IND vs PAK: ఆనందం సరే.. అతిచేయవద్దు..

టీమ్‌ఇండియాపై చారిత్రక విజయం సాధించాక పాకిస్థాన్ ఆటగాళ్లకు కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ గట్టి హెచ్చరికలు జారీ చేశాడు. ఈ అద్భుత విజయాన్ని ఆస్వాదించే క్రమంలో మితిమీరిన...

Published : 26 Oct 2021 01:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాపై చారిత్రక విజయం సాధించాక పాకిస్థాన్ ఆటగాళ్లకు కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ గట్టి హెచ్చరికలు జారీ చేశాడు. ఈ అద్భుత విజయాన్ని ఆస్వాదించే క్రమంలో మితిమీరిన విధంగా సెలబ్రేషన్స్‌ చేసుకోకుండా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని సూచించాడు. ఈ మెగా టోర్నీలో టీమ్‌ఇండియాపై ఒక్కటే గెలవడానికి రాలేదని, ప్రపంచకప్‌ సాధించేవరకు కష్టపడాలన్నాడు. మ్యాచ్‌ అనంతరం బాబర్‌ తమ ఆటగాళ్లతో సమావేశమైన వీడియోను పాక్‌ క్రికెట్‌ బోర్డు ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా బాబర్‌  ఇలా స్పందించాడు.

‘మనం ఈ విజయాన్ని ఆస్వాదిద్దాం. కానీ, హోటల్‌కు వెళ్లాక మన కుటుంబ సభ్యులతో సెలబ్రేట్‌ చేసుకుందాం. భారత్‌తో మ్యాచ్‌ అయిపోయింది కదా అని మిగతా మ్యాచ్‌లకు సన్నద్ధమవ్వడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ ఈ విజయాన్ని ఎంజాయ్‌ చేయండి. కానీ.. జట్టులో మీ పాత్రలేంటో మర్చిపోవద్దు. మనం ఇక్కడ భారత జట్టు ఒక్కదాన్నే ఓడించడానికి రాలేదు. ప్రపంచకప్‌ గెలవడానికి వచ్చాం. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి’ అని బాబర్‌ పేర్కొన్నాడు. అలాగే ఆ జట్టు మాజీ కోచ్‌ మిస్బా ఉల్‌ హక్‌ ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. పాకిస్థాన్‌ ఆటగాళ్లు ఈ విజయాన్ని ఆస్వాదించే క్రమంలో అతి చేయొద్దని, ప్రపంచకప్‌ గెలవడానికి ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉందన్నాడు. అది జరగాలంటే భారత్‌పై చెలరేగినట్లే ప్రతి ఆటగాడు మిగతా మ్యాచ్‌ల్లో రాణించాల్సిన అవసరం ఉందని మాజీ కోచ్‌ అభిప్రాయపడ్డాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని