IND vs ENG: రోహిత్ - జడేజా సెంచరీలు.. సర్ఫరాజ్‌ ‘వన్డే’ బ్యాటింగ్‌.. భారత్‌ 326/5

ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు మ్యాచ్‌లో (IND vs ENG) భారత్ తొలి రోజు అద్భుత ఆటతీరును ప్రదర్శించింది. ఐదు వికెట్లను నష్టపోయినప్పటికీ 300+ పరుగులు చేసింది.

Updated : 15 Feb 2024 17:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆరంభం పేలవం.. ముగింపు అద్భుతం.. ఇదీ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు (IND vs ENG) మ్యాచ్‌ తొలిరోజు భారత్‌ ఆటతీరు. 33/3 స్కోరుతో కష్టాల్లో పడిన టీమ్‌ఇండియాను సెంచరీలతో కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా కాపాడారు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్‌ తన అరంగేట్ర టెస్టును ‘వన్డే’లా మార్చేసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

రాజ్‌ కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌ మొదటిరోజు ఆట ముగిసింది. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ తొలిరోజు ఆట ముగిసేసరికి 86 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (131: 196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (110*:212 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు)  సెంచరీలు సాధించి నాలుగో వికెట్‌కు 204 పరుగులు జోడించారు. దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టి జాతీయ జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్‌ ఖాన్‌ (62: 66 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌) చెలరేగిపోయాడు. ఐదో బంతికి పరుగుల ఖాతా తెరిచిన సర్ఫరాజ్‌ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. వన్డే తరహాలో పరుగులు రాబట్టాడు. జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. అయితే, జడ్డూతో సమన్వయలోపం వల్ల రనౌట్‌గా సర్ఫరాజ్‌ పెవిలియన్‌కు చేరాడు.  ఈ క్రమంలో డగౌట్‌లోని రోహిత్‌ తీవ్ర అసహనంతో తన క్యాప్‌ను విసిరి కొట్టిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. 

మళ్లీ తేలిపోయిన గిల్

రెండో టెస్టులో డబుల్‌ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ (10: 10 బంతుల్లో 2 ఫోర్లు) ఈ మ్యాచ్‌లోనూ దూకుడుగానే ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు. కానీ, మార్క్‌వుడ్‌ పేస్‌కు స్లిప్‌లో దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ (0) మొదటినుంచే అసౌకర్యంగా అనిపించాడు. 9 బంతులు ఎదుర్కొన్నా పరుగుల ఖాతా తెరవలేదు.  మార్క్‌వుడ్‌ బౌలింగ్‌లోనే సరైన ఫుట్‌వర్క్‌ లేకుండా వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. గత సెంచరీతో ఫామ్‌ అందుకొన్నాడనుకుంటే మళ్లీ నిరాశపరిచాడు. మరో యువ బ్యాటర్ రజత్‌ పటీదార్‌ (5) కూడా ఎక్కువ సమయం క్రీజ్‌లో ఉండలేదు. టామ్‌ హార్ట్‌లీ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై మిడాఫ్‌లో డకౌట్‌కు దొరికిపోయాడు. 

మరిన్ని విశేషాలు..

  • రవీంద్ర జడేజా - రోహిత్ శర్మ నాలుగో వికెట్‌కు 204 పరుగులు జోడించారు. ఇంగ్లాండ్‌పై భారత్‌కు ఇది మూడో అత్యుత్తమ భాగస్వామ్యం.  సచిన్‌-గంగూలీ (2002లో) 249 పరుగులు, విజయ్‌ మంజ్రేకర్-విజయ్‌ హజారె (1952లో) 222 పరుగులు రాబట్టారు. 
  • టెస్టుల్లో రవీంద్ర జడేజా 3వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. సొంత మైదానం రాజ్‌కోట్‌లో జడ్డూ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మొత్తం 12 మ్యాచుల్లో 1,564 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. 
  • టెస్టుల్లో 3వేల పరుగులు+200 వికెట్లు తీసిన మూడో భారత ఆటగాడు రవీంద్ర జడేజా. అతడికంటే  కపిల్‌దేవ్ (5,248 పరుగులు, 434 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (3,271 పరుగులు, 499 వికెట్లు) మాత్రమే ముందున్నారు. 
  • అరంగేట్ర టెస్టులోనే  వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన మూడో భారత బ్యాటర్ సర్ఫరాజ్‌ ఖాన్. అతడు 48 బంతుల్లోనే సాధించాడు. యువరాజ్‌ (42 బంతుల్లో), హార్దిక్‌ పాండ్య (48 బంతుల్లో) ముందు నిలిచారు.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని