కేంద్రం విధానాలతో రాష్ట్రాలకు తీవ్ర నష్టం

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు రాష్ట్రాలకు తీవ్ర నష్టాల్ని మిగుల్చుతున్నాయని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు.

Published : 29 May 2022 05:19 IST

తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

సోమాజిగూడ, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు రాష్ట్రాలకు తీవ్ర నష్టాల్ని మిగుల్చుతున్నాయని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. దేశంలో విద్యుత్తు, బొగ్గు కొరత, విద్యుత్తు ఉత్పత్తి సంస్థల అభివృద్ధి, విద్యుత్తు సవరణ బిల్లు-2021, ప్రైవేటీకరణ విధానాలు, ఉద్యోగుల సర్వీస్‌ సమస్యలు, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తదితర అంశాలపై చర్చించేందుకు ఆల్‌ ఇండియా పవర్‌ ఇంజినీర్స్‌ ఫెడరేషన్‌(ఏఐపీఈఎఫ్‌) జాతీయస్థాయి సమావేశం శనివారం హైదరాబాద్‌ బేగంపేటలోని హోటల్‌ హరిత ప్లాజాలో జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎండీ మాట్లాడుతూ- ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో విద్యుత్తు ప్రైవేటీకరణ, విద్యుత్తు సవరణ చట్టం-2021ను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. తెలంగాణలో కావల్సినంత బొగ్గు ఉందని, అదనంగా అవసరం లేకున్నా విదేశీ బొగ్గును కొనుగోలు చేయాలని కేంద్రం బలవంతం చేస్తోందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. విద్యుత్తు సమస్యలపై ఏఐపీఈఎఫ్‌ సభ్యులతో సీఎం త్వరలో సమావేశమవుతారని తెలిపారు. ఫెడరేషన్‌ జాతీయ ఛైర్మన్‌ శైలేంద్ర దుబే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఆదర్శంగా ఉన్నాయని, అన్ని రాష్ట్రాలు ఇలాంటివి పాటిస్తే దేశమంతటా మిగులు విద్యుత్తు సాకారమవుతుందని అన్నారు. సమావేశంలో ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి పి.రత్నాకర్‌రావు, సలహాదారులు అశోక్‌రావు, పీపీ సింగ్‌, ఉపాధ్యక్షులు టి.జయంతి, సునీల్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల విద్యుత్తు ఇంజినీర్ల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని