ముంపు ముప్పు తప్పించేదెలా?

భారీ వరదతో కాళేశ్వరం పంపుహౌస్‌లు నీట మునిగిన నేపథ్యంలో మళ్లీ ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నీటిపారుదల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా సీతారామ ఎత్తిపోతల కోసం నిర్మిస్తున్న

Published : 19 Aug 2022 03:52 IST

పంపుహౌస్‌లకు రక్షణపై కసరత్తు

ఈనాడు హైదరాబాద్‌: భారీ వరదతో కాళేశ్వరం పంపుహౌస్‌లు నీట మునిగిన నేపథ్యంలో మళ్లీ ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నీటిపారుదల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా సీతారామ ఎత్తిపోతల కోసం నిర్మిస్తున్న పంపుహౌస్‌లలో మార్పులు తలపెట్టినట్లు తెలుస్తోంది. స్ట్రాటజిక్‌ ఫ్రీక్వెన్సీ కన్వర్ట్స్‌ (ఎస్‌ఎఫ్‌సీ) ఉండే గదితో పాటు, ఎల్‌.టి బోర్డులను కూడా పైకి మార్చాలని సంబంధిత అధికారులు సీతారామ ఎత్తిపోతల ఇంజినీర్లకు సూచించినట్లు తెలిసింది. కాళేశ్వరం పంపుహౌస్‌లు మునగక ముందే సీతారామ పంపుహౌస్‌లను పరిశీలించి పలు సూచనలు చేసిన అధికారులు.. ఇప్పుడు వాటిని అమలు చేయించే పనిలో ఉన్నట్లు సమాచారం.

దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి గోదావరి నీటిని మళ్లించి 6.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు సరఫరా చేసేందుకు సీతారామ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిన ప్రభుత్వం.. ఇందుకోసం నాలుగు పంపుహౌస్‌లను నిర్మిస్తోంది. తర్వాత దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద 36.57 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణం చేపట్టింది. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 63 మీటర్లు.. టాప్‌ బండ్‌ లెవెల్‌ 68 మీటర్లు. దీని నుంచి నీటిని మళ్లించే సీతారామ ఎత్తిపోతల మొదటి పంపుహౌస్‌ 56.60 మీటర్ల వద్ద ఉంది. బ్యారేజికి, ఈ పంపుహౌస్‌కు మధ్య 10.5 కి.మీ మేర అప్రోచ్‌ ఛానల్‌ ఉంది. ఈ ఛానల్‌ నుంచి నీటిని తీసుకునే చోట.. 4.7 కి.మీ. కింద రెండు రెగ్యులేటర్లు నిర్మించారు. అప్రోచ్‌ ఛానల్‌ గట్ల సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నారు. గతంలో దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద 60.25 మీటర్ల మట్టానికి వరద రాగా, ఇటీవల 60.46 మీటర్ల వరకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పంపుహౌస్‌ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి తదితరులు గతంలో పంపుహౌస్‌లను పరిశీలించినప్పుడు వారి దృష్టికి వచ్చిన అంశాలన్నింటినీ ఇప్పుడు అమలు చేయించనున్నట్లు తెలిసింది. రెండో పంపుహౌస్‌ 47వ కి.మీ వద్ద ఉండగా, 43 వ కి.మీ వద్ద ఎస్కేప్‌ ఛానల్‌ ఏర్పాటు చేయాలని కూడా సూచించినట్లు తెలిసింది. పంపుహౌస్‌లలోకి నీళ్లు రాకుండా చూసుకోవడం, వచ్చినా వెళ్లిపోయేలా ఎస్కేప్‌ ఛానల్‌ ఏర్పాటు, ఎస్‌ఎఫ్‌సీలు, ఎల్‌.టిలను పై భాగంలోకి తేవడం తదితర మార్పులను సూచించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.


కన్నెపల్లిలోనూ మారిందా!

అన్నారం పంపుహౌస్‌ సివిల్‌ వర్క్స్‌ డిజైన్‌ మార్చినట్లుగానే కన్నెపల్లి (మేడిగడ్డ) పంపుహౌస్‌లో కూడా చేసినట్లు తెలిసింది. పంపుహౌస్‌ నిర్వహణ ప్రాంతాన్ని (మెయింటెనెన్స్‌ బే) 111 మీటర్లుగా నిర్ణయిస్తూ 2016 నవంబరు 4న జెన్‌కో డ్రాయింగ్‌(రేఖాచిత్రం) ఇచ్చినట్లు సమాచారం. దీనిపై కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ కూడా సంతకం చేశారు. కానీ తర్వాత 106.70 మీటర్లకు తగ్గించి నిర్మాణం చేశారు. స్విచ్‌గేర్‌ మొదటి గదిని 99 మీటర్ల నుంచి 94.7 మీటర్లకు, రెండో గదిని 105 నుంచి 100.7 మీటర్లకు తగ్గించారు. ఇలా మొత్తంమీద 4.3 మీటర్ల ఎత్తు తగ్గింది. ఇక్కడ గరిష్ఠ మట్టానికి మించి 107 మీటర్ల వరకు వరద వచ్చింది. స్థానికంగా కురిసిన భారీ వర్షాలతో నదిలో ప్రవాహంతోపాటు అన్ని వైపుల నుంచి నీరు రావడంతో పంపుహౌస్‌ మునిగిపోయిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ 111 మీటర్ల వద్ద నిర్వహణ ప్రాంతం, అక్కడి వరకు కాంక్రీటు నిర్మాణం ఉంటే ఇంత నష్టం వాటిల్లేది కాదన్న అభిప్రాయం  నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. త్వరగా పని పూర్తిచేయడానికి వీలుగా ‘ఎ’ టైప్‌ క్రేన్‌ వాడటం, రక్షణ గోడ నిర్మాణంలో మార్పుల వల్ల కూడా కొంత నష్టం వాటిల్లినట్లు సంబంధిత వర్గాల సమాచారం. వాస్తవానికి సివిల్‌ వర్క్‌కు సంబంధించిన డిజైన్‌ అయినప్పటికీ సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో)కు వెళ్లలేదని తెలిసింది. ఈ మార్పులో ప్రాజెక్టు ఇంజినీర్లదే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఈ పనులను ఈపీసీ పద్ధతిలో కాకుండా.. చేసిన పనికి తగ్గట్లుగా చెల్లించే రేటు కాంట్రాక్టు పద్ధతిలో టెండర్లు ఖరారు చేశారు. అలాంటప్పుడు మొదట ఆమోదించిన డిజైన్‌ను కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్‌లలో ఎందుకు మార్చారన్నది చర్చనీయాంశం. అన్నారం వద్ద నీటిపారుదల శాఖ పంపుహౌస్‌ మట్టాన్ని తగ్గించి ఇచ్చిన డిజైన్‌కు ఆమోద ముద్ర వేసిన జెన్‌కో, విద్యుత్తు సబ్‌ స్టేషన్‌ నిర్మాణం విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంది. గరిష్ఠ వరద మట్టాన్ని పరిగణనలోకి తీసుకొని 130 మీటర్లకు పైనే పెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని