బియ్యం.. కింకర్తవ్యం..!

రాష్ట్రంలో బియ్యం సేకరణ వ్యవహారం అయోమయంలో పడింది. కొనుగోళ్ల పునరుద్ధరణకు సంబంధించి కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఉత్తర్వులు రాలేదు. మిల్లుల్లో ఎక్కడి బియ్యం అక్కడే నిలిచిపోయాయి. ఇప్పటికే మిల్లుల్లో 92 లక్షల మెట్రిక్‌

Published : 24 Jun 2022 05:36 IST

సేకరణపై రెండు వారాలైనా వీడని పీటముడి

భవిష్యత్‌ కార్యాచరణపై త్వరలో రైస్‌ మిల్లర్ల సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్రంలో బియ్యం సేకరణ వ్యవహారం అయోమయంలో పడింది. కొనుగోళ్ల పునరుద్ధరణకు సంబంధించి కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఉత్తర్వులు రాలేదు. మిల్లుల్లో ఎక్కడి బియ్యం అక్కడే నిలిచిపోయాయి. ఇప్పటికే మిల్లుల్లో 92 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వలున్నాయి. మూడు, నాలుగు నెలల్లో మరో 80 లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్లు వస్తాయి. ఉన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చి కేంద్రానికి ఇవ్వకపోతే వచ్చే వడ్లను ఎక్కడ నిల్వ చేయాలా అనే అందోళన అధికారుల్లో ఉంది. మరోపక్క ఎక్కే గడప, దిగే గడప అన్నట్లు రెండు వారాలుగా దిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఉన్నతాధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారు.

ధాన్యం విక్రయించండి: మిల్లర్లు

కేంద్రం బియ్యం తీసుకోవటం లేదు. ఎప్పుడు పునరుద్ధరిస్తుందో తెలియడం లేదు. యాసంగి ధాన్యం మిల్లింగ్‌ చేయించినా సింహభాగం సాధారణ బియ్యమే తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది. నూకల నష్టం ఇస్తేనే మిల్లింగ్‌ చేస్తామని మిల్లర్లు స్పష్టం చేశారు. మరోవైపు మిల్లింగ్‌తో పని లేకుండా ప్రభుత్వం ధాన్యం విక్రయిస్తే కొనుగోలు చేస్తామని, తొలిదశలో పది లక్షల మెట్రిక్‌ టన్నులు తీసుకుంటామని రైస్‌ మిల్లర్ల సంఘం ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లో ధాన్యం వేలం ప్రక్రియ సాగుతోంది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతి పదిహేను రోజులకు ఒకదఫా వేలం నిర్వహిస్తోంది. అదే తరహాలో రాష్ట్రంలో కూడా వేలం నిర్వహించాలన్నది ప్రతిపాదనగా ఉంది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే స్పష్టత వస్తుందని అధికారులంటున్నారు. మరోప్రక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పరిస్థితి వివరించి.. ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు శనివారం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని