IND vs ENG: క్రికెటర్లలో అతడు చెస్‌ ప్లేయర్‌.. కెరీర్‌లో ఇదో గొప్ప సందర్భం: విశ్వనాథన్ ఆనంద్

టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ (Ashwin) టెస్టు కెరీర్‌లో గొప్ప మైలురాయి అందుకొన్నాడు. ఈ సందర్భంగా చెస్‌ దిగ్గజం సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

Updated : 08 Mar 2024 13:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో (IND vs ENG) ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు భారత సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌కు కెరీర్‌లో వందో మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో పర్యటక జట్టును తక్కువకే ఆలౌట్‌ చేయడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. కుల్‌దీప్‌ ఐదు వికెట్లు తీయగా.. అశ్విన్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు బీసీసీఐ అశ్విన్‌ను సత్కరించింది. ఈ క్రమంలో అతడి ప్రతిభను చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ కొనియాడాడు. ఈ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. 

‘‘అశ్విన్‌తో నాకు ఎప్పట్నుంచో పరిచయం ఉంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో.. అనేక విషయాలపై మేం చర్చించుకున్నాం. అతడు నన్ను చాలాసార్లు తన యూట్యూబ్‌ ఛానల్‌లో చర్చా కార్యక్రమాలకు ఆహ్వానించాడు. కొన్నిసార్లు అతడిని చూస్తుంటే.. క్రికెటర్లలో చెస్‌ ప్లేయర్‌గా అనిపిస్తాడు. అత్యున్నత స్థాయికి వెళ్తాడనే నమ్మకంతో ఉండేవాడిని. ఇప్పుడు అతడి కెరీర్‌లోనే అత్యంత గొప్ప సందర్భం ఇది. దానిని ఆస్వాదిస్తాడని ఆశిస్తున్నా’’ అని ఆనంద్‌ వెల్లడించాడు. 

ఆనంద్ గురించి చాలా విన్నా: అశ్విన్‌

విశ్వనాథన్‌ ఆనంద్ భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టాప్‌ చెస్‌ ప్లేయర్‌గా ఓ వెలుగు వెలిగిన ఆటగాడు. ఓ సందర్భంగా ఆనంద్‌ గురించి అశ్విన్‌ చేసిన వ్యాఖ్యలూ నెట్టింట వైరల్‌గా మారాయి. ‘‘విశ్వనాథ్‌ ఆనంద్‌ గురించి చాలా స్టోరీస్‌ విన్నాను. ఇక్కడ నిజం ఏంటంటే.. నేను కూడా కాస్త చదరంగం నేర్చుకున్నా. చెస్‌పై అవగాహన కలిగి ఉన్నా. అతడితో ఏదైనా విషయం మాట్లాడుతున్నప్పుడు నా కళ్లల్లో మెరుపులు మెరిసేవి. ఓ సందర్భంలో.. చెస్‌ ఆడటం మెకానికల్‌గా మారిపోయిందని అన్నాడు. ఆ మాట వినగానే అతడి దృష్టిలో చెస్‌ పట్ల ఆసక్తి కోల్పోతున్నట్లు అనిపించింది. కానీ, అలా ఏమీ జరగలేదు’’ అని అశ్విన్‌ తెలిపాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని