కొత్తగా 4,207 కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజులోనే కొత్తగా 4,207 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,22,403కు పెరిగింది. ఒకేరోజున ఇంత

Published : 21 Jan 2022 04:50 IST

3.5 శాతంగా పాజిటివిటీ రేటు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజులోనే కొత్తగా 4,207 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,22,403కు పెరిగింది. ఒకేరోజున ఇంత భారీ సంఖ్యలో కొత్త పాజిటివ్‌లు నమోదవడం గత ఏడాది మే తర్వాత ఇదే తొలిసారి. ఇదే క్రమంలో నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఒక్కరోజే 1,20,215 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.5 శాతంగా నమోదైంది. మహమ్మారి బారినపడి మరో ఇద్దరు మరణించారు. ఈ నెల 20న సాయంత్రం 5.30గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని వైద్యారోగ్యశాఖ గురువారం విడుదల చేసింది.

జిల్లాల్లో పెరుగుతున్న కేసులు..

కరోనాకు చికిత్స పొంది తాజాగా 1,825 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,633 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,645 కేసులు నమోదవగా అన్ని జిల్లాల్లోనూ ఒక్కరోజు వ్యవధిలోనే సుమారు 30-40 శాతం కేసులు పెరిగాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి(380), రంగారెడ్డి(336), హనుమకొండ(154), సంగారెడ్డి(107), ఖమ్మం(98), భద్రాద్రి కొత్తగూడెం(91), పెద్దపల్లి(87), వికారాబాద్‌(86), కరీంనగర్‌, నల్గొండ జిల్లాల్లో 84 చొప్పున, మహబూబ్‌నగర్‌(81), మంచిర్యాల(80), యాదాద్రి భువనగిరి(78), నిజామాబాద్‌(74), సిద్దిపేట(70), మహబూబాబాద్‌(63), నాగర్‌కర్నూలు, సూర్యాపేట జిల్లాల్లో 52 చొప్పున పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మరో 3,18,569 కొవిడ్‌ టీకా డోసులను పంపిణీ చేశారు. ఇందులో తొలిడోసు పొందినవారు 71,875 మంది కాగా రెండోడోసు స్వీకరించినవారు 2,31,672 మంది, ముందస్తు నివారణ డోసు తీసుకున్నవారు 15,022 మంది ఉన్నారు.

ఏపీలో 12,615 కేసులు... అయిదుగురి మృతి

ఈనాడు, అమరావతి:ఏపీలో 20 రోజుల్లో కరోనా పాజిటివిటీ శాతం 26శాతానికి చేరింది.  బుధవారం ఉదయం 9గంటల నుంచి గురువారం ఉదయం 9గంటల మధ్య 47,420 నమూనాలను పరీక్షిస్తే 12,615 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. అయిదుగురు మృతిచెందారు.


కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కరోనా

ఈనాడు, దిల్లీ: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కరోనా వైరస్‌ సోకింది. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో తనకు పాజిటివ్‌గా తేలినట్లు ఆయన గురువారం ఉదయం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, అన్ని రకాల నిబంధనలు పాటిస్తూ హోం క్వారంటైన్‌లో ఏకాంతంగా ఉంటున్నట్లు చెప్పారు.


ఈ నెల 31 వరకు కరోనా ఆంక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దాని నియంత్రణకు చేపట్టిన ఆంక్షల అమలును ఈ నెల 31వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు (జీవో నం.12) జారీచేసింది. ఈ నెలాఖరు వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది.


రెండోడోసులో కరీంనగర్‌ ప్రథమస్థానం

కరీంనగర్‌ వైద్య విభాగం, న్యూస్‌టుడే: కరోనా రెండో డోసు ఇవ్వడంలో కరీంనగర్‌ జిల్లా మొదటిస్థానం పొందింది. ప్రభుత్వం గురువారం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం కరీంనగర్‌ జిల్లాలో 97 శాతం మంది రెండో డోసు టీకా తీసుకున్నారు. 89 శాతంతో ఖమ్మం, యాదాద్రి, భువనగిరి జిల్లాలు రెండో స్థానంలో నిలిచాయి. 56 శాతంతో కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చివరి స్థానంలో ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని