సీజనల్‌ వ్యాధులపై క్యాలెండర్‌

జులై-అక్టోబరు మధ్య కాలంలో డెంగీ, మలేరియా, ఇతర కాలానుగుణ జ్వరాలు.. నవంబరు-మార్చి మధ్య స్వైన్‌ఫ్లూ, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు.. ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో వడదెబ్బ, డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతాయని ఆరోగ్యశాఖ

Published : 24 Jun 2022 05:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: జులై-అక్టోబరు మధ్య కాలంలో డెంగీ, మలేరియా, ఇతర కాలానుగుణ జ్వరాలు.. నవంబరు-మార్చి మధ్య స్వైన్‌ఫ్లూ, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు.. ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో వడదెబ్బ, డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఏడాది పొడవునా వచ్చే వ్యాధులు, వాటిని ఎదుర్కొనే తీరుపై ఆరోగ్యశాఖ తాజాగా సీజనల్‌ వ్యాధుల క్యాలెండర్‌ను రూపొందించింది. పంచాయతీ, పురపాలక సహా అన్ని ప్రభుత్వ శాఖలు కలిసికట్టుగా సీజనల్‌ వ్యాధుల నివారణకు కృషి చేయాలని తెలిపింది. ఇందుకోసం 24 గంటలూ సేవలందించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. వర్షాకాల సీజన్‌ ప్రారంభం కావడంతో డెంగీ, మలేరియా, గన్యా, టైఫాయిడ్‌, డయేరియా, న్యుమోనియా తదితర వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయనీ, పాము కాట్లు కూడా ఎక్కువగా సంభవించే అవకాశాలున్నాయని తెలిపింది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుండడం.. రెండోవైపు సీజనల్‌ వ్యాధులూ పెరిగే అవకాశాలుండడంతో.. వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. అనుమానిత లక్షణాలున్న వారికి తప్పనిసరిగా కొవిడ్‌ పరీక్ష నిర్వహించాలని, సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలంది. కొవిడ్‌, కాలానుగుణ వ్యాధుల చికిత్సకు అవసరమైన ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలని, ప్రభుత్వ వైద్యంలో ఎక్కడా మందుల కొరత లేకుండా చూడాలని ఆదేశించింది. కొవిడ్‌, డెంగీలు ఏకకాలంలో ప్రబలకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని