రైతాంగానికి మోదీ చేసింది సున్నా

ప్రధాని మోదీ దేశ రైతాంగానికి చేసింది శూన్యమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. తన నివాసంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పెట్టుబడి ఖర్చుల కన్నా 50 శాతం

Published : 30 Jun 2022 06:18 IST

 రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపణ

16.32 లక్షల మందికి రూ. 1234 కోట్ల రైతుబంధు సాయం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధాని మోదీ దేశ రైతాంగానికి చేసింది శూన్యమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. తన నివాసంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పెట్టుబడి ఖర్చుల కన్నా 50 శాతం ఎక్కువ మద్దతు ధర ఇస్తున్నామని చెబుతూ రైతులను ప్రధాని మోసం చేస్తున్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన నుంచి మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ సహా పలు రాష్ట్రాలు వైదొలగాయి. దాన్ని అమలు చేస్తే చెల్లించాల్సిన ప్రీమియం ఎక్కువ, రైతులకు వచ్చే పరిహారం తక్కువ. పశ్చిమ బెంగాల్‌లో అమలు చేస్తున్న పంటల బీమా విధానంపై అధ్యయనం చేస్తాం. కాంగ్రెస్‌ చెడు రాజకీయాలు చేసేందుకు ఏడు దశాబ్దాలు పట్టింది. భాజపా ఎనిమిదేళ్లలోనే ప్రజలు ఏవగించుకునేలా రాజకీయాలు చేస్తోంది. కేంద్రం నుంచి తెలంగాణకు మొత్తం రూ.7183.71 కోట్లు రావాల్సి ఉంది’ అని నిరంజన్‌రెడ్డి చెప్పారు.  ‘రైతుబంధు తొలిరోజు 19.98 లక్షల మంది రైతులకు చెందిన 11.73 లక్షల ఎకరాలకు రూ.586.65 కోట్లు జమ చేయగా బుధవారం రెండోరోజు 16.32 లక్షల మంది రైతులకు చెందిన 24.68 లక్షల ఎకరాలకు రూ.1234.10 కోట్లు ఇచ్చాం. రైతుబంధుపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. గత ఎనిమిది విడతలలో రూ.50,448 కోట్ల సాయం అందించగా, ప్రస్తుతం తొమ్మిదో విడతలో అర్హులు 68.10 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు 1.50 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందుతోంది’ అని వివరించారు.

ఉద్యాన పంటల సాగుకు ఆదేశం

రైతులను కూరగాయల సాగువైపు మళ్లించాలని, ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) వందమంది రైతులతో ఉద్యాన పంటలను సాగు చేయించాలని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల వ్యవసాయ, ఉద్యాన అధికారులతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘అక్టోబరు నుంచి మే వరకు వేయగలిగే పంటలపై వ్యవసాయ, ఉద్యానశాఖలు రైతులను సన్నద్ధం చేయాలి. అన్ని రైతువేదికల్లో తప్పనిసరిగా బంతిమొక్కలు నాటాలి. ఎరువులకు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠినచర్యలు తీసుకోవాలి. రైతుబంధు వివరాలు అసంపూర్తిగా ఉన్న ఖాతాలను వెంటనే సరిచేయాలి’ అని మంత్రి సూచించారు. రైతులు సాగు చేసే పంటల వివరాలు నమోదు చేసేందుకు రూపొందించిన ‘ఏఈవో యాప్‌’ను మంత్రి ఆవిష్కరించారు.


వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాలు అభివృద్ధి చేయాలి
ఉద్యాన పంటల సమాఖ్య ఛైర్మన్‌ పిలుపు

వాతావరణ మార్పులను తట్టుకునేలా పంటల సాగు విధానం మారాలని, అందుకు అనుగుణంగా కొత్త వంగడాలను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని ‘భారత ఉద్యాన పంటల సమాఖ్య’ ఛైర్మన్‌ హెచ్‌పీ సింగ్‌ ఆకాంక్షించారు. ఆ దిశగా కృషి జరగాలని శాస్త్రవేత్తలకు సూచించారు. ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, అగ్రి హార్టికల్చర్‌ సొసైటీ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ఆడిటోరియంలో బుధవారం డాక్టర్‌ వెంకటరత్నం రెండో స్మారకోపన్యాస కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హెచ్‌పీ సింగ్‌ మాట్లాడుతూ ఉద్యాన పంటల సగటు ఉత్పాదకత మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యానశాఖ రాష్ట్ర సంచాలకుడు వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని