సీఎం జిల్లాకే కలెక్టర్‌ లేరు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత జిల్లా సిద్దిపేటకు ఆరు నెలలుగా పూర్తిస్థాయి కలెక్టర్‌ లేరు. గత నవంబరులో కలెక్టర్‌ వెంకట్రాంరెడ్డి రాజీనామా చేయగా... అప్పటి నుంచి ఇన్‌ఛార్జే ఉన్నారు.

Published : 26 May 2022 04:56 IST

మరో రెండు జిల్లాలకూ ఇన్‌ఛార్జీలే
పాలనపై ప్రభావం

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత జిల్లా సిద్దిపేటకు ఆరు నెలలుగా పూర్తిస్థాయి కలెక్టర్‌ లేరు. గత నవంబరులో కలెక్టర్‌ వెంకట్రాంరెడ్డి రాజీనామా చేయగా... అప్పటి నుంచి ఇన్‌ఛార్జే ఉన్నారు.

* హైదరాబాద్‌ నగర పరిధిలోని మేడ్చల్‌-రంగారెడ్డి జిల్లాలోనూ ఆరు నెలలుగా ఇన్‌ఛార్జీకే బాధ్యతలు అప్పగించారు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పూర్తిస్థాయి కలెక్టర్‌ లేరు. గత ఏడాది జూన్‌ 1 నుంచి అక్కడా పూర్తి అదనపు బాధ్యతల కలెక్టర్‌ ఉన్నారు.

రాష్ట్రంలో మూడు జిల్లాల్లో కలెక్టర్లు లేకపోవడంతో మరో రెండు జిల్లాల్లోనూ పాలనపై  ప్రభావం పడుతోంది. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ పోస్టు ఖాళీ అయ్యాక వెంటనే మరో ఐఏఎస్‌ అధికారిని నియమించకుండా... సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఎం.హన్మంతరావుకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ)నిచ్చారు. దీంతో ఆయన రెండు జిల్లాల్లో పనిచేయాల్సి వస్తోంది. మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.హరీశ్‌కు గత నవంబరులో మేడ్చల్‌ మల్కాజిగిరి కలెక్టర్‌గా బాధ్యతలు ఇచ్చారు. ఆయన రెండు జిల్లాలు తిరుగుతున్నారు. ఖమ్మం నుంచి విడిపోయి ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ ఎంవీ రెడ్డి   గత ఏడాది మే 31న పదవీ విరమణ పొందగా కొత్త కలెక్టర్‌ను నియమించకుండా... అక్కడే అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న అనుదీప్‌కు బాధ్యతలు ఇచ్చారు. ఏడాదిగా ఆయన రెండు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

సమన్వయానికి తంటాలు

ప్రతీ జిల్లాకు కలెక్టర్‌ నియామకం తప్పనిసరి కాగా... ప్రభుత్వం ఇన్‌ఛార్జీలపై దృష్టి సారించడం వల్ల పాలనాపరమైన సమస్యలు పరిష్కారం కావడం లేదు. రెండు జిల్లాలకు ఒకేసారి ముఖ్యమంత్రి, మంత్రులు వచ్చిన సందర్భాల్లో కలెక్టర్‌ రెండుచోట్ల సమన్వయానికి తంటాలు పడుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా రెండు జిల్లాల తరఫున మాట్లాడాల్సి వస్తోంది. జడ్పీ ఇతర జిల్లాస్థాయి కీలక సమావేశాలు రెండూ ఒకేరోజు జరిగితే ఒక్కదానిలోనే పాల్గొనే వీలుంది. కలెక్టర్‌ తీరికను బట్టి రెండో జిల్లాలో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. తమకు పూర్తిస్థాయి కలెక్టర్‌ కావాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు తరచూ అభ్యర్థిస్తున్నారు. ఐఏఎస్‌ అధికారులు అందుబాటులో ఉన్నా పలు అనుకూలతలను ఆధారంగా తీసుకొని నియామకాలు చేపట్టడం వల్ల వెంటనే పోస్టులు భర్తీ కావడం లేదని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని