Ben Stokes : భారత్‌ 450 పరుగులు చేయాలని కోరుకున్నా: బెన్‌స్టోక్స్‌

భారత్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ భారీ ఛేదనతో రికార్డు సృష్టించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 378 పరుగులను ఇంగ్లాండ్‌ అలవోకగా...

Updated : 06 Jul 2022 11:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ భారీ ఛేదనతో రికార్డు సృష్టించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 378 పరుగులను ఇంగ్లాండ్‌ అలవోకగా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లాండ్‌ 2-2తో సమం చేసుకుంది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్‌కిదే భారీ లక్ష్య ఛేదన కావడం విశేషం. ఇంతకుముందు ఆసీస్‌పై 359 పరుగులను ఛేదించి విజయం సాధించింది. అయితే తమకు 450 పరుగులను నిర్దేశించినా ఛేదించేందుకు సిద్ధమని మ్యాచ్‌ అనంతరం ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్ స్టోక్స్‌ వ్యాఖ్యానించాడు. 

‘‘భారీ లక్ష్య ఛేదన చేయడం ఆనందంగానే ఉంది. అయితే టీమ్‌ఇండియా మాకు 450 పరుగులను లక్ష్యంగా నిర్దేశిస్తే బాగుండేది. మేం ఏం చేయగలమో చూద్దామనేదే నా కోరిక. అయితే చివరికి 378 పరుగుల లక్ష్యం మా ముందుంది. విజయం సాధిస్తే ఇతర జట్లు మనల్ని ఎలా చూస్తాయో చూడండని నాలుగో రోజు ఆట ముగిశాక మా వాళ్లతో చెప్పా. ఇక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కిన జట్లు తమ మూడో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడతాయి. ఈ క్రమంలో భారత్‌కు అడ్డుకట్ట వేయడంలో సఫలమయ్యాం. టెస్టు క్రికెట్‌కు జీవం పోయాలని మాకు తెలుసు. గత ఐదు వారాలుగా మాకు లభిస్తున్న మద్దతు అద్భుతం. వచ్చే తరం తప్పకుండా టెస్టు క్రికెట్‌ను ఆదరిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని బెన్‌ స్టోక్స్ వివరించాడు.

భారత్‌కు రెండు పాయింట్ల కోత

ఇంగ్లాండ్‌తో అయిదో టెస్టులో నెమ్మదిగా బౌలింగ్‌ చేసినందుకు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో టీమ్‌ఇండియాకు రెండు పాయింట్ల కోత పడింది. దీంతో డబ్ల్యూటీసీలో భారత్‌ (75 పాయింట్లు; 52.08 పాయింట్ల శాతం) మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా (84; 77.78 శాతం), దక్షిణాఫ్రికా (60; 71.43 శాతం), పాకిస్థాన్‌ (44; 52.38 శాతం) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. పాయింట్ల శాతం ఆధారంగా జట్ల స్థానాలను నిర్ణయిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని