Shubman Gill: శుభ్‌మన్‌ గిల్ అందుకున్న క్యాచ్‌కు అభిమానుల ఫిదా

లఖ్‌నవూతో జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ ఆటగాడు శుభ్‌మన్‌గిల్‌ అందుకున్న ఓ క్యాచ్‌ అద్భుతంగా ఉండటంతో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. టోర్నీ ప్రారంభమై నాలుగు మ్యాచ్‌లే...

Updated : 30 Mar 2022 05:08 IST

1983 ప్రపంచకప్‌లో కపిల్‌ అద్భుత క్యాచ్‌తో పోలిక!

(Photo: Shubman Gill Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: లఖ్‌నవూతో జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ ఆటగాడు శుభ్‌మన్‌గిల్‌ అద్భుత రీతిలో పట్టుకున్న ఓ క్యాచ్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. టోర్నీ ప్రారంభమై నాలుగు మ్యాచ్‌లే జరిగినా అప్పుడే దాన్ని ‘క్యాచ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’గా పిలుస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో అలరిస్తున్నాయి.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలిన సంగతి తెలిసిందే. మహ్మద్‌ షమి, ఆరోన్‌ ధాటికి టాప్‌ ఆర్డర్‌ మొత్తం కుప్పకూలింది. ఓపెనర్‌, కెప్టెన్‌ రాహుల్‌ (0), క్వింటన్‌ డికాక్‌ (7), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ ఎవిన్‌ లూయిస్‌ (10), మనీశ్‌ పాండే(6).. 29 పరుగులకే పెవిలియన్‌ చేరారు. ఈ క్రమంలోనే ఆరోన్‌ బౌలింగ్‌లో ఎవిన్‌ లూయిస్‌ ఇచ్చిన క్యాచ్‌ను శుభ్‌మన్‌ గిల్‌ అందుకున్న తీరు ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. గాల్లోకి లేచిన బంతిని.. పట్టుకునేందుకు గిల్‌ వెనక్కి పరిగెత్తాడు. చివరికి ఒక్క ఉదుటున డైవ్‌ చేసి మరీ క్యాచ్‌ అందుకున్నాడు. దీన్ని చూసి వ్యాఖ్యాతగా ఉన్న సునీల్‌ గావస్కర్‌.. గిల్‌ శ్రమను మెచ్చుకున్నాడు. ఇక సామాజిక మాధ్యమాల్లో అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 1983 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ దిగ్గజం వీవ్‌ రిచర్డ్స్‌ క్యాచ్‌ను అందుకున్న కపిల్‌ దేవ్‌తో పోలుస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని