సైబర్‌ భద్రత మనదే బాధ్యత

ఇంట్లోనే కాదు, ఆన్‌లైన్‌లోనూ దొంగలు పడతారు! కంటికేమీ కనిపించరు గానీ వ్యక్తిగత సమాచారం కాజేస్తారు. మాయమాటలు చెప్పో, బురిడీ కొట్టించో రహస్య వివరాలు లాగేస్తారు.

Published : 25 Oct 2023 00:39 IST

ఇంట్లోనే కాదు, ఆన్‌లైన్‌లోనూ దొంగలు పడతారు! కంటికేమీ కనిపించరు గానీ వ్యక్తిగత సమాచారం కాజేస్తారు. మాయమాటలు చెప్పో, బురిడీ కొట్టించో రహస్య వివరాలు లాగేస్తారు. వీటిని ఉపయోగించుకొని ఉన్నదంతా దోచేయొచ్చు. మన లోపాలు, బలహీనతలను అడ్డుపెట్టుకొని బెదిరించొచ్చు. డబ్బులు వసూలు చేయొచ్చు. కాబట్టి జాగ్రత్త అవసరం. ఇప్పుడు వస్తువులు కొనాలన్నా.. ప్రయాణాలకు, సినిమాలకు, వినోదాలకు టికెట్లు పొందాలన్నా.. బ్యాంకు లావాదేవీలకైనా ఆన్‌లైనే ప్రధాన సాధనంగా మారిపోయింది. అందువల్ల సైబర్‌ భద్రత రోజురోజుకీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. సంస్థలతో పాటు వ్యక్తులకూ ఇది తప్పనిసరి వ్యవహారంగా మారిపోయింది. కానీ చాలామంది తమకేమీ కాదని, తమ సమాచారానికి పెద్దగా ప్రాధాన్యం లేదనే ధీమాతో వ్యవహరిస్తుంటారు. అలాంటి కొన్ని అపోహల గురించి తెలుసుకొని, అప్రమత్తంగా ఉండటం నేర్చుకుందాం.

నాకేం కాదని అనుకోవద్దు

‘నా మీద ఎవరు దాడి చేస్తారు? కాబట్టి సైబర్‌ సెక్యూరిటీ గురించి చింతించాల్సిన అవసరం లేదు’ అని చాలామంది భావిస్తుంటారు. ఇది ప్రమాదకరమైన అపోహ. హ్యాకర్లు, సైబర్‌ నేరగాళ్లు ప్రముఖులనే కాదు.. వివిధ రకాల వ్యక్తులు, సంస్థలను లక్ష్యంగా పెట్టుకుంటారని మరవొద్దు. అంతర్జాలంతో అనుసంధానమైన ప్రతి ఒక్కరికీ ముప్పు పొంచే ఉంటుంది. సైబర్‌ నేరగాళ్లు ఆటోమేటెడ్‌ సాధనాలతో నిరంతరం ఇంటర్నెట్‌ను జల్లెడ పడుతూనే ఉంటారు. చిన్న గుట్టు దొరికినా దాడికి తెగబడతారు. కాబట్టి తమను, తమ డేటాను కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండటం, సెక్యూరిటీ పద్ధతులు పాటించటం తప్పనిసరి.

బలమైన పాస్‌వర్డ్‌ ఉంటే చాలదు

‘బలమైన పాస్‌వర్డ్‌ ఉంటే చాలు. నా ఖాతా సురక్షితంగా ఉన్నట్టే’ అన్నది మరికొందరి ఆలోచన. కఠినమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోవటం ఉత్తమమే కావొచ్చు గానీ ఇదొక్కటే సరిపోదు. సైబర్‌ నేరగాళ్లు నిజమైన బ్యాంకు అధికారులు, ఇంటర్నెట్‌ ప్రొవైడర్ల మాదిరిగా నమ్మించి ఖాతా నంబరు, పాస్‌వర్డ్‌లను ధ్రువీకరించుకోవాలని ఈమెయిళ్లు పంపొచ్చు. వీటి ద్వారా రహస్య సమాచారాన్ని తస్కరించొచ్చు (ఫిషింగ్‌). కాబట్టి ప్రతి ఆన్‌లైన్‌ ఖాతాకు విడివిడిగా ప్రత్యేక, సంక్లిష్ట పాస్‌వర్డ్‌లను పెట్టుకోవటంతో పాటు ఎక్కడ వీలుంటే అక్కడ టూఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి.

యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఉన్నా..

‘నా సిస్టమ్‌కు యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఉంది. ఇంకేం కావాలి? ఏమీ కాదు’ అని కొందరు నిశ్చితంగా ఉంటారు. ఒకసారి యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని పనైపోయిందని భావిస్తుంటారు. నిజానికి సైబర్‌ భద్రత విషయంలో యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ పాత్ర చాలా కీలకం. ఇది మంచి రక్షణ కల్పిస్తుంది. అయితే ఇదే పూర్తిగా కాపాడుతుందని చెప్పలేం. సాధారణంగా తెలిసిన మాల్వేర్లను గుర్తించి, తొలగించేలా యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్లను రూపొందిస్తారు. కానీ కొత్తగా పుట్టుకొచ్చే ముప్పులను ఇవి పట్టుకోలేకపోవచ్చు. అధునాతన తరహా దాడులను అడ్డుకోలేకపోవచ్చు. కాబట్టి యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవటంతో పాటు దాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుండాలి కూడా. బలమైన ఫైర్‌వాల్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. బ్రౌజింగ్‌ చేసేటప్పుడూ పొరపాట్లకు తావివ్వకుండా చూసుకోవాలి.

ఫిషింగ్‌ మెయిళ్లను పట్టుకోలేకపోవచ్చు

‘ఫిషింగ్‌ మెయిళ్లన్నింటినీ ఇట్టే గుర్తిస్తా’ అని కొందరు ధీమాగా ఉంటుంటారు. ఇది తప్పు. ఫిషింగ్‌ ఈమెయిళ్లు రోజురోజుకీ అధునాతనంగా మారుతున్నాయి. వీటిని చూడగానే పోల్చుకోవటం అన్నిసార్లూ సాధ్యం కాదు. సైబర్‌ నేరగాళ్లు చాలా తెలివిగా ప్రవరిస్తుంటారు. ఫిషింగ్‌ మెయిళ్లు విశ్వసనీయమైనవి, అసలు సంస్థలవే అని నమ్మించేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రాచుర్యంలో ఉన్న లోగోలను వాడుతుంటారు. మెయిల్‌కు స్పందించటం అత్యవసరమనీ నమ్మబలుకుతుంటారు. అందువల్ల మెయిల్‌ను పంపించినవారి అడ్రస్‌ను ఒకటికి రెండు సార్లు సరి చూసుకోవాలి. లింక్స్‌ మీద క్లిక్‌ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఆన్‌లైన్‌లో వ్యక్తిగత సమాచారాన్ని షేర్‌ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

వై-ఫై నెట్‌వర్క్‌లన్నీ సురక్షితం కాదు

‘పబ్లిక్‌ వై-ఫై నెట్‌వర్క్‌లు మంచివే. వాటిని వాడితే ఇబ్బందేమీ ఉండదు’ అని మరికొందరు అపోహ పడుతుంటారు. ఇది నిజం కాదు. కాఫీ దుకాణాలు, హోటళ్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల వంటి చోట్ల అందరికీ అందుబాటులో ఉంచే వై-ఫై నెట్‌వర్క్‌లు సురక్షితం కాదు. హ్యాకర్లు వీటిపై డేగ కన్ను వేసి ఉంచుతారు. తేలికగా నెట్‌వర్క్‌లోకి చొచ్చుకొచ్చే అవకాశముంది. రహస్య సమాచారాన్ని తస్కరించే ప్రమాదముంది. అందువల్ల పబ్లిక్‌ వై-ఫై నెట్‌వర్క్‌ల వాడకంలో జాగ్రత్త అవసరం. రహస్య సమాచారాన్ని యాక్సెస్‌ లేదా ట్రాన్స్‌ఫర్‌ చేయొద్దు. కనెక్షన్‌ను ఎన్‌క్రిప్ట్‌ చేసుకోవటానికి, భద్రతను పెంచుకోవటానికి వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ (వీపీఎన్‌) వాడుకోవాలి.

మొబైల్‌ ఫోన్ల మీదా కన్ను

‘మొబైల్‌ ఫోన్ల మీద సైబర్‌ దాడులు జరగవు’ అనేది చాలామంది నమ్మకం. ఇది అపోహ మాత్రమే. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల వాడకం విస్తరిస్తున్న తరుణంలో సైబర్‌ నేరగాళ్లు వీటిని కూడా లక్ష్యంగా చేసుకోవటం ఎక్కువైంది. హానికర యాప్‌లు, వెబ్‌సైట్లు, రక్షణలేని వై-ఫై నెట్‌వర్క్‌ల వంటివన్నీ మొబైల్‌ పరికరాలకు ముప్పు తెచ్చిపెట్టేవే. కాబట్టి ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ప్లేస్టోర్‌, యాప్‌స్టోర్‌ వంటి విశ్వసనీయమైన వనరుల నుంచే యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సున్నితమైన, రహస్య సమాచారాన్ని యాక్సెస్‌ చేసేటప్పుడు భద్రమైన కనెక్షన్లనే ఉపయోగించాలి.

డేటాను డిలీట్‌ చేస్తే చాలదు

‘ఒకసారి డేటాను డిలీట్‌ చేస్తే శాశ్వతంగా పోయినట్టే’ అని కొందరు పొరపడుతుంటారు. తమ పరికరాలు లేదా ఆన్‌లైన్‌ ఖాతాల నుంచి ఫైళ్లను డిలీట్‌ చేస్తే అవి శాశ్వతంగా ఎరేజ్‌ అయినట్టే అనుకోవటం తగదు. వీటిని డిలీట్‌ చేసినంత మాత్రాన పూర్తిగా తొలగిపోవు. భద్రంగా ఓవర్‌రైట్‌ చేస్తేనే శాశ్వతంగా పోయినట్టు. లేకపోతే డిలీట్‌ చేసిన ఫైళ్లను ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ సాయంతో తిరిగి పొందే అవకాశముంది. కాబట్టి తమకు అవసరం లేని రహస్య సమాచారం ఎప్పటికీ ఇతరుల కంట పడకూడదని అనుకుంటే డిస్క్‌ వైపింగ్‌ సాఫ్ట్‌వేర్ల వంటి సాధానాలతో ఎరేజ్‌ చేసుకోవాలి. లేదూ హార్డ్‌డిస్క్‌ వంటి మెమరీ స్టోరేజీ పరికరాలను పగల కొట్టటం వంటివైనా చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని