కోర్టులు చెప్పే వరకు స్పందించరా?

కొవిడ్‌ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శించిన తాత్సార వైఖరిపై జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సంజీవ్‌ఖన్నాలతో కూడిన ధర్మాసనం బుధవారం విరుచుకుపడింది.

Published : 20 Jan 2022 05:38 IST

కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో ఏపీ తాత్సార వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శించిన తాత్సార వైఖరిపై జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సంజీవ్‌ఖన్నాలతో కూడిన ధర్మాసనం బుధవారం విరుచుకుపడింది. పదేపదే జారీ చేస్తున్న ఉత్తర్వులను పట్టించుకోరా? అని నిలదీసింది. కోర్టులు చెప్పేంతవరకూ స్పందించే గుణం లేదా, ఆ మాత్రం సున్నితత్వం లేకుండా పోయిందా (సెన్సిటివిటీ) అని మండిపడింది. మధ్యాహ్నం 2 గంటలకు ఆ రెండు రాష్ట్రాల సీఎస్‌లు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించడంతో ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మ, బిహార్‌ సీఎస్‌ అమిర్‌ సుభానీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ధర్మాసనం ముందు హాజరై క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. బుధవారం ఉదయం కేసు విచారణకు వచ్చినప్పుడు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ‘‘కొవిడ్‌తో మృతుల కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాలని పదేపదే ఉత్తర్వులు జారీచేసినా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాత్సారం చేసింది. కొవిడ్‌తో 14,471 మంది మృతి చెందినట్లు రికార్డుల్లో నమోదైతే, పరిహారం కోసం 31 వేలకుపైగా దరఖాస్తులొచ్చినట్లు న్యాయవాది చెప్పారు. ఇప్పటివరకు 11వేల మందికే పరిహారం చెల్లించారు. అర్హులకు పరిహారం చెల్లించకపోవడం అంటే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమే. ఇందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే బాధ్యత వహించాలి. సీఎస్‌ రెండు గంటలకు హాజరై, ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో సంజాయిషీ ఇవ్వాలి’’ అని జస్టిస్‌ ఎంఆర్‌ షా ఆదేశించారు. బిహార్‌ సీఎస్‌కూ ఇదే తరహా ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో రెండురాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు మధ్యాహ్నం 2 గంటలకు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా హాజరై జరిగిన దానికి క్షమాపణలు చెప్పి, ఇకపై ఇలాంటిది జరగనీయబోమని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని