేశాడు.

ఇది భారీ విజయం: శుభ్‌మన్‌గిల్‌

‘ఇది మాకు భారీ విజయం. మేం యూఏఈ లెగ్‌లోకి వచ్చేముందు ప్లేఆఫ్స్‌కి చేరతామని కూడా అనుకోలేదు. కానీ, మా జట్టులో ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడటంతో ఇక్కడి దాకా వచ్చాం. ఇకపైనా ఇలాంటి ప్రదర్శనే చేస్తామని ఆశిస్తున్నా. ఇక నేను భారత్‌లో ఆడినప్పుడు సరిగ్గా బ్యాటింగ్‌ చేయలేకపోయా. ఒక్కసారి కుదురుకుంటే సరిపోతుందని అనుకున్నా. అలాగే జరిగింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు శుభారంభం చేసినా తర్వాత మా స్పిన్నర్లు వరుణ్‌, నరైన్‌ కట్టుదిట్టంగా బంతులేసి మమ్మల్ని పోటీలోకి తెచ్చిన తీరు మహా అద్భుతం. కోహ్లీసేనపై ఆధిపత్యం చెలాయించి కీలక వికెట్లు తీయడమే మాకు కలిసి వచ్చింది’ అని కోల్‌కతా ఓపెనర్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని