Updated : 23 Jun 2022 04:44 IST

Afghanistan: పెను భూకంపంతో వణికిన అఫ్గాన్‌.. 1,000 మంది మృతి

1,500 మందికి గాయాలు

వేల సంఖ్యలో ఇళ్లు, భవనాల నేలమట్టం 

పాక్‌లోనూ కంపించిన భూమి

కాబుల్‌, ఇస్లామాబాద్‌: కల్లోలిత అఫ్గానిస్థాన్‌లో మరో పెను విషాదం. ప్రజలంతా గాఢనిద్రలో ఉన్న తరుణంలో బుధవారం అర్ధరాత్రి 1.54 గంటలకు భూమి తీవ్రంగా కంపించి వెయ్యిమందిని పొట్టన పెట్టుకుంది. మరో 1,500 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. కూలిన భవంతుల కింద అనేకమంది చిక్కుకున్న కారణంగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. కనీసం 2 వేల ఇళ్లు దెబ్బతిని ఉంటాయని అంచనా. శిథిలాలను చేతులతోనే తొలగిస్తూ, వాటికింద ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో తెలుసుకునేందుకు ప్రజలు కృషిచేస్తున్నారు. హిందుకుశ్‌ పర్వత శ్రేణుల్లో పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతంలో 6.1 తీవ్రతతో చోటు చేసుకున్న శక్తిమంతమైన భూకంపం ధాటికి తూర్పు అఫ్గాన్‌లోని గ్రామీణ, పర్వతశ్రేణి ప్రాంతాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. గత రెండు దశాబ్దాల్లో సంభవించిన పెను భూకంపాల్లో ఇది ఒకటిగా నిలవనుంది. చాలావరకు ఇళ్లు బలహీనమైన కట్టడాలే కావడంతో పేకమేడల్లా కూలిపోయి ప్రాణనష్టాన్ని పెంచాయి. భూకంప కేంద్రం అఫ్గాన్‌లోని ఖోస్త్‌కు 50 కి.మీ. దూరంలోని పక్తికా ప్రావిన్సులో భూమికి కేవలం 10 కి.మీ. లోపల ఉన్నట్లు పొరుగుదేశమైన పాకిస్థాన్‌లోని వాతావరణ విభాగం (పీఎండీ) ప్రకటించింది. దీనివల్లనే నష్టతీవ్రత ఎక్కువగా ఉందని తెలిపింది. క్షతగాత్రులకు రోడ్లపైనే చికిత్స అందించాల్సిన పరిస్థితి నెలకొంది. పెను విపత్తుతో కకావికలమైన అఫ్గాన్‌కు బృందాలను పంపించి సాయపడాల్సిందిగా తాలిబన్ల సర్కారు అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. ఎప్పుడూ అజ్ఞాతంలోనే ఉండే తాలిబన్ల సర్వోన్నత నేత హైబతుల్లా అఖుండ్‌జడాహ్‌ స్వయంగా ఈ అభ్యర్థన చేశారు.

అపార నష్టం.. సాయం కష్టం

అఫ్గాన్‌-పాక్‌ సరిహద్దుల్లోని ఖోస్త్‌, పక్టికా ప్రావిన్స్‌ల్లోని పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భయంతో అనేకమంది బహిరంగ స్థలాలకు పరుగులు తీశారు. ప్రకృతి విపత్తుపై అత్యవసర సమావేశం నిర్వహించిన అఫ్గాన్‌ ప్రధాని మహ్మద్‌ హసన్‌ అకుండ్‌.. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొండచరియలు, మట్టిపెళ్లలు విరిగి పడే ప్రాంతాలు కావడం, పురాతన భవంతులు ఎక్కువ ఉండడం సహాయక చర్యలకు అవరోధంగా మారింది. మామూలు పరిస్థితుల్లోనే అఫ్గాన్‌ గ్రామాలకు చేరుకోవడం దుర్లభం. ఇటీవలి వర్షాలతో పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారింది. పూర్తి ప్రతికూల పరిస్థితుల్లో భూకంప ప్రభావిత ప్రాంతాలను చేరుకునేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. సాధారణంగా ఈ స్థాయి భూకంపం వల్ల ఇంత నష్టం వాటిల్లదనీ, అఫ్గాన్‌ భౌగోళిక వాతావరణం, సామాజిక పరిస్థితుల వల్ల మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని అమెరికా జియోలాజికల్‌ సర్వే నిపుణుడు రాబర్ట్‌ శాండర్స్‌ అభిప్రాయపడ్డారు.

ఆ లోటు విస్పష్టం

అఫ్గాన్‌ను తాలిబన్లు తమ గుప్పిట్లోకి తీసుకున్నాక అనేక అంతర్జాతీయ సహాయక సంస్థలు దేశాన్ని వీడిపోవడం ఇప్పుడు పెద్దలోటుగా మారింది. పేదరికం, ఆకలి బాధలతో ఉన్న అఫ్గాన్‌ ప్రజలకు ఏమైనా సాయం అందించినా అది తాలిబన్ల చేతి నుంచి ప్రజల వరకు వెళ్తుందా లేదా అనే అనుమానంతో ప్రపంచదేశాలు ఐరాస ద్వారానే ఆ పని చేస్తున్నాయి. ఆపత్కాలంలో ఇలాంటి మార్గంలో సాయం అందడానికి మరింత జాప్యమవుతుంది. కాబుల్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకలు కూడా ఇదివరకే దాదాపు స్తంభించిపోయాయి. తాలిబన్ల పాలనలోకి వెళ్లిన అఫ్గాన్‌కు సాయం అందించడానికి అనేక సంస్థలు విముఖత వ్యక్తం చేస్తూ వచ్చాయి. బాధితుల్ని ఆదుకునేందుకు అఫ్గాన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ దుప్పట్లు, టెంట్లు, వంటసామగ్రి పంపించింది. సాయం అందించేందుకు పాకిస్థాన్‌ ముందుకు వచ్చింది. మృతులకు పోప్‌ ఫ్రాన్సిస్‌ నివాళులర్పిస్తూ ప్రార్థనలు చేశారు. అఫ్గాన్‌, పాకిస్థాన్‌, భారత్‌ సరిహద్దుల్లోని 500 కిలోమీటర్ల మేర భూకంప ప్రభావం కనిపించినట్లు ‘యూరోపియన్‌ సీస్మోలాజికల్‌ ఏజెన్సీ’ తెలిపింది. ఆయా ప్రాంతాల్లోని 11.9 కోట్ల మంది భూ ప్రకంపనలు ఎదుర్కొన్నట్లు పేర్కొంది. పాక్‌లోని పెషావర్‌, ఇస్లామాబాద్‌, లాహోర్‌, ఖైబర్‌ పఖ్తుంఖ్వా, పంజాబ్‌ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఒకరు మృతి చెందారు.

ఏటా భూకంపాలే

అఫ్గానిస్థాన్‌లో ప్రకృతి విపత్తులు సాధారణం కాగా, 2002లో సంభవించిన భారీ భూకంపంలో 1,000 మందికి పైగా చనిపోయారు. ఏటా సగటున 560 మంది భూకంపాల కారణంగా మరణిస్తున్నట్లు ఐరాస మానవ హక్కుల సంఘం నివేదిక ఒకటి పేర్కొంది.

ప్రాణ నష్టంపై మోదీ ఆవేదన

దిల్లీ: అఫ్గాన్‌ భూకంపంలో పెద్దఎత్తున ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లడంపై ప్రధాని నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తంచేశారు. సహాయక సామగ్రిని సాధ్యమైనంత తొందరగా పంపించనున్నట్లు తెలిపారు. బాధాతప్త తరుణంలో అఫ్గాన్‌ ప్రజలకు భారత్‌ ప్రజలు బాసటగా నిలుస్తారని భరోసా ఇస్తూ ట్వీట్‌ చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కష్టకాలంలో సంఘీభావం ప్రకటించినందుకు అఫ్గాన్‌ రాయబారి ఫరీద్‌ మముంద్‌జే కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే తమ పరిస్థితి దయనీయంగా ఉందనీ, ఇప్పుడు మరింత సంక్లిష్టంగా మారిందని ట్వీట్‌ చేశారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని