దేశవ్యాప్తంగా పెరిగిన అటవీ విస్తీర్ణం

దేశవ్యాప్తంగా అడవులు, చెట్ల ఉనికి విస్తీర్ణం పెరిగింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేందర్‌యాదవ్‌ గురువారం విడుదల చేసిన ‘అటవీ సర్వే ద్వైవార్షిక నివేదిక-2021’

Updated : 14 Jan 2022 06:14 IST

తొలి మూడు స్థానాల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా

2021 అటవీ సర్వే నివేదిక విడుదల

అటవీ సర్వే నివేదిక-2021 విడుదలచేస్తున్న కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ తదితరులు

ఈనాడు, దిల్లీ,హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా అడవులు, చెట్ల ఉనికి విస్తీర్ణం పెరిగింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేందర్‌యాదవ్‌ గురువారం విడుదల చేసిన ‘అటవీ సర్వే ద్వైవార్షిక నివేదిక-2021’ ప్రకారం 2,261 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కొత్తగా పచ్చదనాన్ని సంతరించుకుంది. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ (647 చ.కి.మీ పెరుగుదల), తెలంగాణ (632 చ.కి.మీ), ఒడిశా (537 చ.కి.మీ) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రంలో రెండేళ్లలో అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం చేపట్టిన హరితహారం, అడవుల సంరక్షణతో ఇది సాధ్యమైంది. ఏపీ, తెలంగాణల్లో 2019 నవంబరు నుంచి 2020 మే వరకు ఉన్న గణాంకాలను పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే నివేదిక రూపొందించారు. 

హైదరాబాద్‌లో భారీగా పెరుగుదల

మెట్రో నగరాల జాబితాలో గత పదేళ్లలో హైదరాబాద్‌లో అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2021 నాటికి హైదరాబాద్‌ నగర విస్తీర్ణం (634.18 చ.కి.మీ.)లో అటవీ విస్తీర్ణం 12.90 శాతంగా నమోదైంది. 2011లో 33.15 చ.కి.మీ. పచ్చదనం ఉంటే.. ఇప్పుడు 81.81 చ.కి.మీ.కు పెరిగింది.

తెలంగాణలో ఏడు పులులు: ప్రపంచవ్యాప్తంగా పులుల్లో 70 శాతం (3,890) దేశంలో ఉన్నాయి. మూడేళ్ల క్రితం సర్వే ప్రకారం తెలంగాణలో ఏడు పులులు ఉన్నాయి. రాష్ట్రంలో పులుల సంరక్షణకు 2,611.39 చ.కి.మీ. విస్తీర్ణాన్ని రిజర్వు టైగర్‌ ఫారెస్టుగా గుర్తించారు. రాష్ట్రంలో అమ్రాబాద్‌, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టుల్లో 2021 నాటికి అమ్రాబాద్‌లో టైగర్‌ రిజర్వు ప్రాంతం పెరిగితే.. కవ్వాల్‌లో 126 చ.కి.మీ. తగ్గింది.

దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ ప్రత్యేకతను చాటుకొంది. మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 33% భూభాగం అటవీ ప్రాంతంగా ఉంది. సముద్ర తీరం వెంబడి పెరిగే మడ అడవుల విసీర్ణం 4,992 చ.కి.మీగా తేలింది. కొత్తగా 17 చ.కి.మీల పరిధిలో మడ అడవులు వృద్ధి చెందాయి. ఈ నివేదిక ప్రకారం దేశంలో అడవులు, చెట్లు 80.9 మిలియన్‌ హెక్టార్లలో విస్తరించాయి. మొత్తం భూభాగంలో వీటి వాటా 24.62%. 2019తో పోలిస్తే 2,261 చ.కి.మీ అటవీ విస్తీర్ణం పెరగ్గా అందులో అడవులు 1,540 చ.కి.మీ. చెట్లు 721 చ.కి.మీ.గా ఉన్నాయి. ఓపెన్‌ ఫారెస్ట్‌లో పెరుగుదల బాగా కనిపించింది. మధ్యప్రదేశ్‌ తర్వాత విస్తీర్ణ పరంగా అత్యధిక అటవీ ప్రాంతం అరుణాచల్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్రల్లో ఉంది. రాష్ట్రాల భూభాగం పరంగా చూస్తే మిజోరం (84.53%), అరుణాచల్‌ప్రదేశ్‌ (79.33%), మేఘాలయ (76%), మణిపుర్‌ (73.34%), నాగాలాండ్‌ (73.90%) అగ్రస్థానంలో ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల లెక్కలివీ..

* ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం నమోదైన అటవీ ప్రాంతం 37,258 చ.కి.మీ. మేర ఉంది. రాష్ట్ర మొత్తం భూభాగంలో ఇది 22.86%. 

* తెలంగాణలో నమోదైన అటవీ ప్రాంతం 27,688 చ.కి.మీ. కాగా, రాష్ట్ర భూభాగంలో ఇది 24.70%. అత్యధికంగా కరీంనగర్‌ పూర్వజిల్లాలో 217.81 చ.కి.మీ. అందుబాటులోకి వచ్చింది.

* ఏపీలో దట్టమైన అటవీ ప్రాంతం 1,994 చ.కి.మీ. మధ్యస్థాయి దట్టమైన అటవీప్రాంతం 13,929 చ.కి.మీ., ఓపెన్‌ ఫారెస్ట్‌ 13,861 చ.కి.మీ.గా సర్వే తేల్చింది.

* తెలంగాణలో దట్టమైన అడవులు 1,624, మధ్యస్థాయి దట్టమైన ప్రాంతం 9,119, ఓపెన్‌ ఫారెస్ట్‌ ప్రాంతం 10,471 చ.కి.మీ. మేర ఉంది. 2019తో పోలిస్తే 632 చ.కి.మీ. మేర (3.07%) పెరుగుదల నమోదైంది.

* ఆంధ్రప్రదేశ్‌ అడవుల్లో 2019 నవంబరు నుంచి 2020 జూన్‌ వరకు 9,996 అగ్ని ప్రమాదాలు జరగ్గా, 2020-21లో ఇదే సమయంలో ఆ సంఖ్య 19,328గా నమోదైంది. ఇదే  కాలానికి తెలంగాణ అడవుల్లో అగ్నిప్రమాదాలు 12,132 నుంచి 18,237కి చేరాయి. అత్యధిక ప్రమాదాలు జరిగిన తొలి పది రాష్ట్రాల్లో ఏపీ 7, తెలంగాణ 8వ స్థానంలో నిలిచాయి.

* చెట్ల విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్‌లో 4,679 చ.కి.మీ. మేర ఉంది. మొత్తం భూభాగంలో ఇది 2.87%. తెలంగాణలో చెట్ల విస్తీర్ణం 2,848 చ.కి.మీ కాగా, రాష్ట్ర భూభాగంలో ఇది 2.54%.

* ఏపీలో వెదురు పండే ప్రాంతం విస్తీర్ణం 2019-21 మధ్యలో 899 చ.కి.మీ. మేర తగ్గగా, తెలంగాణలోనూ 903 చ.కి.మీ. కుంచించుకుపోయింది.

కరీంనగర్‌లో అత్యధికంగా పెరుగుదల

రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 631.67 చ.కి.మీ. అటవీప్రాంతం పెరిగింది. అత్యధికంగా కరీంనగర్‌ పూర్వజిల్లాలో 217.81 చ.కి.మీ. అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లో 0.68 చ.కి.మీ. తగ్గింది. కరీంనగర్‌ తరువాత వరంగల్‌లో 145.62, నల్గొండలో 103.75 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం పెరిగింది. అత్యల్పంగా మహబూబ్‌నగర్‌లో కేవలం 9.24 చ.కి.మీ. మాత్రమే పెరుగుదల ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని