Updated : 03/12/2021 09:19 IST

డబ్బులిస్తే ఉద్యోగం ఇస్తామని సందేశాలు.. బోగస్‌ అని తేల్చిచెప్పిన ప్రభుత్వం

పశు సంవర్ధకశాఖలో క్షేత్రస్థాయి కొలువులంటూ ప్రకటనలు..

సోషల్‌ మీడియాలో వస్తున్న ఉద్యోగ ప్రకటనతో తమకు ఏ సంబంధం లేదంటూ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ జారీ చేసిన ప్రకటన


‘గ్రామీణ్‌ పశుపాలన్‌ నిగమ్‌ లిమిటెడ్‌’ సంస్థ ఆధ్వర్యంలో పశుసంవర్ధకశాఖ పరిధిలో గ్రామస్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ పెద్దపల్లి జిల్లా జూలపల్లికి చెందిన గృహిణి సెల్‌ఫోన్‌కు ఓ సందేశం వచ్చింది. సదరు మహిళ రిజిస్ట్రేషన్‌ రుసుం కింద ఆన్‌లైన్‌లో రూ.625 చెల్లించారు. అనంతరం పశుసంవర్ధక శాఖ అధికారులను ఆరా తీస్తే అది నకిలీ వెబ్‌సైట్‌ అని, పత్రికల్లో ఎక్కడా ఈ ప్రకటన ఇవ్వలేదని చెప్పడంతో ఆమె కంగుతిన్నారు.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వ్యక్తి రిజిస్ట్రేషన్‌ రుసుం చెల్లించడంతో సదరు సంస్థ నుంచి అతడికి ఈ మెయిల్‌ వచ్చింది. అందులో రూ.25 వేలు చెల్లిస్తే ఉద్యోగానికి సంబంధించిన కాల్‌లెటర్‌ పంపిస్తామని పేర్కొన్నారు. అనుమానంతో నేరుగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులను సంప్రదించగా అవి బోగస్‌ నియామక ఉత్తర్వులని తేల్చారు.


ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి: రాష్ట్రవ్యాప్తంగా పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లాలను లక్ష్యంగా చేసుకుని పలు బోగస్‌ సంస్థలు మోసాలకు పాల్పడుతున్నాయి. రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన ‘గ్రామీణ్‌ పశుపాలన్‌ నిగమ్‌ లిమిటెడ్‌’ సంస్థ పేరుతో నిరుద్యోగులకు వల వేస్తున్నాయి. ఈ క్రమంలో ‘‘తెలంగాణలోని ‘నేషనల్‌ యానిమల్‌ హస్బెండరీ డెవలప్‌మెంట్‌ మిషన్‌’ కింద పశు ఉత్పత్తులను కచ్చితమైన ధరలకు మార్కెట్‌ చేయాలి. ఈ పథకంలో పని చేసేందుకు 18 నుంచి 40 ఏళ్ల వయసు వారికి అవకాశాలు కల్పిస్తున్నాం’’అంటూ సామాజిక మాధ్యమాల్లో మూడు రోజులుగా ఓ ప్రకటన చక్కర్లు కొడుతోంది. ‘యానిమల్‌ హస్బెండరీ వర్కర్‌’ పేరిట ప్రతి పంచాయతీకి ఒకరిని ఎంపిక చేస్తామని, కనీస విద్యార్హత పదో తరగతిగా, నెల జీతం రూ.10 వేలుగా పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా రూ.600 రిజిస్ట్రేషన్‌, రూ.25 సేవా రుసుం కట్టి పేరు నమోదు చేసుకోవాలని ఉంటుందని చెబుతున్నారు. ఈ రుసుం చెల్లించిన వారికి ఎలాంటి రశీదు ఇవ్వడం లేదు. దరఖాస్తుతో పదో తరగతి మెమో, అభ్యర్థి సంతకం, ఫొటోలు, మెయిల్‌ ఐడీ వివరాలు జత చేయాలని చెబుతున్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత దరఖాస్తుదారుల మెయిల్‌కు సదరు సంస్థ నుంచి మెయిల్‌ రాగా అందులో రూ.25 వేలు చెల్లిస్తే ఎంపిక చేసుకున్న గ్రామంలో ఉద్యోగం ఇప్పిస్తామని పేర్కొంటున్నారు.


రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు

- ఎస్‌.రాంచందర్‌, అదనపు సంచాలకులు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ

‘‘జైపుర్‌కు చెందిన ‘గ్రామీణ్‌ పశుపాలన్‌ నిగమ్‌ లిమిటెడ్‌’ సంస్థ పేరిట రాష్ట్రవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగ ప్రకటనలు వస్తుండటంపై మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ప్రకటనకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఉద్యోగ నియామకాలుంటే ప్రభుత్వమే ప్రకటన జారీ చేస్తుంది’’


 

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని