Team India: మా ఓటములకు అదే కారణం.. అంతమాత్రాన బ్యాడ్‌ టీమ్‌ కాదు: రోహిత్‌

టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ ఫామ్‌లోకి వచ్చారు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో చెలరేగినట్లు బుధవారం రాత్రి అఫ్గానిస్థాన్‌పై దంచికొట్టారు. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ అర్ధశతకాలతో విరుచుకుపడి...

Updated : 16 Nov 2021 15:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ ఫామ్‌లోకి వచ్చారు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో చెలరేగినట్లు బుధవారం రాత్రి అఫ్గానిస్థాన్‌పై దంచికొట్టారు. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో రోహిత్‌ ‘మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. అయితే, మ్యాచ్‌ అనంతరం హిట్‌మ్యాన్‌ మీడియాతో మాట్లాడుతూ టీమ్‌ఇండియా తొలి రెండు ఓటములకు గల కారణాలు వెల్లడించాడు.

‘ఇప్పుడు మేం ఆడుతున్నన్ని మ్యాచ్‌లు, అలాగే బయట ఉన్న ప్రతికూల పరిస్థితుల నడుమ కొన్నిసార్లు రాణించడం కష్టమవుతోంది. బరిలోకి దిగిన ప్రతిసారీ కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. అందుకోసం మేం మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం వల్ల కొన్నిసార్లు మా నిర్ణయాలు సరైన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. బిజీ షెడ్యూల్‌ వల్లే ఇలా జరుగుతుంది. ఆటగాళ్లకు క్రికెట్‌ నుంచి కొంత సమయం విరామం ఉండాలి. దాంతో రిఫ్రెష్‌ అవ్వొచ్చు’ అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు.

అలాగే ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నీలు ఆడేటప్పుడు ఆటగాళ్ల ధ్యాసంతా మ్యాచ్‌పైనే ఉండాలి.. కానీ, గత రెండు మ్యాచ్‌ల్లో తాము అదే చేయలేకపోయామని హిట్‌మ్యాన్‌ అంగీకరించాడు. అందుకే ఆ రెండు మ్యాచ్‌లు ఓటమిపాలయ్యామని చెప్పాడు. అంతమాత్రాన టీమ్‌ఇండియా బలహీనమైన టీమ్‌ కాదన్నాడు. అలా తప్పులు జరిగినప్పుడు వాటిని సరిదిద్దుకొని తిరిగి రావడం చాలా ముఖ్యమని తెలిపాడు. ఇప్పుడు అఫ్గాన్‌తో మ్యాచ్‌లో తాము అదే పనిచేశామని చెప్పాడు. అనంతరం టీమ్‌ఇండియా సెమీస్‌కు చేరే విషయంపై స్పందిస్తూ.. అది తమకు చాలా దూరంగా ఉందన్నాడు. కానీ.. అఫ్గాన్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌పై తమ అవకాశాలు ఆధారపడ్డాయని చెప్పాడు.

ద్రవిడ్ ఎంపిక అధికారిక ప్రకటనా..? నాకు తెలియదు

చివరగా బ్యాటింగ్‌ దిగ్గజం, మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ టీమ్‌ఇండియా కొత్త కోచ్‌గా ఎంపికవ్వడంపై రోహిత్‌ హర్షం వ్యక్తం చేశాడు. తొలుత ఈ విషయం గురించి తనకు తెలియదని చెప్పాడు. తాము అఫ్గాన్‌తో మ్యాచ్‌లో బిజీగా ఉన్నామని, దాని గురించి సమచారం లేదన్నాడు. అయినా, ద్రవిడ్‌ పర్యవేక్షణలో మెరుగైన శిక్షణ పొందడానికి ఆటగాళ్లంతా సిద్ధంగా ఉన్నారన్నాడు. ద్రవిడ్‌ భారత జట్టులో మళ్లీ కొత్త బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో శుభాకాంక్షలు చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని