మంకీపాక్స్‌ కలకలం!

రాష్ట్రంలో ఓ వ్యక్తిలో మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకూ కేరళ, దిల్లీల్లో కలుపుకొని మొత్తంగా 4 కేసులు నమోదు కాగా.. తాజాగా కామారెడ్డి పట్టణ వాసి(40)లో లక్షణాలు కనిపించడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.

Updated : 25 Jul 2022 11:05 IST

 కామారెడ్డి వాసిలో వ్యాధి లక్షణాలు

రెండు వారాల కిందట కువైట్‌ నుంచి రాక

ఫీవర్‌ ఆసుపత్రికి తరలింపు

ఈనాడు, హైదరాబాద్‌ - కామారెడ్డి వైద్య విభాగం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఓ వ్యక్తిలో మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకూ కేరళ, దిల్లీల్లో కలుపుకొని మొత్తంగా 4 కేసులు నమోదు కాగా.. తాజాగా కామారెడ్డి పట్టణ వాసి(40)లో లక్షణాలు కనిపించడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రెండు వారాల కిందట కువైట్‌ నుంచి వచ్చిన ఆ వ్యక్తిలో ఈ నెల 20 నుంచి లక్షణాలు మొదలయ్యాయి. తొలుత జ్వరం వచ్చింది. మూడు రోజుల తర్వాత శరీరంపై దద్దుర్లు కనిపించాయి. దీంతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా.. పరీక్షించిన వైద్యులు మంకీపాక్స్‌ లక్షణాల్లా ఉన్నాయని అనుమానించారు. దీంతో బాధితుడు ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. అనంతరం పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం రాత్రి ఆ వ్యక్తిని హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. నిబంధనల మేరకు బాధితుడి నుంచి మూత్రం.. రక్తం.. దద్దుర్లు వచ్చిన భాగం నుంచి చిన్న ముక్క.. దద్దుర్ల నుంచి స్రావాలు కారుతుంటే ఆ స్రావాలను.. గొంతు, ముక్కు నుంచి కూడా నమూనాలను సేకరించాల్సి ఉంటుందని ఫీవర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. సోమవారం ఈ నమూనాలను సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తామన్నారు.

సన్నిహితులపై ఆరా

బాధితుడు రాష్ట్రానికి వచ్చి రెండు వారాలు గడిచిపోవడంతో.. ఈ సమయంలో ఎంతమందితో సన్నిహితంగా మెలిగాడన్న దానిపై వైద్యశాఖలో ఆందోళన నెలకొంది. అయితే, కుటుంబసభ్యులెవరిలోనూ లక్షణాలు కనిపించలేదని వైద్యవర్గాలు చెబుతున్నాయి. అయినా ముందు జాగ్రత్త చర్యగా వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచారు. దీంతోపాటు బాధితుడు రెండు వారాల్లో ఇంకా ఎవరెవరితో సన్నిహితంగా మెలిగాడనే సమాచారాన్ని వైద్య సిబ్బంది సేకరిస్తున్నారు. కలివిడిగా ఉన్న వారందరూ నిర్ధారణ పరీక్షల ఫలితాలొచ్చే వరకూ స్వీయ నిర్బంధాన్ని పాటించాలని వైద్యవర్గాలు విజ్ఞప్తి చేశాయి. ఫీవర్‌ ఆసుపత్రిలో చేరిన బాధితుడి శరీరంపై లక్షణాలను వైద్య సిబ్బంది ఫొటోలు తీశారు. వాటిని విశ్లేషణ కోసం నిపుణులకు పంపించనున్నారు. మంకీపాక్స్‌కు సంబంధించి ఇప్పటికే ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. వ్యాప్తిని నివారించడానికి అన్ని చర్యలూ చేపట్టాలని ఆదేశించారు. కేవలం విదేశాల నుంచి వచ్చే వారి నుంచే కాకుండా స్థానికంగా ఉన్న వారిలోనూ లక్షణాలు కనిపిస్తే నమూనాలను సేకరించాలని చెప్పారు. మంకీపాక్స్‌పై ఏవైనా అనుమానాలుంటే 9030227324 నంబరుకు వాట్సప్‌ ద్వారా సమాచారాన్ని పంపించొచ్చని.. కాల్‌ చేయాలనుకుంటే 040 24651119 నంబరును సంప్రదించాలని శ్రీనివాసరావు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు తమకు సూచనలు ఇస్తున్నారని.. ఈ వ్యాధిపై ఆందోళన అవసరం లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని