logo

సారూ.. రైతుల కన్నీళ్లు తుడవండి!

ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట.. సిరులు కురిపిస్తే బంగారు బాటలు వేసుకుందామని రైతులు ఆశపడ్డారు. వడగళ్ల వాన పసిడి పంటలపై ఫిరంగుల యుద్ధమే చేసి విలయతాండవం చేసింది. కష్టాన్నే పెట్టుబడిగా పెట్టి నష్టాలను దిగుబడి చేసుకునే రైతన్న బతుకు అకాలంగా కురిసిన వడగళ్ల వర్షంతో అతలాకుతలమైంది.

Updated : 18 Jan 2022 06:12 IST

నేడు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఉన్నతాధికారులు రాక
ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి

ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట.. సిరులు కురిపిస్తే బంగారు బాటలు వేసుకుందామని రైతులు ఆశపడ్డారు. వడగళ్ల వాన పసిడి పంటలపై ఫిరంగుల యుద్ధమే చేసి విలయతాండవం చేసింది. కష్టాన్నే పెట్టుబడిగా పెట్టి నష్టాలను దిగుబడి చేసుకునే రైతన్న బతుకు అకాలంగా కురిసిన వడగళ్ల వర్షంతో అతలాకుతలమైంది.

కదిలించిన ‘ఈనాడు’ కథనాలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఈనెల 10 నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. గాలివాన బీభత్సానికి తోడు వడగళ్లు కురవడంతో వారం రోజుల వ్యవధిలో చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్తు స్తంభాలు విరిగాయి.. అకాల వర్షాలకు మొక్కల ఆకులు, పూత, కాత లేకుండా మోడులు మాత్రమే మిగిలాయి. రైతుల దీనస్థితిపై ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాలకు స్పందించిన మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. ఆయన సూచన మేరకు మంత్రులు, ఉన్నతాధికారులు ఉమ్మడి వరంగల్‌ జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. రైతులతో మాట్లాడి పంట నష్టం అంచనా వేయనున్నారు.

నడికూడలో ఓ రైతు..


ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. ఆయన సూచన మేరకు మంత్రులు, వ్యవసాయ అధికారులు మంగళవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. వీరు తమ కష్టాలను చూసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని బాధిత రైతులు కోరుతున్నారు.

పర్యటన ఇలా: వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు, ఇతర ఉన్నతాధికారులు  హైదరాబాద్‌ నుంచి మంగళవారం ఉదయం 10.30 గంటలకు హనుమకొండకు చేరుకుంటారు. మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలతో కలిసి బస్సులో హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేటకు చేరుకుని రైతులతో మాట్లాడతారు.   అక్కడి నుంచి దుగ్గొండి మండలం మీదుగా నర్సంపేటకు వెళ్తారు. వర్షాలకు నష్టపోయిన మిరప రైతులను కలుసుకుంటారు.


హనుమకొండ జిల్లా నడికూడ మండలం రాయపర్తికి చెందిన ఈ రైతు మొండయ్య. మిర్చి పంట బాగా కాసింది. ఈ ఏడాది చెతికొచ్చిన పంటను అమ్మితే వచ్చిన పైసలతో మనవరాలికి బంగారం చేయిద్దామనుకున్నారు. నేను చచ్చిపోయన రోజు నామీద పడి ఎడవకపోతదా అని బరువెక్కిన గుండెతో రోదిస్తూ రాలిపోయి కుళ్లిన మిర్చి పంటను మీద పోసుకుంటూ బోరుముంటున్నారు రైతు మొండయ్య.


కన్నీరు పెడుతున్న ఈ మహిళా రైతు హనుమకొండ జిల్లా నడికూడ మండలం రాయపర్తికి చెందిన అల్లె బుచ్చమ్మ. వడగళ్ల వర్షానికి నాలుగు ఎకరాల మిర్చి తోట పూర్తిగా నాశనమైంది. ఆమెకు నిమోనియా ఉండగా రూ.5 లక్షలు పెట్టి చికిత్స చేయించుకున్నారు. కుమారుడికి కరోనా వస్తే రూ.10 లక్షలు ఖర్చయ్యాయి. పంటకు రూ.4 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. వచ్చిన దిగుబడితో అప్పులు తీర్చుదామనుకున్నారు. చెడగొట్టు వాన పంటను సర్వ నాశనం చేసిందని.. ఎలా బతికేదని ఆమె గుండెలవిసేలా రోదిస్తున్నారు.


ఈయన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం కలకత్తా తండాకు చెందిన సోమన్న. ఎకరంన్నరలో మొక్కజొన్న సాగు చేశారు. రూ.30 వేల పెట్టుబడి పెట్టారు. అకాల వర్షంతో పంటంతా పూర్తిగా నేలపాలై చేతికి రాకుండా దెబ్బతింది.


పంట చేతికొచ్చిన సమయంలో వర్షం ముంచింది
- ముత్తెబోయిన శేషగిరిరావు, సుందరయ్యకాలనీ, వాజేడు మండలం

సొంతంగా అరెకరం, ఎకరం కౌలుకు తీసుకుని మిర్చి పంట వేశాను. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం పడటంతో తీవ్రంగా నష్టపోయాను. రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. చేసిన కష్టం, పెట్టిన ఖర్చు వృథా అయ్యింది. ప్రభుత్వం ఆదుకొని పరిహారం ఇస్తే కొంత ఊరట కలుగుతుంది.


నేను పాకాల.. నా మొర ఆలకించరూ..

కాకతీయుల వారసత్వ సంపదగా వరంగల్‌ జిల్లాలో విరాజిల్లుతున్న నా పేరు పాకాల సరస్సు. ఏటా ఖరీఫ్‌, యాసంగి పంటలకు నీరందిస్తూ రైతుల సేవలో తరిస్తున్నాను. నా నీటితో 30 వేల ఎకరాలు పచ్చని పంటలతో అలరారుతున్నాయి. కష్ణానదికి ఉన్న ఉపనదుల్లో ఒకటైన మున్నేరు నా నుంచే అడుగులు వేస్తుంది. అన్నదాతలకు సాగు నీరందిస్తూ వారి కన్నీళ్లును తూడుస్తున్నాను. నా దురదృష్టం వల్ల గేట్లు తెరవకుండానే నీరంతా లీకవుతూ వృథాగా పోతోంది. నా రైతుల కష్టాలు చూడలేకపోతున్నాను. తూములు, పంటకాలువల ఆధునికీకరణ చేపట్టేందుకు నిధులు ఇవ్వాలని కోరుతున్నా. వరంగల్‌ జిల్లాకు వస్తున్న మీరంతా నామొర ఆలకించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని అనుకుంటున్నా..
ఇట్లు..

పాకాల సరస్సు,  ఖానాపురం  మండలం (ఖానాపురం, న్యూస్‌టుడే) 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని