Virat Kohli: ద్రవిడ్‌ ఇలా.. నేను అలా వస్తామని అనుకోలేదు: విరాట్

వెస్టిండీస్‌తో (Wi vs IND) నేటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. డొమినికా వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో విరాట్, ద్రవిడ్‌ మాట్లాడిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.

Published : 12 Jul 2023 16:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వెస్టిండీస్‌తో దాదాపు నాలుగేళ్ల తర్వాత టెస్టు సిరీస్‌ను భారత్‌ (WI vs IND) ఆడేందుకు సిద్ధమైంది. అయితే, ఈసారి సిరీస్‌కు ఓ ప్రత్యేకత ఉంది. పన్నెండేళ్ల కిందట విండీస్‌పైనే స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ (4, 15) పెద్దగా ప్రభావం చూపించలేదు. అప్పుడు జట్టులో సీనియర్‌ ఆటగాడిగా ఉన్న రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ఇప్పుడు భారత జట్టు కోచ్‌ కావడం విశేషం. ఆ మ్యాచ్‌లో భారత్ 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజాగా విండీస్‌తో సిరీస్‌లో ద్రవిడ్‌తో కలిసి సీనియర్‌ ఆటగాడిగా పని చేయడం కొత్తగా ఉందని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ, రాహుల్‌ ద్రవిడ్‌ మాట్లాడిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌ వేదికగా పోస్టు చేసింది. 

‘‘డ్రెస్సింగ్‌ రూమ్‌, ప్రాక్టీస్‌సెషన్స్‌కు వెళ్లినప్పుడుల్లా నేను ఇక్కడే టెస్టు అరంగేట్రం చేశానని గుర్తుకు వస్తూ ఉంటుంది. దాదాపు 12 ఏళ్ల టెస్టు కెరీర్‌లో వందకు పైగా టెస్టులు ఆడా. ఇలాంటి అనుభూతి మరెప్పుడూ రాదు. అప్పుడు నాకు సహచరుడు, సీనియర్‌, టెస్టుల్లో  అద్భుతమైన ప్రదర్శన చేసిన రాహుల్‌ ద్రవిడ్‌తో మరోసారి కరేబియన్‌ దేశానికి రావడం బాగుంది. ప్రధాన కోచ్‌గా ద్రవిడ్‌.. వంద టెస్టుల అనుభవంతో నేను ఇక్కడకు రావడం అద్భుతంగా ఉంది. ఇదే విషయం రాహుల్ భాయ్‌తో చెప్పా. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేరు. అప్పుడు, ఇప్పుడు ఉన్నది మేమిద్దరమే. ద్రవిడ్‌ యంగ్‌ కోచ్‌గా అభివర్ణించుకున్నప్పటికీ.. శిక్షణ ఇవ్వడంలోనూ ఎంతో అనుభవం ఉంది. ఈ ప్రయాణం మమ్మల్ని విభిన్న సామర్థ్యాలతో ఇక్కడికి తీసుకువస్తుందని ఎప్పుడూ ఊహించలేదు’’ అని విరాట్ తెలిపాడు. 

పన్నెండేళ్ల కిందట..: ద్రవిడ్

విండీస్‌ టెస్టు సిరీస్‌ ఆడేందుకు 2011లో చివరిసారిగా ఇక్కడ పర్యటించా. విరాట్‌తో కలిసి అప్పుడు ఆడా. అప్పుడే అరంగేట్రం చేశాడు. యువకుడిగా అప్పటికే వన్డేల్లో రాణిస్తున్నాడు. అయితే, టెస్టు జట్టులో చోటు కోసం విపరీతంగా శ్రమించాడు. ప్రత్యేక టాలెంట్‌ కలిగిన విరాట్ సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ తన సత్తా నిరూపించుకున్నాడు. ఇప్పుడు సీనియర్‌ (ఈ సందర్భంగా వెటరన్‌ అనేసి సీనియర్‌గానే పిలిచాడు) ప్లేయర్‌గా అందరికీ మార్గదర్శకం చేసే స్థాయికి ఎదిగాడు. అతడు ఆటగాడిగా సీనియర్‌ కాగా.. ఇప్పుడు నేను యంగ్‌ కోచ్‌గా.. ప్రయాణం సాగిస్తున్నాం’’ అని రాహుల్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని