
క్వాల్కమ్ గేమింగ్ ఫోన్.. విడుదలెప్పుడంటే?
ఇంటర్నెట్డెస్క్: మొబైల్ ఫోన్ ప్రాసెసర్స్ తయారీ కంపెనీ క్వాల్కమ్ స్మార్ట్ఫోన్ తయారీ దిశగా అడుగులు వేస్తుంది. త్వరలోనే గేమింగ్ ప్రియుల కోసం కొత్త స్మార్ట్ఫోన్ను తీసుకురానుందట. ఈ ఏడాది చివరినాటికి కొత్త ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తైవాన్ మొబైల్ కంపెనీ అసుస్తో కలిసి క్వాల్కమ్ ఈ ఫోన్ను తయారుచేస్తోంది. అయితే ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయనేది మాత్రం తెలియరాలేదు. క్వాల్కమ్ బ్రాండ్ కింద విడుదల చేయబోతున్న ఈ ఫోన్ డిజైన్ ఎలా ఉండాలి, ఏ చిప్సెట్ ఉపయోగించాలనే దానిపై రెండు కంపెనీలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అసుస్ కంపెనీ ఇప్పటికే ఆర్ఓజీ సిరీస్లో గేమింగ్ స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, లాప్టాప్లను తయారు చేస్తోంది. అసుస్, క్వాల్కమ్ కలయికలో గేమర్స్ కోసం ప్రత్యేకంగా వస్తున్న ఈ ఫోన్లో హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, పెద్ద బ్యాటరీ, గేమింగ్ కోసం షోల్డర్ బటన్స్, లేటెస్ట్ ప్రాసెసర్ ఉంటాయని టెక్ వర్గాల అంచనా. డిసెంబర్ 1 తేదీన జరిగే కార్యక్రమంలో క్వాల్కమ్ గేమింగ్ ఫోన్ వివరాలతో పాటు స్నాప్డ్రాగన్ 875, స్నాప్డ్రాగన్ 775జీ ప్రాసెసర్లను విడుదల చేయనుందని సమాచారం. కొద్ది రోజుల క్రితం ఎన్విడియా కంపెనీ ఏఆర్ఎంను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా క్వాల్కమ్ అందించే ఆడ్రినో సిరీస్ జీపీయూ (గ్రాఫిక్ అండ్ మల్టీమీడియా ప్రాసెసర్)ల స్థానంలో ఏఆర్ఎంకు చెందిన మాలి జీయూలను ఉపయోగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసుస్-క్వాల్కమ్ కలయిక టెక్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.