TS News: 10 చలాన్లు దాటితే పిలుపు

ఇప్పటివరకు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో చిక్కిన వాహనదారులకే పోలీసులు కౌన్సెలింగ్‌ చేయడం చూశాం. ఇప్పుడు ట్రాఫిక్‌ చలాన్లు చెల్లించకపోయినా అదే పరిస్థితి. పది, అంతకంటే ఎక్కువగా పెండింగ్‌లో ఉన్న వాహన యజమానులను

Updated : 16 Nov 2021 07:04 IST

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల కౌన్సెలింగ్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: ఇప్పటివరకు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో చిక్కిన వాహనదారులకే పోలీసులు కౌన్సెలింగ్‌ చేయడం చూశాం. ఇప్పుడు ట్రాఫిక్‌ చలాన్లు చెల్లించకపోయినా అదే పరిస్థితి. పది, అంతకంటే ఎక్కువగా పెండింగ్‌లో ఉన్న వాహన యజమానులను పిలిపించి సైబరాబాద్‌ పోలీసులు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. 

ట్రాఫిక్‌ ఠాణాల వారీగా జాబితా...

నగరంలో చాలా మంది ట్రాఫిక్‌ చలాన్లను పట్టించుకోవడం లేదు. పైగా.. 70 శాతానికి పైగా వాటిని చెల్లించడం లేదు. మళ్లీ అవే నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. పలు ట్రాఫిక్‌ ఠాణాల పరిధిలో పది, అంతకంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాలకు సంబంధించిన వివరాలు బయటకు తీశారు. లక్షల్లో ఉండటంతో కంగుతిన్నారు. ట్రాఫిక్‌ ఠాణాల వారీగా జాబితాలను వేరు చేసి.. సంబంధిత ఇన్‌స్పెక్టర్‌కు పంపించారు. ప్రత్యేకంగా నియమించిన సిబ్బంది ఆ జాబితాలోని వాహనాల యజమానులకు ఫోన్లు చేసి ఎప్పుడు కౌన్సెలింగ్‌ హాజరు కావాలో చెబుతున్నారు. 

హాజరైనట్లు ధ్రువీకరణ పత్రం...

ట్రాఫిక్‌ ఠాణాకు వెళ్లగానే పెండింగ్‌ చలాన్ల జాబితా ఇస్తున్నారు. అక్కడి నుంచి ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌(టీటీఐ)కు వెళ్లాలని సూచిస్తున్నారు. మీరు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడ్డారు..? వాటి వల్ల ముప్పు ఎలా పొంచి ఉండే అవకాశముంది..? అని వివరిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. చివర్లో కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చి సంబంధిత ట్రాఫిక్‌ ఠాణాలో అప్పగించాలని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని