పబ్‌లలో రాత్రి 10 తరవాత శబ్ద కాలుష్యంపై కేసుల నమోదు

హైదరాబాద్‌లో పబ్‌ల నిర్వహణలో నిబంధనలను, గతంలో ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని పోలీసులకు సోమవారం హైకోర్టు స్పష్టం చేసింది. రాత్రి 10 గంటల తరువాత సంగీత హోరుతో శబ్ద కాలుష్యం

Updated : 27 Sep 2022 06:03 IST

పోలీసులకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో పబ్‌ల నిర్వహణలో నిబంధనలను, గతంలో ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని పోలీసులకు సోమవారం హైకోర్టు స్పష్టం చేసింది. రాత్రి 10 గంటల తరువాత సంగీత హోరుతో శబ్ద కాలుష్యం సృష్టిస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంది. నివాస ప్రాంతాల్లో పబ్‌లకు అనుమతి మంజూరు చేసే ముందు నిబంధనలు అమలు చేశారో లేదో పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఎక్సైజ్‌ శాఖను ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు హెచ్చరించింది. నివాస ప్రాంతాల్లోని పబ్‌లు చెవులు చిల్లులు పడేలా శబ్దాలు చేస్తున్నాయని, నిబంధనలను ఉల్లంఘిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, వాహనాలను తమ ఇళ్ల ముందు పార్కింగ్‌ చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ జూబ్లీహిల్స్‌ రెసిడెంట్‌ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ అసోసియేషన్‌, బి.సుభాష్‌రెడ్డిలతో పాటు మరో అయిదుగురు దాఖలు చేసిన పిటిషన్‌లపై జస్టిస్‌ కన్నెగంటి లలిత మరోసారి విచారణ చేపట్టారు. గత ఆదేశాల మేరకు సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనర్లు కౌంటర్లు దాఖలు చేశారు. సైబరాబాద్‌లో 34, రాచకొండలో 2 పబ్‌లున్నాయని, ఇందులో లౌడ్‌స్పీకర్లు వినియోగించడానికి అనుమతి మంజూరు చేయలేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌ కమిషనర్‌ తరఫున కౌంటరు దాఖలు చేయడానికి మరికొంత గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది శ్రీకాంత్‌రెడ్డి కోరారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పి.ఎస్‌.ఎస్‌.కైలాస్‌నాథ్‌, ఎస్‌.నగేష్‌రెడ్డి, రాజశేఖర్‌లు వాదనలు వినిపించారు. వాదనలను విన్న న్యాయమూర్తి గతంలో వినోద కార్యక్రమాల నిబంధనల కింద అనుమతుల్లేకుండా పాటలు, ఆటలు, సంగీతం కార్యక్రమాలు నిర్వహిస్తుంటే నిలిపివేయాలని, లైసెన్స్‌ ఉన్న పబ్‌లపై 10 గంటల తరువాత శబ్దకాలుష్యం సృష్టిస్తే చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలను అమలు చేయాలన్నారు. విచారణను దసరా సెలవుల తర్వాతకు వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని