Jaggareddy: కొత్త పార్టీ పెడతా

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చాక కొత్త

Updated : 20 Feb 2022 05:48 IST

రాజీనామాపై వెనక్కి తగ్గేదే లేదు

కోవర్టుగా ముద్ర వేయడం కలచివేసింది

కాంగ్రెస్‌ నుంచి బయటకొచ్చాక స్వతంత్ర రాజకీయం చేస్తానని వెల్లడి

స్పష్టం చేసిన జగ్గారెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చాక కొత్త పార్టీ ప్రకటిస్తానని, స్వతంత్ర రాజకీయం చేస్తానని చెప్పారు. శనివారం ఆయన నగరంలోని ఒక హోటల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘తప్పును తప్పని, ఒప్పును ఒప్పని ముక్కుసూటిగా చెప్పే తత్వం నాది. అలా మాట్లాడితే నా వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని బురద జల్లుతున్నారు. నియోజకవర్గ అభివృద్ది కోసం మంత్రులను, సీఎంను కలిస్తే కోవర్టు అని పార్టీలో ఒక వర్గం సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది. చివరికి నా భార్యకు ఫోన్‌ చేసి ఇదే విషయం మాట్లాడుతున్నారు. ఇది నన్ను కలచివేసింది. ఈ  అపవాదును పార్టీలో ఎవరూ ఖండించకపోవడం బాధేసింది. నా వల్ల పార్టీకి నష్టం జరగొద్దు, అదే సమయంలో నేనూ ఇబ్బంది పడొద్దని రాజీనామా నిర్ణయం తీసుకున్నా. ఇది టీ కప్పులో తుపాను లాంటిదని.. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని రేవంత్‌రెడ్డి అంటున్నారు. కానీ నేను పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలనే ఆయన చూస్తున్నారు. పార్టీ వీడినా సోనియా, రాహుల్‌గాంధీలకు విధేయుడిగానే ఉంటా. వేరే పార్టీలోకి వెళ్తే నన్ను ఆపేదెవరు? కానీ వెళ్లను’’ అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఆయన సోనియా, రాహుల్‌లకు 4 పేజీల లేఖ రాశారు.

జగ్గారెడ్డిని బుజ్జగించే పనిలో సీనియర్లు

జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రంగంలోకి దిగారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయనకు ఫోన్‌ చేసి తన ఇంటికి ఆహ్వానించారు. శనివారం రాత్రి ఆయన నివాసంలో గీతారెడ్డి, సంపత్‌కుమార్‌, శివసేనారెడ్డి తదితరులతో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. దిల్లీకి తీసుకెళ్తానని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. ఉదయం వి.హనుమంతరావు, మహేష్‌కుమార్‌గౌడ్‌, కుసుమకుమార్‌, ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్‌ తదితరులు జగ్గారెడ్డిని కలిశారు. పార్టీ వీడొద్దంటూ పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌ జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని వేడుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని