Ray-Ban Stories: రేబాన్ స్టోరీస్‌ కొత్త ఫీచర్‌.. స్మార్ట్‌గ్లాసెస్‌తో ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ మెసేజ్‌లు!

ఫేస్‌బుక్‌, రేబాన్‌ సంయుక్తంగా రూపొందించిన రేబాన్‌ స్టోరీస్‌ స్మార్ట్‌గ్లాసెస్‌లో మరో ముఖ్యమైన ఫీచర్‌ను యూజర్స్‌కు పరిచయం చేస్తున్నట్లు మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌ పోస్టు ద్వారా వెల్లడించారు. 

Updated : 16 Dec 2021 17:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫేస్‌బుక్‌తో కలిసి రేబాన్ కంపెనీ రూపొందించిన రేబాన్‌ స్టోరీస్‌ స్మార్ట్‌గ్లాసెస్‌కు సంబంధించి మరో ముఖ్యమైన ఫీచర్‌ యూజర్స్‌కు అందుబాటులోకి వచ్చింది. ఇక మీదట ఈ స్మార్ట్‌గ్లాసెస్‌ ద్వారా యూజర్స్‌ ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ మెసేజ్‌లను ఇతరులకు పంపడంతోపాటు, రిసీవ్ చేసుకోవచ్చని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ పోస్టు ద్వారా తెలిపారు. ‘‘ యూజర్స్‌కు మెరుగైన సేవలందించడంలో భాగంగా రేబాన్‌ స్టోరీస్‌లో మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్నాం. ఈ ఫీచర్‌తో యూజర్స్‌ ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ నుంచి మెసేజ్‌లు పంపడం, తమకు వచ్చిన మెసేజ్‌లను వినడం, కాల్స్‌ చేయడంతోపాటు వాయిస్‌ కమాండ్స్‌తో సౌండ్‌ కంట్రోల్‌ చేయొచ్చు. రేబాన్‌ స్టోరీస్‌కు సంబంధించి మరిన్ని ఫీచర్స్‌ను 2022లో అందుబాటులోకి తీసుకొస్తున్నాం’’ అని జుకర్‌బర్గ్‌ తన ఫేస్‌బుక్ పోస్టులో వెల్లడించారు. 


రేబాన్‌ స్టోరీస్ ఫీచర్స్‌ 

ఫోన్‌ కాల్స్‌ కోసం ఇందులో మూడు మైక్రోఫోన్స్ ఉన్నాయి. గ్లాసెస్‌ ఫ్రేమ్‌కి రెండువైపులా 5 ఎంపీ కెమెరాలు అమర్చారు. వీటి సాయంతో 30 సెకన్ల నిడివి కలిగిన వీడియోలను రికార్డు చేయొచ్చు. సుమారు 500 ఫొటోలను, 30 సెకన్ల నిడివి ఉన్న 35 వీడియోలను ఈ స్మార్ట్‌గ్లాసెస్‌లో స్టోర్ చేసుకోవచ్చు. అలానే కెమెరాతోపాటు రెండువైపులా ఎల్‌ఈడీ లైట్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌గ్లాసెస్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 200 ఫొటోలు, 30 సెకన్ల నిడివి ఉన్న 30 వీడియోలను తీసుకోవచ్చు. రేబాన్‌ స్టోరీస్‌లో ఫ్రేమ్‌కి రెండు వైపులా ఓపెన్-ఇయర్‌ స్పీకర్స్‌ ఉన్నాయి. వీటి ద్వారా మ్యూజిక్‌ను వినవచ్చు. అలానే ఫ్రేమ్‌ కుడివైపు టచ్‌ కంట్రోల్స్ ఉంటాయి. వాటిపై ఒక్కసారి టచ్‌ చేస్తే మ్యూజిక్ ప్లేబ్యాక్‌, రెండుసార్లు టచ్‌ చేయడం ద్వారా సౌండ్‌ పెంచడం, తగ్గించుకోవడం, మూడుసార్లు టచ్‌ చేసి కాల్స్‌ మాట్లాడొచ్చు. 


వేరియంట్స్‌, ధర

ఈ ఏడాది సెప్టెంబరు నెలలో ఫేస్‌బుక్‌, రేబాన్‌ సంయుక్తంగా స్టోరీస్‌ స్మార్ట్‌గ్లాసెస్‌ను మార్కెట్లోకి విడుదలచేశాయి. ఆరు రకాల లెన్స్‌ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర 299 డాలర్ల నుంచి 379 డాలర్లుగా ఫేస్‌బుక్‌ నిర్ణయించింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 22,000 నుంచి రూ. 28,000 మధ్య ఉంటుందని అంచనా. బ్లాక్‌, బ్లూ, బ్రౌన్‌, గ్రీన్ రంగుల్లో ఇవి లభిస్తాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, ఇటలీ, బ్రిటన్‌, అమెరికా మార్కెట్లలో మాత్రమే ఈ స్మార్ట్‌గ్లాసెస్‌ అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే భారత మార్కెట్లో వీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. 

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని